యుగపురుషుడు వివేకానందుడు!

స్వామి వివేకానంద.  ఆ పేరు వింటేనే ఒక జాగృతి. సుప్తచేతనావస్థలో ఉన్న హిందూ సమాజాన్ని జాగృతం చేయడమే కాక, హిందూమత గొప్పతనాన్ని, ఆధ్యాత్మిక భావనను ప్రపంచవ్యాప్తంగా ఎలుగెత్తి…

 యుగపురుషుడు వివేకానందుడు!

స్వామి వివేకానంద.  ఆ పేరు వింటేనే ఒక జాగృతి. సుప్తచేతనావస్థలో ఉన్న హిందూ సమాజాన్ని జాగృతం చేయడమే కాక, హిందూమత గొప్పతనాన్ని, ఆధ్యాత్మిక భావనను ప్రపంచవ్యాప్తంగా ఎలుగెత్తి చాటిన మహోన్నత వ్యక్తి వివేకానందుడు. రామకృష్ణ మఠాన్నిస్థాపించి భారతదేశంలో సామాజిక సేవ, ఆధ్యాత్మిక రంగాల్లో యువతకు దిశానిర్ధేశం చేశారు.

పుట్టగానే పువ్వు పరిమళిస్తిందన్నట్లుగా చిన్నప్పటి నుంచే ఆయనలో నిస్వార్థ గుణం, ఔదార్య గుణాలు అలవడ్డాయి. వివేకానందుడి అసలు పేరు నరేంద్ర నాథుడు. నాటి బ్రిటీష్ పాలనలోని కలకత్తాలో 1863 జనవరి 12న ఒక ఉన్నత కుటుంబంలో జన్మించారు.  వివేకానందుడు చిన్నప్పటి నుంచే రోజూ ధ్యానం చేసేవాడు. నరేంద్రుడు ఆటలలోనూ, చదువులో కూడా చురుగ్గా ఉండేవారు. ఏకసంథాగ్రాహి. 1880 వరకు మెట్రిక్యులేషన్ పరీక్ష, ప్రవేశ పరీక్ష ఉత్తీర్ణుడై కళాశాలలో చేరారు. అక్కడ ఆయనకు జ్ఞానతృష్ణ పెరిగి,  దైవం గురించి తెలుసుకోవాలని పరమ ఆసక్తితో ఉండేవారు. చరిత్ర, సైన్సు తోపాటు పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని కూడా ఔపోసన పట్టారు. మూఢ నమ్మకాలన్నింటినీ విడిచిపెట్టినప్పటికీ సత్యాన్ని మాత్రం కనుగొనలేకపోయాడు. నరేంద్రుడు తనకు వచ్చిన సందేహాలన్నీ అనేక పండితుల ముందు వెలిబుచ్చాడు. వారంతా వాదనలలో ఆరితేరిన వారు. కానీ వారి వాదనలేవీ నరేంద్రుడిని సంతృప్తిపరచలేకపోయాయి. వారు ఆలోచిస్తున్న మార్గం కూడా వివేకానందుడికి నచ్చలేదు. అందునా వారెవరికీ భగవంతునితో ప్రత్యక్ష అనుభవం లేదని గుర్తించాడు.

