వీరి వీరి గుమ్మడి పండు వీరి భవిష్యత్ ఏమిటీ?
ఒకరేమో పెట్రోలు బంకు నుంచి…మరొకరు చిట్ ఫండ్ కార్యాలయం నుంచి…ఇంకో నాయకుడు ఉల్లిపాయల మార్కెట్ నుంచి…మరో నాయకుడు నాసా అపార్ట్ మెంట్ నుంచి…ఇంకొకరు చెట్టు కింద నుంచి..…

ఒకరేమో పెట్రోలు బంకు నుంచి…మరొకరు చిట్ ఫండ్ కార్యాలయం నుంచి…ఇంకో నాయకుడు ఉల్లిపాయల మార్కెట్ నుంచి…మరో నాయకుడు నాసా అపార్ట్ మెంట్ నుంచి…ఇంకొకరు చెట్టు కింద నుంచి.. సినిమా ధియేటర్ నుంచి… ఇలా పదవుల్లేని నాయకులంతా ఇళ్లు, ఆఫీసులు, వ్యాపార సంస్థల నుంచి ప్రస్తుతం రాజకీయాలు నడుపుతున్నారు. టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తవుతున్నా రాజమహేంద్రవరం నాయకులెవరికీ నామినేటెడ్ పదవులు దక్కలేదు. జూన్ నెలాఖరు నాటికి నామినేటెడ్ పదవులు కల్పిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించినా ఆగస్టు నెల వచ్చినా ఆ పదవులు రాజమహేంద్రవరం వరకు చేరలేదు. కనీసం నగరపాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసైనా పదవులు దక్కించుకుందామంటే అవీ ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో రాజకీయ నిరాశ్రయులంతా చెట్టుకొకరు పుట్టకొకరుగా మారిపోయారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రౌతు సూర్యప్రకాశరావుకు వైసిపి పాలన చివర్లో రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ పదవి దక్కింది. ఆతరువాత నుంచి ఆయన ఖాళీ. బిసి సామాజిక వర్గానికి చెందిన ఆయనకు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నా కనీసం పార్టీ పదవి కూడా ఆయనకు దక్కడం లేదు. దీంతో ఆయన పార్టీ కార్యక్రమాలు జరిగితే తప్ప ఎక్కువగా ఉల్లిపాయల మార్కెట్ సమీపంలోని తన నివాసానికే పరిమతమవుతున్నారు. ముందుచూపుతో ఆయన అటు మాజీ ఎంపి భరత్, ఇటు జక్కంపూడి రాజా వర్గాలతో ముందుకెళ్తున్నారు.
గుడా చైర్మన్ గా, ఆర్టీసీ జోనల్ చైర్మన్ గా పనిచేసిన కరుడుగట్టిన తెలుగుదేశంవాది గన్ని కృష్ణ రాజమహేంద్రవరం మేయర్ పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తన జీవితకాలంలో ఒక్కసారైనా ప్రజాక్షేత్రం నుంచి ఎన్నిక కావాలన్నది ఆయన ఆశయం. రాజకీయ, న్యాయపరమైన కారణాలతో కార్పొరేషన్ ఎన్నికలు ఇప్పట్లో జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. దగ్గుబాటి పురందేశ్వరి రాజమహేంద్రవరం ఎంపిగా ఉండటం, ఆయన సామాజిక వర్గానికే చెందిన రాజానగరం టిడిపి ఇన్ చార్జి బొడ్డు వెంకటరమణచౌదరికి రుడా చైర్మన్ కట్టబెట్టడం, నిడదవోలుకు చెందిన మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు స్కిల్ డెవలప్ మెంట్ కమిటీ చైర్మన్ గా నియమితులవడంతో సామాజిక సమీకరణలపరంగా ఆయనకు పెద్ద చిక్కొచ్చిపడింది. పదవుల పంపకంలో కాకినాడలో కాపులకు ఇచ్చినపుడు రాజమహేంద్రవరంలో కమ్మవారికి ప్రాధాన్యతనిస్తే తప్పేమిటని ఆయన వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. మేయర్ పదవిపై ఆశతో ఆయన ఇప్పటికీ పెట్రోలు బంకు కార్యాలయం నుంచి రాజకీయాలు నడుపుతున్నారు.
