అక్కడ గోవులు…ఇక్కడ రోగులు

తిరుమల తిరుపతి దేవస్థానంలో గోవుల మృతి, రాజమహేంద్రవరంలోని ధర్మాసుపత్రిలో అధ్వాన్న పరిస్థితులు రాజకీయ మలుపుతీసుకుంటున్నాయి. తిరుమలలో గోవుల మృతి రాష్ట్రవ్యాప్తంగా వైసిపికి, కూటమి నేతలకు మధ్య సవాళ్లు,…

 అక్కడ గోవులు…ఇక్కడ రోగులు

తిరుమల తిరుపతి దేవస్థానంలో గోవుల మృతి, రాజమహేంద్రవరంలోని ధర్మాసుపత్రిలో అధ్వాన్న పరిస్థితులు రాజకీయ మలుపుతీసుకుంటున్నాయి. తిరుమలలో గోవుల మృతి రాష్ట్రవ్యాప్తంగా వైసిపికి, కూటమి నేతలకు మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లకు దారితీయగా… రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి అంశంపై వైసిపికి కూటమి నాయకులు ముఖ్యంగా టిడిపి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకి మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలకు దారితీస్తోంది.
రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి అంశం చిరకాల రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న వాసు వర్సెస్ మాజీ ఎంపి భరత్ గా రూపాంతరం చెందుతోంది. రాజమహేంద్రవరం ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి వాసు ప్రభుత్వాసుపత్రిలో రోగులకు సౌకర్యాల మెరుగు, ఇతర సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు. దీనిలో భాగంగా ఆయన ప్రతీ 15రోజులకు ఒకసారి ఆసుపత్రిని సందర్శించి, సమస్యలను ఆరా తీస్తున్నారు.
ఈనేపథ్యంలో రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలోని సెప్టిక్ వార్డు దుస్థితిపై ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారితీసింది. సెప్టిక్ వార్డులోని రోగులు నేలపై పడుకుని ఉన్నారు. కనీసం వార్డులో విద్యుత్ సౌకర్యం కూడా లేకపోవడంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారని పేర్కొంటూ ముగ్గురు యువకులు వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియో చూస్తే నిజంగా రోగుల పరిస్థితి దయనీయంగా కనిపించింది. గత 15ఏళ్లుగా సెప్టిక్ వార్డులోని రోగుల దుస్థితి ఇలాగే ఉందని తెలిసింది. వైద్యులు, సిబ్బంది ఎవరూ అటువైపు కన్నెత్తి చూడరని ఆసుపత్రి వర్గాలే చెబుతున్నాయి. దీర్ఘకాలిక వ్యాధుల బారినపడ్డ రోగులను కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడ వదిలేసి వెళ్లిపోతున్నారు. పడకలు, విద్యుత్ సౌకర్యం ఉన్నా…వీరిలో కొంతమందికి మతిస్థిమితం తప్పడం, అవయవాలు పనిచేయకపోవడంతో వార్డులో ఉండలేక దేక్కుంటూ..పాక్కుంటూ బయటకు వచ్చేస్తున్నారు. చాలా సార్లు ఇలాంటి దృశ్యాలు ఆసుపత్రికి వెళ్లే వారికి పరిచితమే.
యువకులు షేర్ చేసిన వైరల్ కావడంతో మాజీ ఎంపి భరత్ వద్దకు చేరడంతో స్పందించిన మరునాడే ఆయన ప్రభుత్వాసుపత్రికి చేరుకుని, సెప్టిక్ వార్డును పరిశీలించడంతో పాటు, అక్కడి దుస్థితిపై ఎమ్మెల్యే వాసును లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. భరత్ విమర్శలకు స్పందనగా శుక్రవారం ప్రభుత్వాసుపత్రి సందర్శన, మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన వెంట కూటమి నాయకులు బిజెపి జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, జనసేన ఇన్ చార్జి అత్తి సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. వీడియోలో పేర్కొన్న సెప్టిక్ వార్డును సందర్శంచి, మీడియాతో మాట్లాడుతూ మాజీ ఎంపి భరత్ విమర్శలకు ఘాటుగా స్పందించారు.
అయితే ఎమ్మెల్యే వాసు ప్రభుత్వాసుపత్రిని ఎన్నిసార్లు సందర్శించినా అధికారులు, సిబ్బందిలో మార్పు లేదన్నది వాస్తవం. ఇప్పటికీ అక్కడ పోస్టుమార్టం, ఇతర సేవల కోసం సిబ్బందికి చేయి తడపాల్సిన పరిస్థితి వస్తోందన్నది వాస్తవం. ఇక స్మార్ట్ ఫోన్లు ఉన్న వారికే ఓపి సేవలు అందించే విధానం సామాన్య రోగులకు కాస్త ఇబ్బందిని కలిగిస్తోంది. ఆన్ లైన్ తో పాటు, ఆఫ్ లైన్ ఓపి సేవలు కూడా కొనసాగించాలని రోగులకు కోరుతున్నారు. నిర్భాగ్యులు ఉండే సెప్టిక్ వార్డులోని రోగుల పట్ల కనికరం చూపించి, కనీస సదుపాయాలు కల్పించి, సక్రమంగా వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకుంటే రోగులు కోలుకునే అవకాశాలుంటాయి. పేరు కోసం ఆసుపత్రి ప్రాంగణంలో అన్నదానాలు, ఇతర సేవలు అందించే దాతలకు సెప్టిక్ విభాగంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఆయుష్ విభాగంలో ఆపరేషన్ ధియేటర్ సేవలను కూడా పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. రాజకీయాలను పక్కనపెట్టి, పార్టీలకు అతీతంగా నాయకులు, ప్రజాప్రతినిధులు రాజమహేంద్రవరం ధర్మాసుపత్రిలో ధర్మంగా పేదలకు అందాల్సిన వైద్యసేవలు సక్రంగా అందించేందుకు కృషిచేయాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply