- July 22, 2025
పుణ్యం కోసం పుష్కర స్నానం…అకాల మరణాలు…రోగాల కోసం కాదు!
2027లో గోదావరి పుష్కరాల సందడి మొదలైంది. పుష్కరాల నిర్వహణ ఏర్పాట్లపై మంత్రి వర్గ ఉపసంఘాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పుష్కరాల నిర్వహణపై ప్రత్యేక అధికారులను కూడా…

2027లో గోదావరి పుష్కరాల సందడి మొదలైంది. పుష్కరాల నిర్వహణ ఏర్పాట్లపై మంత్రి వర్గ ఉపసంఘాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పుష్కరాల నిర్వహణపై ప్రత్యేక అధికారులను కూడా నియమించారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన పుష్కరాల నిర్వహణపై సమావేశం జరిగే అవకాశాలు ఉన్నాయి. 2027 గోదావరి పుష్కరాలకు సంబంధించి సుమారు రూ. 1000కోట్లతో అభివృద్ధి, ఇతర పనులను ప్రతిపాదించారు. ఇప్పటికే గోదావరి రివర్ ఫ్రంట్, అఖండ గోదావరి ప్రాజెక్టులు పట్టాలెక్కాయి.
ఈతరుణంలో గత గుణపాఠాల నుంచి కొత్త పాఠాన్ని నేర్చుకోవాలి. ఈఏడాది జనవరి-ఫిబ్రవరిలో జరిగిన మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగి సుమారు 80 మందికి పైగా మరణించగా…వందలాది మంది గాయపడ్డారు. ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో మహాకుంభ మేళాలో భాగంగా మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తుల మధ్య తొక్కిసలాట జరగడంతో ఈదుర్ఘటన జరిగింది. తరువాత తిరుపతిలో వైకుంఠ ద్వారదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా కూడా భక్తుల మధ్య తొక్కిసలాట చోటుచేసుకుని ఆరుగురు భక్తులు మరణించగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఇక 2015లో గోదావరి పుష్కరాల తొక్కిసలాట దుర్ఘటన ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు. మహాకుంభ మేళా తరహాలోనే గోదావరి పుష్కరాల సందర్భంగా కూడా బారికేడ్లలో ఉన్న భక్తుల మధ్య తొక్కిసలాట జరిగి సుమారు 30 మంది మరణించగా, వందల సంఖ్యలో భక్తులు అస్వస్థతకు గురయ్యారు.
భారీ ఆధ్యాత్మిక వేడుకల్లో భక్తుల మధ్య తొక్కిసలాట సంఘటనలు తరుచూ జరుగుతుంటాయి. దీనికి ప్రధాన కారణం భక్తులను సరైన విధంగా అదుపు చేసే వ్యవస్థ లేకపోవడం, వారిలో అవగాహన కల్పించకపోవడమే. భక్తులంతా ఒకేచోటకు తరలిరావడంతో తొక్కిసలాటలు జరుగుతున్నాయి. 2015లో గోదావరి పుష్కరాలే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 2015 గోదావరి పుష్కరాల సమయంలో తెలుగుదేశం పార్టీయే అధికారంలో ఉంది. బిజెపి మిత్రపక్షంగా ఉండేది. 144 ఏళ్లకు ఒకసారి జరిగే మహా పుష్కరాలంటూ 2015 గోదావరి పుష్కరాలకు ఎక్కడలేని ప్రచారం కల్పించారు. ఆసమయంలో రాజమహేంద్రవరం ఘాట్ల ప్రాధాన్యతపై ప్రచారం జరిగింది. ఈనేపథ్యంలో పుష్కరాల తొలిరోజే మహాఘోరం జరిగిపోయింది. రాజమహేంద్రవరంలోని పుష్కరాలరేవులో స్నానాలు ఆచరించేందుకు భారీ సంఖ్యలో తరలిరావడంతో తొక్కిసలాట జరిగి 30 మంది భక్తులు, యాత్రికులు మృత్యువాత పడ్డారు. ప్రముఖుల కోసం ఏర్పాటు చేసిన విఐపి ఘాట్ ను పక్కన పెట్టి ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబంతో సహా వచ్చి పుష్కరాలరేవు వద్ద తొలి స్నానం చేశారన్న విమర్శలున్నాయి. ఈసందర్భంగా తొలిరోజే భారీగా తరలివచ్చిన భక్తులను బారీకేడ్లలో నిలిపివేసి, పుష్కరాల ఈవెంట్ కు అంతర్జాతీయ, జాతీయస్థాయి ప్రాధాన్యతను కల్పించే ప్రయత్నంలో భాగంగా ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనుతో డ్రోన్లతో షూటింగ్ జరిపించారు. బాబు వెళ్లిపోయిన వెంటనే ఘాట్ లోకి భక్తులను అనుమతించడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. చంద్రబాబునాయుడు తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలో ఐదురోజుల పాటు రాజమహేంద్రవరంలోనే మకాం వేయాల్సి వచ్చింది. ఆఖరికి పుష్కరాల తొక్కిసలాటపై ఏర్పాటు చేసిన జస్టిస్ సోమయాజులు కమిటీ మీడియా విస్తృత ప్రచారం వల్లే తొక్కిసలాట జరిగిందని తేల్చడం వేరే విషయం…
ఇక ఈఏడాది ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ కేంద్రంగా జరిగిన మహా కుంభమేళాను తీసుకుంటే మౌని అమావాస్య సందర్భంగా అమృతస్నానాలు ఆచరించేందుకు దాదాపు 3కోట్ల మంది భక్తులు తరలివచ్చారు. ఈసందర్భంగా భక్తుల రద్దీ కారణంగా బారికేడ్లు విరిగి తొక్కిసలాట జరిగింది. ఈదుర్ఘటనలో సుమారు 80 మందికి పైగా మరణించగా… 100 మందికి పైగా గాయపడ్డారు. భక్తులంతా గంగా, యుమున, సరస్వతి నదుల త్రివేణీ సంఘమ ప్రదేశం వద్ద ఒకే స్నానఘట్టంలో స్నానాలు చేసేందుకు ప్రయత్నించడమే ఈదుర్ఘటనకు కారణంగా నిర్ధారించారు. గోదావరి పుష్కరాల తరహాలోనే మహా కుంభమేళాకు ఉత్తరప్రదేశ్ లోని బిజెపి ప్రభుత్వం దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారాన్ని కల్పించడంతో దాదాపు 10కోట్ల మందికి పైగా భక్తులు మహాకుంభమేళాలో స్నానాలు ఆచరించారు.
