• July 15, 2025

అత్యంత అరుదైన సమస్య….కొడుకు భవిష్యత్ కోసం తండ్రి ఆరాటం!

అత్యంత అరుదైన సమస్యతో బాధపడుతున్న ఓ కొడుకు భవిష్యత్ కోసం తండ్రి చేస్తున్న పోరాటం…ఆరాటం ఇది. రాజమహేంద్రవరంలోని శ్రీరామ్ నగర్ ఇఎస్ఐ ఆసుపత్రి వద్ద నివసించే చిరువ్యాపారి…

 అత్యంత అరుదైన సమస్య….కొడుకు భవిష్యత్ కోసం తండ్రి ఆరాటం!

అత్యంత అరుదైన సమస్యతో బాధపడుతున్న ఓ కొడుకు భవిష్యత్ కోసం తండ్రి చేస్తున్న పోరాటం…ఆరాటం ఇది. రాజమహేంద్రవరంలోని శ్రీరామ్ నగర్ ఇఎస్ఐ ఆసుపత్రి వద్ద నివసించే చిరువ్యాపారి దూళిపూడి సతీష్ కుమారుడు ఖద్యోత(15) అత్యంత అరుదైన కొలస్ట్రామి సమస్యతో జన్మించాడు. ఈసమస్యతో బాధపడుతున్న వారికి పుట్టకతోనే మలద్వారం పూర్తిగా మూసుకుపోతుంది. తద్వారా కడుపులోని వ్యర్థాలు బయటికి రాక పొట్ట కుళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. దీన్ని నివారించేందుకు పొట్టలోని జీర్ణ వ్యర్థాలను బయటకు పంపేందుకు పెద్దపేగును నేరుగా పొట్ట కింది భాగంలోకి తీసుకుని వచ్చి, అక్కడ రంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. అయితే ఖద్యోతకు జీర్ణాశయ పేగుకు స్పందనలు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. చివరకు వైద్యులు జీర్ణాశయ పేగును మలద్వారం వద్ద అమర్చారు. జీర్ణాశయానికి స్పందనలు లేకపోవడంతో మల విసర్జన దానికి అదే బయటకు వచ్చేస్తుంది. మనషులందరికీ ఉన్నట్లు మల విసర్జన చేయాలన్న ముందస్తు భావన గానీ, విసర్జన జరిగిట్లు గానీ ఆ అబ్బాయికి తెలియవు. అతని ప్రమేయం లేకుండానే రాత్రీపగలూ తేడాలేకుండా రోజుకు 30-40 సార్లు విసర్జన చేస్తుంటాడు. రాత్రి కూడా నిద్ర లేక ఇబ్బంపడుతుంటాడు. అనివార్యంగా అతని తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు కనిపెట్టుకోవాల్సి వస్తోంది. కొడుకును బాధా విముక్తుడ్ని చేసేందుకు తండ్రి సతీష్ హైదరాబాద్ నీలోఫర్, ఎయిమ్స్ వంటి ఆసుపత్రులకు తిప్పారు. ఇందుకోసం లక్షలాది రూపాయలు వెచ్చించారు. దీనికి నివారణ గానీ, వైద్యం గానీ లేవని వైద్యులు తేల్చేశారు.
మరోవైపు ఈసమస్యతో బాధపడుతున్న కుమారుడి భవిష్యత్ కోసం మంచి పాఠశాలలో చేర్పించాలనుకున్న తండ్రి ఆశ కూడా నెరవేరడం లేదు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తోటి విద్యార్థులు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో ఖద్యోతను చేర్చుకునేందుకు నిరాకరించాయి. మధ్యాహ్నం సమయంలో ఇంటికి తీసుకెళ్లి శుభ్రం చేయించి మళ్లీ తీసుకొస్తామని బతిమిలాడినా వారు వినిపించుకోలేదు. దీంతో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పాఠశాలలో చేర్పించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఖద్యోత 10వ తరగతి చదువుతున్నాడు. పేగును మలద్వారం వద్ద అమర్చడంతో కూర్చోడం కూడా కష్టంగా మారింది. మెత్తటి కుషన్ ఉంటే తప్ప ఆ అబ్బాయి కూర్చోలేడు. అతని శారీరక పరిస్థితుల దృష్ట్యా తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రోజూ స్కూలుకు వెళ్లే ముందు, తిరిగి వచ్చాక డైపర్లు మార్చడం, కట్ డ్రాయర్లు మార్చడం, ఒరసిపోకుండా మందులు రాయడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. కేవలం డైపర్లకే నెలకు సుమారు రూ. 25వేల ఖర్చు అవుతుందని సతీష్ చెబుతున్నాడు. డైపర్లు వాడకపోయినా, పరిస్థితిని ఎప్పటికప్పుడు కనిపెట్టకపోయినా కింద పుండులా మారి తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెబుతున్నారు. కుమారుడి అవస్థలు చూసి, భవిష్యత్ తలుచుకుని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.
అత్యంత అరుదైన సమస్యతో బాధపడుతున్న తన కుమారుడి భవిష్యత్ దృష్ట్యా ప్రత్యేక కేసుగా పరిగణించి పెన్షన్ మంజూరు చేయాలని సతీష్ అధికారులు, ప్రజాప్రతినిధులు చుట్టూ అలుపెరగకుండా ప్రదక్షిణలు చేస్తున్నారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో 82 సార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మానవతా దృక్పథంతో ఆలోచిస్తారన్న ఉద్దేశంతో ఆయనను కలిసేందుకు పలుసార్లు అమరావతికి వెళ్లారు. పవన్ కల్యాణ్ కార్యాలయ అధికారులకు వినతిపత్రాన్ని సమర్పించగా, వారు తగిన చర్యల కోసం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కు సిఫార్సు చేశారు. కలెక్టర్ తహశీల్దార్ ను పంపి విచారించి, రూ. 3లక్షలు మంజూరు చేసేందుకు ముందుకు వచ్చారు. దాన్ని సతీష్ తిరస్కరించారు. అత్యంత అరుదైన కేసుగా భావించి, పెన్షన్ మంజూరు చేస్తే తన కుమారుడు భవిష్యత్ లో ఎవరిమీదా ఆధారపడకుండా జీవించేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ ను కలిసేందుకు పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి కందుల దుర్గేష్ ద్వారా చేసిన ప్రయత్నాలు కూడా ఫలించకపోవడంతో కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నారా లోకేష్ ను కలిసి తన కుమారుడి సమస్యను తెలియజేయాలన్న పట్టుదలతో సతీష్ ఉన్నారు. లోకేషైనా న్యాయం చేస్తారన్న నమ్మకంతో ఉన్నారు. ఇప్పటి వరకు తన కుమారుడి ఆరోగ్యం కోసం ఇప్పటికే లక్షలాది రూపాయలు వెచ్చించానని, ఇందుకోసం తాను అప్పులపాలయ్యానని సతీష్ చెబుతున్నారు. తాను బతికున్నంత వరకు కొడుకును ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోగలనని, ఆతరువాత పరిస్థితి ఏమిటన్నదే తనకు బెంగా ఉందని, అందుకే తాను పెన్షన్ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఏది ఏమైనా ఖద్యోత శారీరకంగా ఇబ్బందులు పడుతుంటే…అతని తల్లిదండ్రులు మానసికంగా వేదన చెందుతున్నారు.

Leave a Reply