దోపిడీ దొంగల కోసం విజయశాంతి ఫోన్?!…నాటి జ్ఞాపకాలు పంచుకున్న ఏఎస్పీ సుబ్బరాజు
తూర్పుగోదావరి జిల్లా శాంతిభద్రతల విభాగం ఏఎస్పీ అల్లూరి వెంకట సుబ్బరాజు తన సర్వీసులో గుర్తుండిపోయే ఒక దోపిడీ కేసు విశేషాలను దివాకరమ్ న్యూస్ తో పంచుకున్నారు. ఈకేసులో…

తూర్పుగోదావరి జిల్లా శాంతిభద్రతల విభాగం ఏఎస్పీ అల్లూరి వెంకట సుబ్బరాజు తన సర్వీసులో గుర్తుండిపోయే ఒక దోపిడీ కేసు విశేషాలను దివాకరమ్ న్యూస్ తో పంచుకున్నారు. ఈకేసులో దోషులకు శిక్ష పడటం తనకు సంతృప్తిని కలిగించిందని ఆయన తెలిపారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే….
అది 2008వ సంవత్సరం ఆగస్టు నెల 2వ తేదీ. ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లోని శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి పోలీసుస్టేషన్ లో హోంగార్డుగా పనిచేస్తున్న గేదెల శోభన్ బాబు విధులు ముగించుకుని తన మోటారు సైకిల్ పై రాత్రి టెక్కలిలోని తన ఇంటికి వెళ్తున్నారు. మూలపేట సెంటర్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి లిఫ్ట్ అడగటంతో మోటారు సైకిల్ ను ఆపారు. అదే అదనుగా ఆగంతకుడు శోభన్ బాబు మోటారు సైకిల్ తాళం చేతులు బలవంతంగా లాక్కోవడం…పక్కనే పొదల్లో దాగి ఉన్న మరో ముగ్గరు వ్యక్తులు కత్తితో తలపై దాడి చేసి, కాళ్లు, చేతులు బంధించి పొదల్లో వదిలేవేయడం తరువాత దుండగులు శోభన్ బాబు వద్ద ఉన్న రూ. 950 నగదుతో పాటు, మోటారు సైకిల్ ను లాక్కుని పారిపోవడం క్షణాల్లో జరిగిపోయాయి. బంధితుడిగా ఉన్న శోభన్ బాబు పాకుతూ ఎట్టకేలకు రోడ్డుపైకి రావడంతో ఈదోపిడీ విషయం పోలీసులకు చేరింది. అప్పటికీ అర్థరాత్రి దాటిపోయింది. నాటి పాతపట్నం ఎస్ఐగా ఉన్న వేణుగోపాలరావు ద్వారా సమాచారం అందుకున్న నాటి ఇనస్పెక్టర్, నేటి ఎఏఎస్పీ అల్లూరి వెంకట సుబ్బరాజు మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ఎలాంటి బందోబస్తు లేకుండా సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. ప్రాథమికంగా పరిశీలన చేసి, మరుసటి రోజున మరోసారి సంఘటనా స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తులోకి దిగారు.
తెలంగాణా రాష్ట్రం రంగారెడ్డి జిల్లా షామీర్ పేట మండలం తూముకుంట గ్రామానికి చెందిన కోరాడ షణ్మఖరావు, మెలియాపుట్టి మండలం కొదుకొలిగాం గ్రామానికి చెందిన చిప్పాడ మోహనరావు, అదే గ్రామానికి చెందిన చిప్పాడ రాంబాబు, మెలియాపుట్టి మండలం పాతమారుడికోట గ్రామానికి చెందిన సామంత శ్రీనులను నిందితులుగా గుర్తించారు. వారిని 2008 ఆగస్టు 13న అరెస్టు చేసి, విచారించగా, మోటారు సైకిల్ ను ఒడిశాలో విక్రయించినట్లు తేలింది. తెలంగాణా దొంగకు, శ్రీకాకుళం జిల్లా దొంగలకు హైదరాబాద్ చర్లపల్లి జైల్లో దోస్తీ కుదిరింది. ఒక ముఠాగా ఏర్పడి మోటారు సైకిళ్లు చోరీ చేయడం, అడ్డం వస్తే దాడి చేసి, తీవ్రంగా గాయపరచడం ఈముఠా చేసే పని. అప్పటికే ఈముఠా ఐదారు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. సుబ్బరాజు నేతృత్వంలో పోలీసులు వారిని అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు.
అప్పుడే ఊహించని విశేషం జరిగింది. షణ్ముఖరావు కోసం అప్పుడే తెలంగాణాలో తల్లి తెలంగాణా పార్టీ స్థాపించిన ప్రముఖ సినీనటి విజయశాంతి సుబ్బరాజుకు ఫోన్ చేసి ఆరా తీశారు. అతను తెలంగాణాలో ఆపార్టీ కార్యకర్తగా కొనసాగడమే ఇందుకు కారణం. ఈకేసులో తగిన ఆధారాలు ఉండటంతో సిఐ సుబ్బరాజు షణ్ముఖరావును వదిలేందుకు అంగీకరించలేదు. విజయశాంతి ప్రస్తుతం తెలంగాణా శాసనమండలి సభ్యురాలిగా ఉన్నారు. మరోవైపు ఒడిశాలో తాకట్టుపెట్టిన మోటారు సైకిల్ ను విడిపించడం కూడా సవాల్ గా మారింది. సాధారణంగా ఒడిశా పోలీసుల నుంచి చోరీ సొత్తు రికవరీ చేయడం కష్టం. కొన్నిసార్లు రికవరీకి వచ్చిన పోలీసులనే వారు అరెస్టు చేస్తుంటారట. ఎట్టకేలకు ఈకేసు దర్యాప్తును సుబ్బరాజు పూర్తి చేసి, న్యాయస్థానంలో చార్జిషీటు దాఖలు చేశారు. ఈకేసును విచారించిన న్యాయస్థానం 2012లో షణ్ముఖరావుకు రెండేళ్ల కఠిన కారాగార శిక్ష రూ. 1000 జరిమానా విధించింది. తరువాత మిగిలిన నిందితులను కూడా కోర్టు దోషులుగా నిర్ధారించి, శిక్షలు ఖరారు చేసింది. హోంగార్డు శోభన్ బాబు మోటారు సైకిల్ తో పాటు, నగదును కూడా పోలీసులు రికవరీ చేశారు.
ఈకేసుతో పాటు, 2014లో జంగారెడ్డిగూడెం మండలం దమ్మపేటలో కొయ్యలగూడెంనకు చెందిన ఒక వ్యాపారిని దుండగులు డబ్బుకోసం హత్య చేసి, పాతిపెట్టారని, ఈకేసును కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేవలం రెండురోజుల్లోనే నిందితులను అరెస్టు చేశామని చెప్పారు. నాటి హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పోలీసుల పనితీరును ఎంతో ప్రశంసించారని సుబ్బరాజు గుర్తుచేసుకున్నారు. ఈరెండు కేసులు తన సర్వీసులో గుర్తుండిపోతాయని సుబ్బరాజు పేర్కొన్నారు.