- November 22, 2024
కాపులు పల్లకీమోతకే పరిమితమా?!
“ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అసెంబ్లీ సాక్షిగా ప్రశంసలు కురిపిస్తూ మరో పదేళ్ల పాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని” ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన…
“ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అసెంబ్లీ సాక్షిగా ప్రశంసలు కురిపిస్తూ మరో పదేళ్ల పాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని” ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సభలో ఉన్న తెలుగుదేశం పార్టీ సభ్యులు సంబరపడిపోతూ చప్పట్లు కొట్టారు. జనసేన సభ్యులు కూడా ఎదో మొఖమాటానికి చప్పట్లు కొట్టినా వారిలో ఎదో అయోమయం, నిరాశ తొంగిచూశాయి. రాష్ట్రంలోని మెజార్టీ కాపులది కూడా దాదాపు ఇదే పరిస్థితి. రాష్ట్రంలో ఇప్పటి వరకు కమ్మవారు…రెడ్లే ఎక్కువకాలం పాలన సాగించారు. దీంతో జనాభాపరంగా అత్యధికంగా ఉన్న కాపులు కూడా అధికారంపై ఆశలు పెంచుకున్నారు. మెజార్టీగా ఉన్న తాము ఎప్పుడూ అధికార పల్లకీలు మోయడమేనా…అధికారం అనుభవించలేమా అన్న ఆలోచన వారిలో మొదలైంది. మెగాస్టార్ చిరంజీ ప్రజారాజ్యం పార్టీని స్థాపించినపుడు వారిలో ఆశలు కాస్త చిగురించాయి. కాపుల్లోని అనైక్యత వల్ల చిరంజీవి ఆశించిన ఫలితాలు సాధించలేకపోయారు. దీంతో ఆయన తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి, చేతులు దులిపేసుకున్నారు. ఆయన సోదరుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేనను ప్రారంభించి, దూకుడుగా రాజకీయాలు చేయడంతో మరోసారి కాపుల్లో అధికార ఆశలు చిగురించాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో కాపుల్లో ఎక్కడ లేని ఐక్యత కనిపించింది. ఈనేపథ్యంలో జనసేన పోటీ చేసిన 21కి 21 స్థానాల్లో విజయం సాధించి రికార్డు సృష్టించింది. కూటమి ప్రభుత్వంలో పవన్ డిప్యుటీ సిఎంగా బాధ్యతలు స్వీకరించారు. గత ఎన్నికల సందర్భంగా పవన్ కల్యాణ్ ఎపిలో టిడికి ప్రాణంపోయడంతో పాటు, కింగ్ మేకర్ గా ఆవిర్భవించారు. పవన్ ఎపిలో భవిష్యత్ అధికారం కాపులదేనన్న భరోసా కాపుల్లో కలిగించారు. అయితే తాజాగా పవన్ కల్యాణ్ మరో పదేళ్లు చంద్రబాబునాయుడే ముఖ్యమంత్రిగా ఉండాలన్న ప్రకటన కాపులకు పెద్దగా రుచించడం లేదు. కాపులు పల్లకీల మోతకే పరిమితమా అధికారం వారికి అందని ద్రాక్షేనా అన్న చర్చలు సాగుతున్నాయి. తమ నాయకుడికి ఎక్కడ తగ్గాలో తెలుసు కానీ ఎక్కడ హెచ్చాలో తెలిసినట్లు లేదన్న విమర్శ వినిపిస్తోంది. మరోవైపు భావి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో చక్రం తిప్పుతున్న నారా లోకేష్ కు పవన్ వ్యాఖ్యలు పెద్దగా రుచించకపోవచ్చు.