- October 10, 2024
మానవతామూర్తి మన టాటా
గొప్ప దాత, అంతకు మించిన గొప్ప మానవతా వాది రతన్ టాటా. అందుకే ఆయన మరణం దేశంలోని కుల, మతాలు, రంగాలు, వయోబేధాలకు అతీతంగా దేశవ్యాప్తంగా అందర్నీ…
గొప్ప దాత, అంతకు మించిన గొప్ప మానవతా వాది రతన్ టాటా. అందుకే ఆయన మరణం దేశంలోని కుల, మతాలు, రంగాలు, వయోబేధాలకు అతీతంగా దేశవ్యాప్తంగా అందర్నీ కంటతడి పెట్టించింది. తమ కుటుంబంలోని ఒక సభ్యుడ్ని కోల్పోయినట్లు బాధపడ్డారు. 86 ఏళ్ల రతన్ టాటా బుధవారం రాత్రి అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పారిశ్రామికవేత్త అంటేనే లాభాలు, సంపద సృష్టి కోసం పాకులాడుతుంటారు. భారదదేశ పారిశ్రామికరంగానికి దిక్సూచి లాంటి రతన్ టాటా అందుకు ఎంతో భిన్నంగా ఉంటారు. తన ఉద్యోగుల సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అందుకే టాటా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు వాటిని వీడేందుకు అస్సలు ఇష్టపడరు. 1937 డిసెంబర్ 28న ముంబయిలో నావల్ టాటా- సోనీ టాటా దంపతులకు జన్మించిన రతన్ టాటా.. కార్నెల్ యూనివర్సిటీ నుంచి బీ-ఆర్క్ డిగ్రీ పట్టా పొందారు. 1975లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం పూర్తి చేశారు. తన డిగ్రీ పూర్తి కావడంతో రతన్ టాటా.. 1962లో టాటా గ్రూప్‌లో చేరారు. తొలుత టాటా స్టీల్ సంస్థలో షాప్ ఫ్లోర్‌లో ఉద్యోగిగా పనిచేశారు. 1971లో నేషనల్ రేడియో, ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 1991లో జేఆర్‌డీ టాటా నుంచి టాటా సన్స్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన.. టాటా గ్రూప్‌నకు నేతృత్వం వహించారు. ఆయన కృషి వల్లే టాటా గ్రూప్ ప్రస్తుతం 110 దేశాల్లో విస్తరించింది. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్‌నకు రతన్ టాటా ఛైర్మన్‌గా సేవలందించారు. అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్‌గా వ్యవహరించారు. తరువాత ఆ బాధ్యతల నుంచి స్వచ్చందంగా వైదొలిగారు. 2000లో రతన్ టాటా సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌ను, 2008లో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ను ప్రకటించింది. అవివాహితుడైన రతన్ టాటా జీవితంలో ప్రేమ కోణాలు కూడా ఉన్నాయి. సినీ నటి సిమీ గరేవాల్ ను ఆయన ప్రేమించి, పెళ్లి చేసుకోవాలని భావించినా సాధ్యం కాలేదు.