రామకృష్ణ పరమహంస కాళికాదేవికి గొప్ప భక్తుడు. ఆయన భగవంతుని కనుగొని ఉన్నాడని జనాలు చెప్పుకుంటుండగా నరేంద్రుడు విన్నాడు. ఎవరైనా పండితులు ఆయన దగ్గరకు వెళితే వారు ఆయనకు శిష్యులు కావలసిందే. ఒకసారి నరేంద్రుడు తన మిత్రులతో కలిసి రామకృష్ణ పరమహంసను కలిశాడు. ఆసమయంలో రామకృష్ణ భగవంతుని గురించిన సంభాషణలో మునిగిపోయి ఉన్నారు.ఒక్కసారిగా రామకృష్ణ పరమహంస దృష్టి నరేంద్రుడి మీదకు మళ్ళింది. ఆయన మనసులో కొద్దిపాటి కల్లోలం మొదలై సంభ్రమానికి గురయ్యారు. నరేంద్రుని ఆకర్షణీయమైన రూపం, మెరుస్తున్న కళ్ళు ఆయన్ను ఆశ్చర్యానికి గురి చేశాయి. నువ్వు పాడగలవా? అని నరేంద్రుడిని ప్రశ్నించాడు. అప్పుడు నరేంద్రుడు రెండు బెంగాలీ పాటలు గానం చేశాడు. రామకృష్ణులు ఆ పాటలు వినగానే అదోవిధమైన తాదాత్మ్యం (“ట్రాన్స్”) లోకి వెళ్ళిపోయారు. కొద్ది సేపటి తరువాత నరేంద్రుడిని తన గదికి తీసుకువెళ్ళాడు. చిన్నగా నరేంద్రుడి భుజం మీద తట్టి, ఆయనతో ఇలా అన్నాడు. ఇంత ఆలస్యమైందేమి? ఇన్ని రోజులుగా నీ కోసం చూసి చూసి అలసి పోయను. నా అనుభవాలన్నింటినీ ఒక సరైన వ్యక్తితో పంచుకోవాలనుకున్నాను. నీవు సామాన్యుడవు కావు. సాక్షాత్తు భువికి దిగివచ్చిన దైవ స్వరూపుడవు. నీ గురించి నేనెంతగా తపించానో తెలుసా? అంటూ కళ్ళనీళ్ళ పర్యంతమయ్యారు రామకృష్ణ పరమహంస. ఆయన ప్రవర్తన నరేంద్రుడికి వింతగా తోచింది. మీరు భగవంతుని చూశారా? అని ప్రశ్నించాడు. అవును చూశాను నేను నిన్ను చూసిన విధంగానే, ఆయనతో మాట్లాడాను కూడా, అవసరమైతే నీకు కూడా చూపించగలను. కానీ భగవంతుని చూడాలని ఎవరు తపించిపోతున్నారు? అన్నాడాయన. ఇప్పటి దాకా ఎవరూ తాము భగవంతుని చూశామని చెప్పలేదు, కానీ ఈమాత్రం నేను భగవంతుని చూశానని చెప్తున్నాడు. ఎలా నమ్మడం? అని సంశయించాడు. ఒక నెల రోజులు గడిచాయి. నరేంద్రుడు ఒక్కడే దక్షిణేశ్వర్ కు వెళ్ళాడు. రామకృష్ణులవారు మంచం మీద విశ్రాంతి తీసుకుంటున్నారు. నరేంద్రుని చూడగానే అతను చాలా సంతోషించారు. మంచం మీద కూర్చోమన్నారు. అలాగే ధ్యానంలోకి వెళ్ళి తన కాలును నరేంద్రుడి ఒడిలో ఉంచారు. మరుక్షణం నరేంద్రుడికి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కాసేపటికి నరేంద్రుడు మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. రోజులు గడిచేకొద్దీ ఒకరి పట్ల మరొకరు ఆకర్షితులయ్యారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు. నరేంద్రుడి గొప్పతనాన్ని తెలుసుకోవడానికి రామకృష్ణులవారికి ఎంతో సమయం పట్టలేదు. కాళికా దేవి ఆయనకు మార్గనిర్దేశం చేసింది. కానీ నరేంద్రుడు మాత్రం ఆయనను పరీక్షించేవరకూ గురువుగా నిర్ణయించుకోకూడదనుకున్నాడు.

