మహాశివరాత్రి….మరో పరీక్ష!

రోడ్డు, రైలు, విమాన ప్రయాణానికి అనువైన నగరం రాజమహేంద్రవరం. అందులోనూ సాంస్కృతిక రాజధాని కావడం…పవిత్ర గోదావరితీరాన ఉండి దక్షిణకాశీగా పేరొందడంతో ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది. దీంతో సహజంగానే మహాశివరాత్రి,…

 మహాశివరాత్రి….మరో పరీక్ష!

రోడ్డు, రైలు, విమాన ప్రయాణానికి అనువైన నగరం రాజమహేంద్రవరం. అందులోనూ సాంస్కృతిక రాజధాని కావడం…పవిత్ర గోదావరితీరాన ఉండి దక్షిణకాశీగా పేరొందడంతో ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది. దీంతో సహజంగానే మహాశివరాత్రి, గోదావరి పుష్కరాల వంటి పర్వదినాల్లో కోట్లాది మంది భక్తులు తరలివస్తారు. ఈమధ్యే ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట, తిరుపతిలో వైకుంఠ ద్వారదర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట వంటి దుర్ఘటనలు జరిగాయి. ప్రయాగ్ రాజ్ తొక్కిసలాటలో దాదాపు 40 మంది తిరుపతిలో 6 గురు మరణించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో రాజమహేంద్రవరంలో మహాశివరాత్రి పర్వదినం నాడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అధికార యంత్రాంగానికి ఒక పరీక్షగానే భావించవచ్చు. మహాశివరాత్రి సందర్భంగా రాజమహేంద్రవరంనకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చి, గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈదక్షిణ కాశీకి మరో విశిష్టత ఉంది. మహాశివరాత్రి సందర్భంగా రాజమహేంద్రవరంలో భక్తులు, దాతలు విస్తృతంగా దానధర్మాలు చేస్తారు. సామాన్యుల నుంచి ప్రముఖులు, కోటీశ్వరుల వరకు ఈజాబితాలో ఉంటారు. దాతలు తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు అల్పాహారం, పానియాలు, భోజనాలతో పాటు, స్వీట్లు, పండ్లు కూడా పంచారు. శివరాత్రి రోజున పిలిచి మరీ వితరణ చేయడం రాజమహేంద్రవరం వాసుల గొప్పతనం. దీనిని దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఈసారి భక్తుల రద్దీని నిరంతరం పర్యవేక్షించి, వారికి క్రమబద్ధీకరించేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఎప్పటికప్పుడు రద్దీని నియంత్రిస్తేనే తొక్కిసలాటలు, తోపులాటలకు తావుండదు. ఒకవిధంగా చెప్పాలంటే మహాశివరాత్రి ఏర్పాట్లు 2027 గోదావరి పుష్కరాలకు తొలి ట్రయల్స్ గా భావించవచ్చు.

మోక్షదాయిని మహాశివరాత్రి
జన్మానికో శివరాత్రి అంటారు గానీ, మహాశివరాత్రి పర్వదినం ఏటేటా వస్తూనే ఉంటుంది. మనలో నిద్రాణమైన భక్తిని జాగృతం చేస్తూనే ఉంటుంది. శివ భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండగ మహాశివరాత్రి పరమశివుడికి కూడా ప్రీతికరమైన రోజు. మహా శివరాత్రికి ఎన్నో ప్రాధాన్యతలు, ప్రత్యేకతలు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం.. శివుడు తాను గరళం మింగి మానవాళిని కాపాడిన రోజు మహా శివరాత్రి అని చెబుతుంటారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి, రాత్రి మొత్తం జాగారం చేస్తే పుణ్యం, మోక్షం లభిస్తుందని వేదాలు చెబుతున్నాయి. శివుడిని దర్శించుకుని, పూలు, ఫలాలతో శివలింగాన్ని పూజిస్తే పరమశివుడి కటాక్షం లభిస్తుందని, తద్వారా మోక్షం లభిస్తుందని శివ భక్తుల కు బలమైన విశ్వాసం. కూర్మ, వాయు, శివ పురాణాల ప్రకారం… భోళాశంకరుడు లింగరూపంలో దర్శనం ఇచ్చిన సందర్భం మహా శివరాత్రి.
జాగారం నేపథ్యం…
అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేశారు. అప్పుడు అమృతం కంటే ముందు హాలాహలం పుట్టింది. హాలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే అది ముల్లోకాలనూ దహించేసే ప్రమాదం ఉండటంతో దేవదానవులందరూ భయాందోళన చెందారు. హాలాహలం బారి నుంచి లోకాలను రక్షించాలంటూ మహాదేవుడైన శంకరుడిని శరణు వేడారు. లోక రక్షణ కోసం ఆ గరళాన్ని తానే మింగి, గొంతులో బంధించి అలా గరళకంఠుడయ్యాడు. హాలాహల ప్రభావానికి శివుడి కంఠం కమిలి, నీలంగా మారడంతో నీలకంఠుడిగా పేరుపొందాడు. గరళాన్ని గొంతులో బంధించడం వల్ల అది శివునిలో విపరీతమైన తాపాన్ని పుట్టించసాగింది. ఆ తాపాన్ని తగ్గించుకోవడానికి క్షీరసాగర మథనంలో పుట్టిన చంద్రుడిని తలపై ఉంచుకున్నాడు. నిరంతర తాపోపశమనం కోసం గంగను కూడా నెత్తిన పెట్టుకున్నాడు. అయినా, శివుడిని హాలాహల తాపం ఇబ్బంది పెడుతూనే ఉంటుందట. అందుకే భక్తులు నిత్యం శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. హాలాహలం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్ఛిల్లాడట. ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెలకువ వచ్చేంత వరకు జాగారం చేశారట. అందుకే ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి, జాగారం ఉంటారు. జాగారం ఉన్న సమయంలో శివనామ సంకీర్తనతోనూ, జప ధ్యానాలతోనూ కాలక్షేపం చేస్తారు. ఇదంతా మహాశివరాత్రి పర్వదినానికి గల పౌరాణిక నేపథ్యం. అయితే ఏడాదిలో కొన్ని రోజులు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రి పండ్లు, పలహారాలు తీసుకోవడం ఆరోగ్యానికి కూడా మంచిదేనని వైద్యులు కూడా సిఫార్సు చేస్తున్నారు. దీంతో శివరాత్రి రోజున ఉపవాసం అటు భక్తికి, ఇటు ఆరోగ్యానికి కూడా మంచిదే.

Leave a Reply