రాజమహేంద్రవరం మేయర్ రిజర్వేషన్ మారిపోతే…వారి భవిష్యత్ ఏమిటీ?!
చారిత్రాత్మకమైన రాజమహేంద్రవరంలో 2027లో గోదావరి పుష్కరాలు ఘనంగా జరగనున్నాయి. గోదావరి పుష్కరాలకు దేశవ్యాప్తంగా సుమారు 8నుంచి 10కోట్ల మంది యాత్రికులు, భక్తులు హాజరవుతారని అంచనా. గోదావరి పుష్కరాల…
చారిత్రాత్మకమైన రాజమహేంద్రవరంలో 2027లో గోదావరి పుష్కరాలు ఘనంగా జరగనున్నాయి. గోదావరి పుష్కరాలకు దేశవ్యాప్తంగా సుమారు 8నుంచి 10కోట్ల మంది యాత్రికులు, భక్తులు హాజరవుతారని అంచనా. గోదావరి పుష్కరాల సందర్భంగా దాదాపు రూ. వెయ్యి కోట్ల అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈనేపథ్యంలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ మేయర్ కు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పటికే మేయర్ పీఠంపై టిడిపి సీనియర్ నాయకుడు గన్ని కృష్ణ, జనసేన ఇన్ చార్జి అత్తి సత్యనారాయణతో పాటు, పలువురు కూటమి నేతలు ఆశలు పెట్టుకున్నారు. గన్ని కృష్ణ మేయర్ గా పోటీకి సిద్ధమని బహిరంగ ప్రకటన చేశారు. అలాగే కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే డివిజన్లలో ఔత్సాహిక నాయకులు పోటీకి సిద్ధమవుతున్నారు. కీలకమైన గోదావరి పుష్కరాల సమయంలో మేయర్ పీఠంపై ఎవరు కూర్చుంటారన్నది చర్చనీయాశంగా మారింది.
ప్రస్తుతం నగరపాలక సంస్థ మేయర్ సీటును ఓసి జనరల్ కు రిజర్వు చేశారు. 2020లో రొటేషన్ విధానంలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. ప్రతీ ఐదేళ్లకు ఒకసారి రిజర్వేషన్లను మార్చాల్సి ఉంటుంది. దీని ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిజర్వేషన్లు మారతాయని అధికారులు చెబుతున్నారు. మేయర్ తో పాటు డివిజన్ స్థాయిలో కూడా రిజర్వేషన్లు మారే అవకాశాలు ఉన్నాయి. ఓసి జనరల్ రిజర్వేషన్ అమల్లో ఉంటే గన్ని కృష్ణ లాంటి ఇతర ఓసి నాయకులకు పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి దాటితే వారికి మేయర్ సీట్లో కూర్చునే అవకాశాలు మృగ్యమవుతాయి. ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయని గన్ని కృష్ణ ఈసారి మేయర్ పోటీకి సిద్ధమయ్యారు. రిజర్వేషన్ కలిసిరాకపోతే ఆయన రాజకీయ భవిష్యత్ ఏమిటన్నది ప్రశ్నార్థకం. తొలి మేయర్ సీటును ఎస్సీ జనరల్ కు కేటాయించగా దివంగత ఎంఎస్ చక్రవర్తి, 2వ సారి బిసి మహిళకు కేటాయించగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ, 3వ సారి ఓసి మహిళకు కేటాయించగా పంతం రజనీశేషసాయి మేయర్ గా సేవలందించారు. వీరంతా అనూహ్యంగా మేయర్ పీఠాన్ని అధిష్టించిన వారే కావడం విశేషం. రొటేషన్ లో ఈసారి మేయర్ పీఠాన్ని ఏ వర్గానికి కేటాయిస్తారన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. రోస్టర్ ప్రకారం బిసి జనరల్ రిజర్వేషన్ మిగిలి ఉంది. బిసిలకు కేటాయిస్తే జనసేన తరుపున అత్తి సత్యనారాయణ లేదా టిడిపి, బిజెపిలోని బిసిలకు అవకాశం దక్కవచ్చు. లేదా మరోసారి అనూహ్యంగా కొత్త పేరు తెరపైకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
పరిసర గ్రామాలను కలిపి ఎన్నికలు జరపాలా? లేక ప్రస్తుతం ఉన్న 50 డివిజన్లతోనే ఎన్నికలు నిర్వహించాలా అన్నది కూడా కూటమి నాయకుల మధ్య చర్చ జరుగుతోంది. ఇప్పటికే 10 గ్రామాలను నగరపాలక సంస్థలో కలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి వ్యతిరేకంగా కొంతమంది రూరల్ నాయకులు కోర్టును ఆశ్రయించడంతో స్టే అమల్లో ఉంది. అయితే సీనియర్ ఎమ్మెల్యే, గతంలో నగర రాజకీయాల్లో చక్రం తిప్పిన గోరంట్ల బుచ్చయ్యచౌదరి విలీన గ్రామాలతో ఎన్నికలు జరిపించాలని పట్టుబడుతున్నారు. తద్వారా నగరపాలక సంస్థలో తన రాజకీయ ప్రాభల్యాన్ని పెంచుకోవచ్చన్నది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. మరోవైపు నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కుటుంబంతో పాటు గోరంట్ల కూడా పుష్కరాల వేళ మేయర్ సహా మరో 50 మంది ప్రజాప్రతినిధుల పెత్తనాన్ని భరించేందుకు సిద్ధంగా లేరన్న ప్రచారం వినిపిస్తోంది. దీంతో ఎన్నికల వాయిదాకే వారు మొగ్గు చూపించవచ్చన్న వాదన వినిపిస్తోంది. కూటమి హవా ఉన్నప్పుడే ఎన్నికలు జరిపించాలన్న యోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. 2012 తరువాత నగరపాలక సంస్థకు ఎన్నికలు జరగలేదు. 2018 నుంచి పాలకవర్గం లేకపోవడంతో కార్పొరేషన్ ప్రత్యేక అధికారుల పాలనలోనే సాగుతోంది. పాలకవర్గం లేకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన 16వ ఆర్థిక సంఘం నిధులు కూడా నిలిచిపోయాయని అధికారులు చెబుతున్నారు. ఎన్నికలు నిర్వహించేందుకు ఇదో కారణం కావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా 2025 ఫిబ్రవరిలోగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు ఎన్నికలు జరపకపోతే రిజర్వేషన్లు తారుమారయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.