నరేంద్రుడు నెమ్మదిగా ప్రాపంచిక సుఖాలపై వ్యామోహం తగ్గి సన్యాసం వైపు మొగ్గు చూపడం ప్రారంభించాడు. అది ఆయన తల్లిదండ్రులకు తెలిసింది. అప్పుడు అతను బి.ఎ పరీక్షకు తయారవుతున్నాడు. 1884లో బి.ఎలో ఉత్తీర్ణుడయ్యాడు.. అప్పుడే ఆయన తండ్రి మరణించారు. వెనువెంటనే ఆ కుటుంబాన్ని పేదరికం ఆవరించింది. నరేంద్రుడు ఉద్యోగం కోసం కాళ్ళరిగేలా తిరిగాడు. బట్టలు మాసిపోయి చిరిగిపోయాయి. రోజుకొకపూట భోజనం దొరకడం కూడా గగనమైపోతుంది. చాలారోజులు ఆయన పస్తులుండి తల్లికి, చెల్లెళ్ళకు, తమ్ముళ్ళకు తిండి పెట్టేవాడు. వారితో తను స్నేహితులతో కలిసి తిన్నట్లు అబద్ధం చెప్పేవాడు. కొన్నిసార్లు ఆకలితో కళ్ళు తిరిగి వీధిలో పడిపోయేవాడు. ఇంత దురదృష్టం తనను వెన్నాడుతున్నా ఎన్నడూ భగవంతుని మీద విశ్వాసం కోల్పోలేదు. నీవు కాళికా దేవికి, సాటి ప్రజలకు సేవ చేయాల్సిన వాడివి, నీవు ధైర్యంగా ఉండాలి అంటూ రామకృష్ణుల వారు ఓదార్చేవారు.

తరువాత నరేంద్రుడు కొద్దిరోజులపాటు విద్యాసాగర్ పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు. మరోవైపు గొంతు కేన్సర్ తో గురువుగారి ఆరోగ్యం క్షీణించింది. నరేంద్రుడు తన ఉద్యోగం, చదువు రెండు మానేసి గురు శుశ్రూషలో మునిగిపోయాడు. రామకృష్ణులవారికి మరణం సమీపిస్తోంది. చివరి రోజున నరేంద్రుడిని పిలిచి అలా మృదువుగా తాకాడు. అతను ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ నరేంద్రుడికి ధారపోసి ఇలా అన్నాడు. నరేన్! నీవు ఇప్పుడు సర్వశక్తిమంతుడవు. వీళ్ళంతా నా బిడ్డలవంటి వారు. వీరిని చూసుకోవాల్సిన బాధ్యత నీదే అన్నారు. నరేంద్రుడి హృదయం బాధతో నిండిపోయింది. గదిలోకి బయటకు వెళ్ళిపోయి చిన్నపిల్లవాడిలా దుఃఖించడం మొదలుపెట్టాడు. రామకృష్ణులవారు చనిపోయిన తరువాత శిష్యులందరూ కలిసి గంగానది ఒడ్డున  బరనగూర్‌లో ఒక అద్దె ఇంట్లో నివాసం ప్రారంభించారు. అక్కడే రామకృష్ణ మఠం స్థాపించడం జరిగింది. అక్కడున్న యువసన్యాసులకు రెండే లక్ష్యాలు ఉండేవి. ప్రజలకు సేవ చేయడం, ముక్తిని సాధించడం. కొద్ది మంది యువకులు తమ కుటుంబాల్ని వదిలిపెట్టి సన్యాసులుగా మారారు. నరేంద్రుడు కూడా సన్యాసిగా, వివేకానందుడిగా మారి  ఆ మఠానికి నాయకుడయ్యారు. నరేంద్రుడు సన్యాసం స్వీకరించి వివేకానందుడిగా మారాడు. భారతదేశం ఆయన గృహమైంది. ఇక్కడి ప్రజలు సోదర, సోదరీమణులయ్యారు. దేశమంతా పర్యటించాడు. తనకున్న ఆస్తి అంతా ఒక కాషాయ వస్త్రము, ఒక కమండలం, శిష్యగణం మాత్రమే. ఈ పర్యటనలో ఆయన ఎన్నో పుణ్యక్షేత్రాలను సందర్శించాడు. దారి మధ్యలో గుడిసెల్లోనూ, సత్రాలలోనూ నివసించేవాడు, కటిక నేలమీదనే నిద్రించేవాడు. అనేక మంది సాధువుల సాంగత్యంలో గడిపాడు. ఆధ్యాత్మిక చర్చలతో, పవిత్ర కార్యాల గురించిన చర్చలతో సమయం గడిపేవాడు. చాలా దూరం కాలినడకనే నడిచేవాడు. ఎవరైనా దయ తలిస్తే ఏదైనా వాహనంలో ఎక్కేవాడు. ఆళ్వార్ దగ్గర కొద్ది మంది ముస్లింలు కూడా ఆయనకు శిష్యులయారు. ఎవరైనా రైలు ప్రయాణానికి టిక్కెట్టు కొనిస్తేనే రైలులో ప్రయాణం చేసేవాడు. చాలాసార్లు తన దగ్గర డబ్బులేక పస్తుండాల్సి వచ్చేది.

