గోరంట్ల వారసుడు పోటీకి సిద్ధం!
సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి 80వ జన్మదిన వేడుకలు ఎంతో ఆర్భాటంగా జరిగాయి. ఈసందర్భంగా గోరంట్ల దంపతులను కార్యకర్తలు, అభిమానులు గుర్రంపై ఊరేగించారు. గోరంట్ల కోటరీకి చెందిన…

సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి 80వ జన్మదిన వేడుకలు ఎంతో ఆర్భాటంగా జరిగాయి. ఈసందర్భంగా గోరంట్ల దంపతులను కార్యకర్తలు, అభిమానులు గుర్రంపై ఊరేగించారు. గోరంట్ల కోటరీకి చెందిన మహిళా నాయకురాలు మజ్జి పద్మ ఒక వీడియోను కూడా విడుదల చేయడం విశేషం. ఈఆర్భాటాలు చూస్తుంటే వచ్చే ఎన్నికల నాటికి గోరంట్ల రాజకీయాల నుంచి నిష్క్రమిస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత అక్టోబర్ లో గోరంట్లను సిసిసి తరుపున ఇంటర్వ్యూ చేసినపుడు ఇవే తనకు చివరి ఎన్నికలని స్పష్టం చేశారు. తనకు రాజకీయ వారసులెవరూ లేరని, తన సోదరుడి కుమారుడు నరాల వైద్యుడైన డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ వైద్యవృత్తిలో బిజీగా ఉండటంతో పాటు, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకు ద్వారా సామాజిక సేవల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారని, అయితే రవిరామ్ తన ఆశయాలకే తప్ప రాజకీయాలకు వారసుడు కాదని స్పష్టం చేశారు. తన కుమార్తెలకు రాజకీయాల పట్ల ఆస్తకి లేదని గోరంట్ల స్పష్టం చేశారు. గోరంట్ల ప్రకటన తరువాత పరిణామాలు వేగంగా మారిపోయాయి.
ఏ కారణాల వల్లో గోరంట్ల ప్రకటన తరువాత గోరంట్ల రవిరామ్ కిరణ్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం ప్రారంభించారు. తన పెదనాన్న జన్మదిన వేడుకల్లో కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. దీంతో గోరంట్ల రాజకీయ వారసుడు రవిరామ్ కిరణేనన్న వాదనలకు బలం చేకూరింది. దీనిపై రవిరామ్ కిరణ్ ను ఆరా తీయగా అటు వైద్య వృత్తితో పాటు, రాజకీయాల్లో కూడా కొనసాగుతానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి కూడా సిద్ధమని స్పష్టం చేశారు.
రవిరామ్ కిరణ్ రాజకీయ ప్రవేశం కూడా అనూహ్యంగా జరిగింది. గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో గోరంట్ల రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తన కుమారుడు వాసు తన రాజకీయ వారసుడని ప్రకటించారు. ఆ వెంటనే గోరంట్ల కూడా రవిరామ్ కిరణ్ ను రాజకీయ వారసుడిగా ప్రకటించినా…కొద్దికాలం పాటు ఆయన వైద్య వృత్తికే పరిమితమయ్యారు. ఆతరువాత ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ను ఏర్పాటు చేయడంతో పాటు సామాజిక, రాజకీయ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. సౌమ్యుడైన రవిరామ్ కిరణ్ గోరంట్ల రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టి, వాసు తరహాలో ఎమ్మెల్యేగా ఎన్నికలవుతారా లేదా అన్నది రానున్న రోజుల్లో తేలిపోనుంది.