మేయర్ సీటుపై ముద్రగడ కుమార్తె “క్రాంతి”?!…మరి గన్ని?!

గత పరిణామాలను గమనిస్తే రాజమహేంద్రవరం మేయర్ పదవి ఇతర ప్రాంతాల నాయకులకు, అప్పటి వరకు గృహిణులుగా ఉన్న మహిళలకు అచ్చొచ్చిందనే చెప్పవచ్చు. తాజాగా జనసేన అధినేత పవన్…

 మేయర్ సీటుపై ముద్రగడ కుమార్తె “క్రాంతి”?!…మరి గన్ని?!

గత పరిణామాలను గమనిస్తే రాజమహేంద్రవరం మేయర్ పదవి ఇతర ప్రాంతాల నాయకులకు, అప్పటి వరకు గృహిణులుగా ఉన్న మహిళలకు అచ్చొచ్చిందనే చెప్పవచ్చు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఈగ కూడా వాలనివ్వకుండా కౌంటర్లు ఇస్తున్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కుమార్తె, జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి రాజమహేంద్రవరం మేయర్ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. పవన్ కల్యాణ్ ను విమర్శించిన తండ్రి ముద్రగడ పద్మానాభానికే ఘాటుగా కౌంటర్లు ఇవ్వడంతో తనకు ఆమెకు సంబంధం లేదని ముద్రగడ తేల్చేశారు. ఆమె మేయర్ బరిలో నిలిస్తే కూటమి ప్రభుత్వంలో భాగమైన జనసేన పార్టీతో పాటు, టిడిపి కూడా ఆమెకు సీటు కేటాయించే విషయాన్ని సీరియస్ గా ఆలోచించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఆపార్టీ తరుపున జనసేన ఇన్ చార్జి బిసి వర్గానికి చెందిన అత్తి సత్యనారాయణతో పాటు, చివరిసారిగా మేయర్ ఎన్నికల బరిలో నిలవాలని ఆశిస్తూ ఇప్పటికే మేయర్ గా పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించిన టిడిపి సీనియర్ నేత గన్ని కృష్ణ రాజకీయ భవిష్యత్ అనిశ్చితిగా మారుతుంది. క్రాంతి ఇటీవల డివిజన్ స్థాయి నాయకులతో మంతనాలు జరపడం కూడా ఆమె పోటీకి సిద్ధమవుతున్నారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈవిషయమై ఆమె కుటుంబ సభ్యులను వాకబు చేయగా రిజర్వేషన్లు, పార్టీ సమీకరణలు కలిసి వస్తే క్రాంతి పోటీ చేసే విషయమై ఆలోచిస్తామని చెబుతున్నారు. అంటే క్రాంతి పరోక్షంగా మేయర్ బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారన్న విషయం స్పష్టమవుతోంది. ఇక రాజమహేంద్రవరం మేయర్ ఎన్నికల బరిలో నిలిచేందుకు సీనియర్ టిడిపి నాయకుడు గన్ని కృష్ణ ఇప్పటికే కర్చీఫ్ వేసుకున్నారు. తాను పోటీకి సిద్ధమని ప్రకటించడంతో పాటు, సీటు ఇవ్వాలని పార్టీ అధినేత చంద్రబాబునాయుడును కూడా కలిసి కోరారు. రాజమహేంద్రవరం ఎంపి, రూరల్ ఎమ్మెల్యే, రుడా చైర్మన్ పదవులను కమ్మ సామాజిక వర్గానికే కేటాయించిన నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన గన్నికి సీటు దక్కుతుందా అన్న చర్చ జరుగుతోంది. ఇటీవల గోరంట్ల మీడియా సమావేశంలో మాట్లాడుతూ మేయర్ సీటు కోసం ఎంతో మంది ఆశావహులు ఎదురుచూస్తున్నారని చెప్పారు తప్ప గన్ని పేరు కూడా ప్రస్తావించకపోవడం ఇక్కడ గమనార్హం.