మైసూరులో స్వామికి దివాను శేషాద్రి అయ్యర్, మైసూరు మహారాజాతో పరిచయం ఏర్పడింది. పండితుల సభలో స్వామీజీ సంస్కృతంలో చేసిన ప్రసంగం మహారాజా వారిని ముగ్ధుల్ని చేసింది. భారతదేశం వివిధ మతాల, వివిధ తత్వాల సమ్మేళనం. పాశ్చాత్యులు విజ్ఞానశాస్త్రంలో మంచి పురోగతి సాధించారు. ఈ రెండు కలిస్తే మానవజాతి మంచి పురోగతిని సాధించగలదు. కాబట్టి నేను అమెరికా వెళ్ళి అక్కడ వేదాంతాన్ని వ్యాప్తి చెయ్యాలనుకుంటున్నాను  అని స్వామీజీ మైసూరు మహారాజాతో అన్నారు.  “అయితే ఆ ఖర్చులన్నీ నేనే భరిస్తాన”న్నాడు మాహారాజా. స్వామీజీ అతనుకు కృతజ్ఞతలు తెలిపి సమయం వచ్చినపుడు తప్పకుండా అతను సహాయం తీసుకుంటానని చెప్పి సెలవు తీసుకున్నాడు.

 తరువాత స్వామీజీ భాస్కర సేతుపతి పరిపాలిస్తున్న రామనాడును సందర్శించాడు. అమెరికాలో జరగబోవు సర్వ మత సమ్మేళనానికి తప్పకుండా హాజరవాలి. అందుకయ్యే ఖర్చంతా నేను భరిస్తాను అన్నారు భాస్కర సేతుపతి. దానిని గురించి తప్పకుండా ఆలోచిస్తానని ఆయనకు మాట ఇచ్చి అక్కడి నుంచి రామేశ్వరానికి వెళ్ళి చివరకు కన్యాకుమారి చేరుకున్నాడు.  కొద్ది దూరం ఈదుకుంటూ వెళ్ళి ఒక రాయి మీద కూర్చున్నాడు. పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడ భారతదేశపు ఆధ్యాత్మిక విలువల్ని వారికి వివరించడం తన ప్రథమ కర్తవ్యంగా పెట్టుకున్నాడు. తరువాత స్వదేశానికి తిరిగి వచ్చి నిదురపోతున్న భారతజాతిని మేల్కొలపాలనుకున్నాడు. ఆయన ప్రయాణానికి ఖర్చుల నిమిత్తం దేశం నలుమూలల నుంచీ విరాళాలు వచ్చి పడ్డాయి. కానీ ఆయన మాత్రం తన ప్రయాణానికి ఎంత కావాలో అంతే స్వీకరించాడు. మిగిలిన ధనాన్ని దాతలకు తిరిగి ఇచ్చివేశాడు. అతను ఎక్కిన నౌక బొంబాయి తీరం నుంచి 1893, మే 31వ తేదీన బయలు దేరింది . జులై నెలలో స్వామీజీ చికాగో నగరానికి చేరుకున్నాడు.

1893సెప్టెంబర్ 11న న సర్వమత సమ్మేళనం ప్రారంభమైంది. దేశవిదేశాల నుంచి వచ్చిన వేలాది మంది ప్రతినిధులు అక్కడ చేరారు. వివేకానంద వారందరిలోకెల్లా చిన్నవాడు. ఉపన్యసించడానికి ముందు గురువైన రామకృష్ణులవారినీ, సరస్వతీ దేవిని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు.

