గాన గంధర్వన్ ఏసుదాసు

ఆకాశదేశాన…..హరివరాసనం లాంటి  చిరస్థాయిగా నిలిచే పాటలు..వైవిధ్యమైన కంఠస్వరం…మార్థవమైన గాత్రం కెజె యేసుదాసు సొంతం. సినీగీతాలైనా, భక్తి పాటలైనా యేసుదాసు పాడారంటే శ్రోతలకు వీనుల విందే. అందుకే ఆయనను…

 గాన గంధర్వన్ ఏసుదాసు

ఆకాశదేశాన…..హరివరాసనం లాంటి  చిరస్థాయిగా నిలిచే పాటలు..వైవిధ్యమైన కంఠస్వరం…మార్థవమైన గాత్రం కెజె యేసుదాసు సొంతం. సినీగీతాలైనా, భక్తి పాటలైనా యేసుదాసు పాడారంటే శ్రోతలకు వీనుల విందే. అందుకే ఆయనను గాన గంధర్వన్ అని పిలుస్తారు. యేసుదాసు పూర్తి పేరు కట్టస్సేరి జోసెఫ్ యేసుదాస్.  ఐదు దశాబ్దాలుగా  పంజాబీ, అస్సామీ, కొంకణి, కాశ్మీరీ భాషలు తప్ప  మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, బెంగాలీ, ఒరియా తదితర భారతీయ భాషలతో పాటు అరబిక్, ఆంగ్లం, లాటిన్, రష్యన్ భాషలలో, భక్తి గీతాలతో కలుపుకుని సుమారు లక్షకు పైగా పాటలను పాడారు. ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఇండియన్ సింగర్ గా ఆయన ఘనత సాధించారు.  ఎనిమిది సార్లు జాతీయ ఉత్తమ నేపథ్యగాయకుడిగా, ఐదుసార్లు దక్షిణాది పిలిం ఫేర్ పురస్కారాలను 43 సార్లు ఉత్తమ నేపథ్య గాయకునిగా  ఎపి, కర్నాటక, తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్ర పురస్కారాలను అందుకున్నారు. ఆయన ప్రతిభకు మెచ్చి కేంద్రం 1975లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2002లో పద్మ భూషణ్ పురస్కారాన్ని, 2017లో భారత రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. 1999 నవంబరు 14 పారిస్ లో  జరిగిన మ్యూజిక్ ఫర్ పీస్కార్యక్రమంలో యునెస్కో గౌరవ పురస్కారాన్ని ప్రదానం చేసింది. శబరిమల ఆలయంలో స్వామివారికి రోజూ పవళింపు సేవ సమయంలో క్రైస్తవ మతంలో జన్మించిన యేసుదాసు పాడిన హరివరాసనం పాటనే వినిపిస్తారు. 

కే .జె. యేసుదాసు 1940 జనవరి 10 కేరళ లోని కొచ్చిలో ఓ క్యాథలిక్ కుటుంబానికి చెందిన అగస్టీన్ జోసెఫ్, ఎలిజిబెత్ జోసెఫ్ దంపతులకు జన్మించారు. అతని తండ్రి మలయాళ శాస్త్రీయ సంగీత గాయకులు,  రంగస్థల నటుడు. నటునిగా, భాగవతార్ గా ఆయనకు మంచి పేరుండేది. ఆయనకు మంచి ప్రతిభ ఉన్నా ఆర్థికంగా మాత్రం వెనుకబడి ఉండేవారు. ఆయన ఐదుగురు పిల్లలలో యేసుదాసు పెద్దవారు. తండ్రి ప్రభావంతో ఏసుదాసు కూడా చిన్నప్పటి నుంచి పాటలు పాడేవారు. పదిహేడేళ్ళ వయసులో కర్ణాటక గాత్ర సంగీతంలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచారు.  కొడుకులోని ప్రతిభను సానబెట్టడం కోసం తండ్రి ఆయనను తిరుపుణిత్తుర లోని ఆర్.ఎల్.వి. సంగీత కళాశాలలో చేర్చారు. మొదట్లో ఒక క్రైస్తవుడు కర్ణాటక సంగీతం ఏమి నేర్చుకుంటాడని యేసుదాసును సహ విద్యార్థులు గేలి చేసేవారు. తర్వాత పట్టుదలగా చదివిన ఏసుదాసు ఆ కళాశాలలోనే ప్రథముడిగా నిలిచారు. తరువాత తిరువనంతపురంలోని స్వాతి తిరునాళ్ సంగీత కళాశాలలో ప్రముఖ సంగీత విద్వాంసులైన కె.ఆర్.కుమారస్వామి, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, వేల్చూరి హరిహర సుబ్రహ్మణ్య అయ్యర్, చెంబై వైద్యనాథ భాగవతార్ల వద్ద విద్యనభ్యసించారు.  కానీ ఆర్థిక పరిమితుల కారణంగా తన అధ్యయనాన్ని పూర్తి చేయలేకపోయారు. తండ్రి మరణంతో తల్లి, స్నేహితుల సలహా మేరకు సంగీతంలోనే ఆదాయం వెతుక్కోవడం కోసం చెన్నై వచ్చారు. కాలినడకన తిరుగుతూ అవకాశాల కోసం ఎంతోమంది సంగీత దర్శకులను సంప్రదించారు. ఆయన గొంతు సినిమా పాటలకు పనికిరాదని చాలామంది తిరస్కరించారు. కానీ ఆయన మాత్రం వేదికల మీద, కార్యక్రమాల్లో పాటలు పాడుతూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉండేవారు. 1961 నవంబరు 14న కేరళ చిత్ర దర్శకుడు ఎ. కె. ఆంథోనీ ఆయనకు మొట్టమొదటిగా అవకాశం ఇచ్చారు. తర్వాత అవకాశాలు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. కథానాయకుడు మోహన్ బాబు ఆయన సినిమాల్లో ఏసుదాసు చేత కనీసం ఒక్క పాటైనా పాడించుకునే వారు. మొదట్లో హిందూ భజనలు పాడుతున్నాడని కేరళకు చెందిన ఓ చర్చి వారు యేసుదాసును వెలివేసినా మళ్ళీ తమలో చేర్చుకున్నారు. అయితే యేసుదాసు నారాయణ గురు ప్రతిపాదించిన ఒకే మతం, ఒకే కులం, ఒకే దేవుడు అన్న సిద్ధాంతాన్ని విశ్వసిస్తారు. ఈయన నటుడిగా కూడా నాలుగు సినిమాల్లో కనిపించారు. 2009 లో యేసుదాస్ మ్యూజిక్ ఫర్ పీస్అనే నినాదంతో తిరువనంతపురంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త సంగీత ప్రచారాన్ని నిర్వహించారు. 

యేసుదాస్ పథనంథిట్ట జిల్లాలోని మలపిళ్ళైకు చెందిన ప్రభను 1970లో వివాహం చేసుకున్నారు. వారికి వినోద్, విజయ్, విశాల్ అనే ముగ్గురు కుమారులు. రెండవ కుమారుడు విజయ్ యేసుదాస్ కూడా సంగీతకారుడు. విజయ్ కూడా 2007, 2013 లలో ఉత్తమ నేపథ్యగాయకుడిగా కేరళ రాష్ట్ర ఫిలిం ఫేర్ పురస్కారాన్ని పొందారు.

కెజె ఏసుదాసు జన్మదినోత్సవం సందర్భంగా…..

 

 

 

Leave a Reply