ఆ ఘనత నాది…కాదు నాది…నరసన్న కొండపై రోప్ వే కోసం…తాజా…మాజీ.. సామాజిక మాధ్యమ పోటీ!

కోరుకున్న కోర్కెలు తీర్చే కోరుకొండలో కొండపై నెలవైన శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి రోప్ వే ప్రాజెక్టు సాకారానికి చర్యలు తీసుకోవడం భక్తులకు సంతోషం కలిగించే శుభవార్త. అయితే…

 ఆ ఘనత నాది…కాదు నాది…నరసన్న కొండపై రోప్ వే కోసం…తాజా…మాజీ.. సామాజిక మాధ్యమ పోటీ!

కోరుకున్న కోర్కెలు తీర్చే కోరుకొండలో కొండపై నెలవైన శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి రోప్ వే ప్రాజెక్టు సాకారానికి చర్యలు తీసుకోవడం భక్తులకు సంతోషం కలిగించే శుభవార్త. అయితే ఈరోప్ వే నిర్మాణం ఘనతను సొంతం చేసుకునేందుకు రాజానగరం తాజా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సామాజిక మాధ్యమాల వేదికగా పోటీపడుతున్నారు. రోప్ వే డిపిఆర్ కు టెండర్లు ఆహ్వానించినట్లు సమాచారం రాగానే బత్తుల, జక్కంపూడి తమ రోప్ వే కోసం తాము చేసిన కృషిని సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు. వీటికి సంబంధించిన ఫొటోలను కూడా వారు పంచుకున్నారు. తాజా, మాజీల మధ్య జరుగుతున్న ఈపోటీ ఆసక్తికరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ ను పర్యాటక రంగంలో అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని, అందులో భాగంగా శ్రీలక్ష్మీ నరసింహస్వామి గుడికి రోప్ వే నిర్మాణానికి తాను రాష్ట్రం ద్వారా కేంద్రానికి పంపిన ప్రతిపాదన ఆమోదం పొందిందని బత్తుల బలరామకృష్ణ స్పష్టం చేశారు. తన ఆలోచన ప్రకారమే శ్రీలక్ష్మీ నరసింహ దేవస్థానం అభివృద్ధి కోసం దేవాదాయశాఖ, అన్నవరం దేవస్థానం సమగ్ర ప్రణాళికతో డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారుచేసి, దాన్ని ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు పురందేశ్వరి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తమ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి కందుల దుర్గేష్ లకు అందజేసినట్లు బత్తుల తెలిపారు. డిపిఆర్ ను పురంధరేశ్వరి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు అందించి, రూ. 36కోట్ల అభివృద్ధి ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేయించారని బత్తుల వెల్లడించారు. 0.25 కిలోమీటర్ల మేర ఆలయం కింద భాగం నుండి ఆలయం శిఖరాగ్రం వరకు రోప్ వే ఏర్పాటు చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. శ్రీలక్ష్మీ నరసింహ ఆలయంతో పాటు, చిత్తూరు జిల్లా బోయకొండ గంగమ్మ ఆలయం, కర్నూలు జిల్లా అహోబిళం, పల్నాడులోని కోటప్పకొండ ఆలయం, విజయవాడలోని భవానీ ద్వీపంకు రోప్ వే ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై సమగ్ర ప్రాజెక్టు నివేదికకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ లాజిస్టిక్ విభాగం టెండర్లు ఆహ్వానించింది.
బత్తుల అభివృద్ధి వాదనకు ప్రతిగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తాను చేసిన కృషిని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. తాను 2021 లో ఢిల్లీ లో పర్యటించి కోరుకొండ లక్ష్మి నరసింహస్వామి ఆలయ రోప్ వే పనుల అనుమతులకు సంబంధించి నివేదికలను కేంద్ర ప్రభుత్వ అధికారులకు సమర్పించానని, దీనిపై అధికారులు సానుకూలంగా స్పందించారన్నారు. దాని ఫలితంగానే నేడు కోరుకొండ పాండవుల మెట్ట నుంచి కొండ పైన లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి రోప్ వే కు నేషనల్ హైవే అథారిటీ అనుమతి లభించినట్లు పేర్కొన్నారు. పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగించే విధంగా పాండవుల మెట్ట కొండ నుండి కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం వరకు రోప్ వే ఏర్పాటు చేయుటకు నిర్ణయించామని దానికోసం కోల్‌కతాకు చెందిన దామోదర్ రోప్‌వేస్ అండ్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ సంస్థ వారిచే సర్వే చేయించినట్లు జక్కంపూడి రాజా వెల్లడించారు. ఈ ప్రాంతం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందాలంటే ఆర్కియాలజి డిపార్ట్మెంట్ అనుమతులు అవసరం కారణంగా గతంలోనే హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఆర్కియాలజిస్ట్ మూర్తితో ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదికలు తయారు చేయించి వాటిని కేంద్ర పురావస్తు శాఖకు పంపి, డిల్లీలోని డైరెక్టర్ జనరల్ ఆర్కియాలజీ వి.విద్యావతిని కలిసి కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి సహకరించాల్సిందిగా కోరుతూ వినతిపత్రాన్ని అందించినట్లు రాజా వివరించారు. శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి గతంలోనే శ్రీ త్రిదిండి చినజీయర్ స్వామీ చేతుల మీదుగా భూమి పూజ చేయించినట్లు రాజా వెల్లడించారు. తన ఆలోచనలు కృషి, ఎంపి దగ్గుబాటి పురంధరేశ్వరి, కూటమి ప్రభుత్వ చొరవ ఫలితంగానే రోప్ వే సాకారం కానున్నట్లు బత్తుల ప్రకటిస్తుంటే…ప్రణాళికలు, కృషి తనది, పేరు బత్తులది అన్నట్లుగా జక్కంపూడి రాజా చెబుతున్నారు.

Leave a Reply