అమెరికా దేశపు ప్రియ సహోదరులారా! అని స్వామీజీ అనగానే సభ మూడు నిమిషాలపాటు చప్పట్లతో దద్దరిల్లింది. శబ్దం ఆగిన తరువాత తన ప్రసంగాన్ని ఆరంభించి, సభికులను మంత్రముగ్ధులను చేశారు. స్వామి వివేకానందుడు ప్రజలను జాగృతం చేసే ఎన్నో స్ఫూర్తిదాయక ప్రవచనాలు చేశారు.  అనతి కాలంలోనే స్వామీజీకి ప్రపంచ ప్రఖ్యాతి లభించింది. స్వామీజీ కృషి వల్ల ఒక్క అమెరికాలోనే కాకుండా అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ భారతదేశం పట్ల గౌరవం ఏర్పడింది. నాలుగు సంవత్సరాల పాటు విదేశీ పర్యటన తరువాత స్వామీజీ తిరిగి భారతదేశానికి విచ్చేశాడు. తిరిగి వచ్చేసరికి ఆయన కీర్తి దశదిశలా వ్యాపించిపోయింది. జనవరి 151897న కొలంబోలో దిగగానే ఆయనకి చక్రవర్తికి లభించినంత ఘనస్వాగతం లభించింది. మద్రాసులో ఆయనను  అభిమానులు రథం మీద లాగుతూ ఊరేగించారు. ఆధ్యాత్మిక, సామాజిక సేవా స్ఫూర్తితో, లక్ష్యంతో1897లో రామకృష్ణ మఠాన్ని స్థాపించాడు. తరువాత రెండు సంవత్సరాలలో గంగానది ఒడ్డున గల బేలూర్ వద్ద స్థలాన్ని కొని మఠం కోసం భవనాల్ని నిర్మించాడు. ఈ మఠం తరువాత శాఖోపశాఖలుగా విస్తరించింది.

రామకృష్ణుడు నేర్పిన ముఖ్యమైన పాఠాలలో ‘జీవుడే దేవుడు’ అనేది వివేకానందుడి మంత్రముగా మారింది. దరిద్ర నారాయణ సేవ  అనే పదాన్ని ప్రతిపాదించాడు. వ్యక్తి మోక్షమునకు ప్రపంచ హితమునకు నినాదంతో రామకృష్ణ మిషన్ ను స్థాపించారు.

అవిశ్రాంతంగా పని చేయడం వలన స్వామి ఆరోగ్యం దెబ్బతిన్నది. శిష్యుల అభ్యర్థన మేరకు మరోసారి అమెరికా వెళ్లారు. ప్యారిస్ లోని సర్వమత సమావేశాలలో పాల్గొని తిరిగి స్వదేశానికి వచ్చాడు. రానూ రానూ అంతర్ముఖుడయ్యాడు. శరీరమైతే బలహీనంగా తయారయ్యింది కానీ ఆయన ఆత్మ, మనసు మాత్రం చాలా చురుగ్గా వ్యవహరించేవి. జులై 41902న యథావిధిగా రోజూవారీ కార్యక్రమాలు నిర్వర్తించుకున్నాడు. బేలూరు మఠంలో మూడు గంటలపాటు ధ్యానం చేశాడు. రాత్రి 9 గంటల సమయంలో అతను అలసిపోయినట్లుగా కనిపించాడు. చేతులలో సన్నగా వణుకు ప్రారంభమైంది. చిన్నగా అరిచి లేచి కూర్చున్నాడు. దీర్ఘంగా శ్వాస పీల్చి నెమ్మదిగా శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. మొదడులో రక్తనాళం చిట్లడం ఆయన మరణానికి కారణంగా తేల్చారు. వివేకానంద తన మరణం గురించి ముందుగా చెప్పినట్లే నలభై ఏళ్ళ కంటే ఎక్కువ జీవించలేదు. ఆయన భౌతిక కాయాన్ని బేలూరులో గంగానది ఒడ్డున, పదహారు సంవత్సరాల క్రితం రామకృష్ణ పరమహంస అంత్యక్రియలు జరిగిన స్థలం ఎదురుగానే, గంధపు చెక్కల చితిపై దహనం చేశారు. ఆధ్యాత్మిక, సామాజిక సేవా రంగాల్లో భారతదేశానికి దిక్సూచిగా నిలిచిన ఒక యుగపురుషుడు అంతర్థానమయ్యారు.  

 

జనవరి 12న వివేకానందుడి జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.

 

 

 

 

 

 

Leave a Reply