2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర, నగరపాలక సంస్థ స్థాయి అధికారులు మహాకుంభమేళాలో ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్లారు. అక్కడ ఏం పాఠాలు నేర్చుకున్నారన్నది 2027 గోదావరి పుష్కరాల నిర్వహణలో తేలిపోనుంది. మహాకుంభ మేళాలో ఏఐ సాంకేతికను వినియోగించి ట్రాఫిక్ నియంత్రణ, ఘాట్లలో భక్తుల నియంత్రణ చేపట్టారు. అయినా మౌని అవాస్యరోజున దుర్ఘటన జరగడం దురదృష్టకరం. ఈనేపథ్యంలో భక్తుల నియంత్రణ, ట్రాఫిక్ నియంత్రణే గోదావరి పుష్కరాల్లో కీలక అంశంగా మారింది. భక్తులను వికేంద్రీకరించాల్సిన అవశ్యకతను ఈదుర్ఘటనలు నొక్కి హెచ్చరిస్తున్నాయి. మహాకుంభమేళా తరహాలోనే ఇక్కడ కూడా ఘాట్లలో ఎఇ సహాయంతో భక్తులు, యాత్రికుల రద్దీని క్రమబద్ధీకరిస్తామని చెబుతున్నారు. స్నానఘట్టాల్లో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించి, భక్తులను వికేంద్రీకరిస్తే తద్వారా తొక్కిసలాటలను నివారించవచ్చు. అలాగే రవాణాపరంగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి, బస్సులు, రైళ్ల ద్వారా వచ్చే భక్తులను కూడా సమీపంలోని ఘాట్లకు, రద్దీ తక్కువగా ఉండే ఘాట్లకు తరలిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కీలకమైన భక్తుల నియంత్రణపై ఇప్పటికే నుంచే దృష్టిసారిస్తే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం నగరపాలక సంస్థ ఇన్ చార్జి కమిషనర్ గా జిల్లా వ్యవహారాల్లో బిజీగా ఉండే కలెక్టర్ పి ప్రశాంతి వ్యవహరిస్తున్నారు. పూర్తిస్థాయి కమిషనర్ ను నియమిస్తే తప్ప పనుల్లో పెద్దగా పురోగతి కనిపించదు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పుష్కర స్నానఘట్టాల్లో ఎక్కడ స్నానమాచరించినా పునీతులవుతారన్న నినాదంతో గోదావరి పుష్కర పుణ్యానికి స్నానఘట్టంతో సంబంధం లేదన్న ప్రచారాన్ని విస్తృతంగా చేయాల్సి ఉంటుంది. ఇప్పటి నుంచే అధికారులు, ప్రజాప్రతినిధులది ఇదే నినాదం కావాలి. అప్పుడే 2015…మహాకుంభ మేళా వంటి దుర్ఘటనల నుంచి తగిన పాఠాలు నేర్చుకున్న వారమవుతాము……
.గోదావరి పుష్కరాల సందర్భంగా మరో కీలకమైన అంశంపై అధికారులు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. అదే గోదావరి జలాల శుద్ధి. ‘వేదంలా ఘోషించే గోదావరి అమరాధమంలా శోభిల్లే రాజమహేంద్రి’ అంటూ గోదావరి, రాజమహేంద్రీ లా ప్రాశస్త్యాన్ని కవి ఆరుద్ర ఒక గేయంలో అతి స్పష్టంగా, అద్భుతంగా వర్ణించి చెప్పారు. అంతటి విశిష్టత కలిగిన గోదావరి జలాలు కాలుష్యకాసారంగా మారుతున్నాయి. గోదావరి జలాలు రాజమహేంద్రవరంలోనే ఎక్కువగా కలుషితమవుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. నగరంలో వెలువడే వ్యర్థాలు, ప్లాస్టిక్ ను గోదావరిలోకి డంపింగ్ చేయడం వల్ల పవిత్ర గోదావరి జలాలు కలుషితమవుతున్నాయి. గోదావరి జలాల్లో ఎంత పవిత్రత ఉన్నా…పరిశుభ్రత లేకపోతే భక్తులు, యాత్రికులు రోగాల బారినపడే అవకాశాలుంటాయి. పుణ్యం కోసం పుష్కర స్నానం…అకాల మరణాలు, రోగాల కోసం కాదన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటి నుంచే స్వచ్చ గోదావరిని ఒక ఉద్యమంలా చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఈవిషయాన్ని గుర్తెరిగి ప్రవర్తిస్తే మంచిది.