చారిత్రాత్మకమైన రాజమహేంద్రవరంలో 2027లో గోదావరి పుష్కరాలు ఘనంగా జరగనున్నాయి. గోదావరి పుష్కరాలకు దేశవ్యాప్తంగా సుమారు 8నుంచి 10కోట్ల మంది యాత్రికులు, భక్తులు హాజరవుతారని అంచనా. గోదావరి పుష్కరాల సందర్భంగా దాదాపు రూ. వెయ్యి కోట్ల అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రాథమికంగా అంచనా వేశారు. పుష్కరాల నిర్వహణలో నగరపాలక సంస్థకు కీలక ప్రాధాన్యత ఉంటుంది. సహజంగానే మేయర్ పదవిలో ఉంటే…వారిదే పెత్తనం ఉంటుంది. ఈనేపథ్యంలో గోదావరి పుష్కరాల నాటికి నగరపాలక సంస్థ ఎన్నికలు జరుగుతాయా?….జరిగితే కూటమి మేయర్ అభ్యర్థిగా ఎవరు బరిలో నిలుస్తారన్నది ఇప్పటి నుంచే చర్చనీయాంశంగా మారింది. జూలైలో నగరపాలక సంస్థ ఎన్నికలు నిర్వహిస్తామని ఇటీవలరాజమహేంద్రవరం పర్యటన సందర్భంగా పురపాలకశాఖ మంత్రి పి నారాయణ ప్రకటించారు. నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి మేయర్ రిజర్వేషన్ ఐదేళ్ల క్రిమతే ఓసి జనరల్ గా ఖరారైంది. రోస్టర్ ప్రకారం రిజర్వేషన్లు మారతయాన్న ప్రచారం జరిగినా… ఇటీవల పురపాలకశాఖలో ఎన్నికల్లో అనుభవం కలిగిన ఒక అధికారిని కలిసి ఆరా తీసినపుడు ఎన్నికలు జరగకపోతే పాత రిజర్వేషన్లే అమల్లో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. అయితే ఎన్నికలు జరిగి పదేళ్లు కావడంతో జనాభా దామాషా ప్రకారం డివిజన్ స్థాయిలో రిజర్వేషన్లు మారే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. డివిజన్ స్థాయి రిజర్వేషన్ల ఖరారుకు నెల రోజులు సరిపోతుందని అధికారులు తెలిపారు. అంటే ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు ప్రకటించినా నెలరోజుల్లో ఏర్పాట్లు పూర్తి చేయవచ్చన్న మాట.

మరోవైపు పరిసర గ్రామాలను కలిపి ఎన్నికలు జరపాలా? లేక ప్రస్తుతం ఉన్న 50 డివిజన్లతోనే ఎన్నికలు నిర్వహించాలా అన్న అంశంపై రాజమహేంద్రవరం, రూరల్ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు నెలకొన్నాయని చెబుతున్నారు. పరిసర 10 గ్రామాలను నగరపాలక సంస్థలో విలీనం చేసినందున వాటితో కలిపి ఎన్నికలు జరపాలని గోరంట్ల పట్టుబడుతుండగా, వాసు దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గ్రామాల విలీనంపై కోర్టు కేసులు కూడా ఉండటం గమనార్హం. ఒకప్పుడు నగర రాజకీయాల్లో చక్రం తిప్పిన గోరంట్ల బుచ్చయ్యచౌదరి విలీన గ్రామాలతో ఎన్నికలు జరిపించడం ద్వారా నగరపాలక సంస్థలో తన రాజకీయ ప్రాభల్యాన్ని పెంచుకోవచ్చని భావిస్తున్నారు. ఈవ్యూహాన్ని ఆయన రాజకీయ ప్రత్యర్థి ఆదిరెడ్డి వాసు కుటుంబం అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కుటుంబంతో పాటు గోరంట్ల కూడా పుష్కరాల వేళ మేయర్ సహా మరో 50 మంది ప్రజాప్రతినిధుల పెత్తనాన్ని భరించేందుకు సిద్ధంగా లేరన్న ప్రచారం గట్టిగా వినిపిస్తోంది. అయితే ఎన్నికలు జరపకపోవడం వల్ల 16వ ఆర్థిక సంఘం నిధులు కూడా నిలిచిపోయాయని అధికారులు చెబుతున్నారు. ఎన్నికలు నిర్వహించేందుకు ఇదో కారణం కావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

.

Leave a Reply