ఎమ్మెల్సీ అభ్యర్థిగా యర్రా?!
ఎమ్మెల్సీ అభ్యర్థి రేసులో యర్రా?! తెలుగుదేశం పార్టీ నాయకుడు యర్రా వేణు గోపాలరాయుడు ఏ పదవికైనా పోటీ పడేందుకు సిద్దమే అన్నట్లు ఉన్నారు. కరోనా తరువాత…
ఎమ్మెల్సీ అభ్యర్థి రేసులో యర్రా?!
తెలుగుదేశం పార్టీ నాయకుడు యర్రా వేణు గోపాలరాయుడు ఏ పదవికైనా పోటీ పడేందుకు సిద్దమే అన్నట్లు ఉన్నారు. కరోనా తరువాత మేయర్ ఎన్నికలు ప్రకటించక ముందే తానే మేయర్ అభ్యర్థి నంటూ పాత్రికేయులకు పార్టీ కూడా ఇచ్చారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా అసెంబ్లీ సీటు కోసం విఫలయత్నం చేశారు. తాజాగా వచ్చే మార్చిలో జరిగే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం రేసులో ఉన్నట్లుగా ఎంఏ సోషల్ వర్క్, బిఎల్ విద్యను అభ్యసించిన యర్రా వేణుగోపాలరాయుడు సంకేతాలు ఇస్తున్నారు. పట్టభద్రులుగా ఓట్లు నమోదు చేసుకోవాలంటూ కూటమి నేతల కూడిన ఫొటోలతో ఒక కరపత్రాన్ని కూడా ఆయన పంపిణీ చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రాజమహేంద్రవరంలో జరిగిన టిడిపి, జనసేన, బిజెపి కూటమి నేతల సమావేశంలో ఎవరి పేరునూ ప్రస్తావించకపోవడం గమనార్హం. వేణుగోపాలరాయుడు గతంలో పలు పార్టీలు మారినా…సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గెలుపుకోసం నిడదవోలు నియోజకవర్గంలో పనిచేశారు. అలాగే ఆయన సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి సోదరుడు రాజేంద్రప్రసాద్ కు దగ్గరి బంధువు కూడా. వాగ్ధాటి కలిగిన యర్రా వేణుగోపాలరావుకు ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో ఎపి అర్బన్ ఫైనాన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్న యర్రా గతంలో శాప్ డైరెక్టర్ గా పనిచేశారు. అయితే ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా చట్టసభకు వెళ్లాలన్నది యర్రా ధ్యేయంగా కనిపిస్తోంది. దుర్గేష్ తో సాన్నిహిత్యం, గోరంట్లతో బంధుత్వం ఆయన అభ్యర్థిత్వానికి ఎంత మేరకు సహకరిస్తాయో వేచిచూడాల్సిందే.