తాను ఎమ్మెల్సీగా పనిచేయడంతో పాటు, తన ఇంటి నుంచి ఒక మేయర్, ఇద్దరు ఎమ్మెల్యేలను అందించిన ఆదిరెడ్డి అప్పారావు రాజకీయ జీవితం దాదాపు ముగిసినట్టే భావించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆయన కుమారుడు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుయే రాజమహంద్రవరం రాజకీయాలను శాసిస్తున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరికి పదవులు దక్కడం కష్టసాధ్యం కాబట్టి, ఆయనకు నామినేటెడ్ పదవికి కూడా లభించే అవకాశాలు కనిపించడం లేదు. పార్టీ పరంగా ఏదైనా పదవి దక్కితే దక్కవచ్చు. అయితే ఇప్పటికీ ఏదో తాపత్రయపడుతున్నారు. సోదరుడు విడిపోవడంతో తమ చిట్ ఫండ్ వ్యాపారంపైనే దృష్టిసారించారు.
మాజీ ఎపిఐఐసి చైర్మన్ శ్రీఘాకుళపు శివరామసుబ్రహ్మణ్యం 2002లో కార్పొరేటర్ గా కూడా సేవలందించారు. వైసిపి అధికారంలోకి వచ్చిన కొత్తల్లో నియోజకవర్గ కోఆర్డినేటర్ గా వ్యవహరించారు. పార్టీలోని ఆధిపత్యపోరు కారణంగా ఆయన పదవికి దూరం కావాల్సి వచ్చింది. తాను నిర్మించి, నివసిస్తున్న నాసా అపార్ట్ మెంట్ నే కేంద్రంగా చేసుకుని రాజకీయాలకు కాస్త దూరంగా కాలక్షేపం చేస్తున్నారు. మరోవైపు వ్యాపారాల్లో బిజీగా మారిపోయారు. దాదాపు ఎమ్మేల్యే స్థాయికి చేరుకున్న ఆయన ప్రస్తుతం రాజకీయంగా వెనుకంజలో ఉన్నారు.
మొన్నటి వరకు మేయర్ రేసులో ఉన్నట్లు ప్రచారం పొందిన జనసేన నాయకుడు అత్తి సత్యనారాయణ రాజకీయ భవిష్యత్ ఏమిటన్నది అంతుచిక్కడం లేదు. తమ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన హరిహరవీరమల్లు సినిమా ఆయన పాలిట శాపంగా మారింది. ఆ సినిమా విడుదల సమయంలో సినిమా ధియేటర్ల బంద్ కు పిలుపునిచ్చారంటూ ఆయనపై పార్టీ సస్పెండ్ వేటు వేసింది. దీంతో పార్టీలోని వై శ్రీనివాస్ లాంటి ఆయన ప్రత్యర్థులు ఆనందించారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికీ ఆయన తమ పార్టీ అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే ఆయన పునఃప్రవేశం పార్టీలోని ప్రత్యర్థులకు రుచించకపోవచ్చు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఆయన తన ధియేటర్ నుంచే రాజకీయాలు సాగిస్తున్నారు.
మూడుసార్లు కార్పొరేటర్ గా, రెండుసార్లు కౌన్సిలర్ గా సేవలందించిన సీనియర్ టిడిపి నాయకుడు వర్రే శ్రీనివాసరావు ప్రస్తుతం ప్రకాష్ నగర్ రౌండుపార్కు వద్ద గల తన ఆస్థాన చెట్టు కింద నుంచే రాజకీయాలు చేస్తున్నారు. గతంలో డిప్యుటీ మేయర్ పదవిని తృటిలో కోల్పోయిన ఆయన చిన్నాచితకా పదవులు తప్ప పెద్దగా ఏ పదవులు చేపట్టలేకపోయారు. పార్టీలో క్రియాశీలకంగా ఉండే ఆయన నామినేటెడ్ పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈజాబితాలో మరికొంతమంది నాయకులు ఉన్నారు. మరోవైపు రాజమహేంద్రవరం రూరల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తన రాజకీయ వారసత్వంపైనా…వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైనా రోజుకోరకంగా స్పందించడం డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ కు ఇబ్బందికరంగా మారుతోంది.
వీరిలో కొంతమంది రాజకీయంగా క్రియాశీలకంగానే ఉన్నా పదవులు మాత్రం వారిని వరించడం లేదు. వయస్సు పైబడుతుండటంతో రానున్న రోజుల్లోనైనా వారికి ఆశించిన, కనీసం నామినేటెడ్ పదవులైనా దక్కుతాయా…వీరి రాజకీయ భవిష్యత్ ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లో కొనసాగేదే పదవుల కోసం…పదవులు లేకపోతే ప్రజల నుంచి కూడా తగిన గుర్తింపు గౌరవం దక్కవు. దీంతో రాజమహేంద్రవరంనకు చెందిన కొంతమంది నేతలు పదవుల కోసం పరితపిస్తున్నారు.