మరణమూ ఉత్సవమే!

మరణం గురించి ఆలోచిస్తేనే మనషుల్లో ఒకరకమైన ఆందోళన కనిపిస్తుంది. జీవితం ఒక ఉత్సవం పేరిట ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, ఇంద్రజాలికుడు డాక్టర్ బి వి పట్టాభిరామ్…

 మరణమూ ఉత్సవమే!

మరణం గురించి ఆలోచిస్తేనే మనషుల్లో ఒకరకమైన ఆందోళన కనిపిస్తుంది. జీవితం ఒక ఉత్సవం పేరిట ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, ఇంద్రజాలికుడు డాక్టర్ బి వి పట్టాభిరామ్ ఒక పుస్తకాన్ని రచించారు. మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక సందర్భంలో ఆయనను కలిసినపుడు జీవితం ఉత్సవమైతే మరణం ఏమిటని ప్రశ్నించారట. దీనికి పట్టాభిరామ్ స్పందిస్తూ జీవితంతో పాటు, మరణమూ భాగమని, ఇదంతా ఒక ప్యాకేజీ అని, మరణాన్ని కూడా ఉత్సవంగానే భావించాలని సమాధానం ఇచ్చారట. ఈవిషయాన్ని స్వయంగా ఉండవల్లి అరుణ్ కుమార్ వెల్లడించారు. రాజమహేంద్రవరంలోని ఉండవల్లి బుక్ బ్యాంకులో పట్టాభిరామ్ సంస్మరణ సభ జరిగింది. ఈసభలో ఉండవల్లి మాట్లాడుతూ పట్టాభిరామ్ ఇంద్రజాల ప్రదర్శన చేసినపుడు దివంగత ప్రధాని పివి నరసింహారావు కూడా ఒకానొక సందర్భంలో ఈల వేసి ఉత్సాహాన్ని ప్రదర్శించారని గుర్తు చేసుకున్నారు. వ్యక్తిత్వ వికాస, ఇంద్రజాలికుల్లో అరుదైన వ్యక్తి పట్టాభిరామ్ అని కితాబునిచ్చారు. పట్టాభిరామ్ తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఈసందర్భంగా ఉండవల్లి ఒక వినూత్న ప్రతిపాదన చేశారు. రాజమహేంద్రవరంలోని మేధావులు, విద్యావంతులు, ఆలోచనాపరులు ప్రతీ నెలకో…వారానికో బుక్ బ్యాంకులో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని, సమకాలీన రాజకీయాలు, సామాజిక సమస్యలు, ఇతర అంశాలపై ఒక డిక్లరేషన్ ను ప్రకటించి, అది అమలయ్యేలా ప్రజాప్రతినిధులు, అధికారులు, రాజకీయ నాయకులకు సిఫార్సు చేయాలని ప్రతిపాదించారు. ఇందుకు కర్రి రామారెడ్డి వంటి వారు చొరవ తీసుకోవాలని సూచించారు.
నిత్యవిద్యార్థి, ప్రముఖ మానసిక వైద్యులు కర్రి రామారెడ్డి మాట్లాడుతూ పట్టాభిరామ్ తో తనకు మంచి పరిచయం ఉండేదని, ఆయన ఇతర వ్యక్తిత్వ వికాస నిపుణులు, ఇంద్రజాలికులకు భిన్నమైన, సామాజిక సేవా దృక్పథం కలిగిన వ్యక్తని కొనియాడారు. భగవద్గీత, బైబిల్, ఖురాన్ లను మధించి, గొప్ప మానసిక వికాస, ఆధ్యాత్మిక గ్రంథాన్ని రచించాలని పట్టాభిరామ్ ఆశించారని రామారెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆధ్యాత్మిక రచయిత ఎర్రాప్రగడ రామకృష్ణ మాట్లాడుతూ మూడనమ్మకాల నిర్మూలనకు ఇంద్రజాలాన్ని వినియోగించి, సామాజిక వికాసం కోసం కృషిచేశారని, కౌన్సిలింగ్ ద్వారా ఎన్నో కాపురాలు నిలబెట్టారన్నారు.. కౌన్సిలింగ్ ద్వారా ఎన్నో కాపురాలు నిలబెట్టారని పేర్కొన్నారు. ప్రముఖ సినీ రచయిత ముళ్లపూడి వెంకటరమణ, సినీ నటి శారద వంటి వారికి ఆయన కౌన్సిలింగ్ ఇచ్చి మానసిక స్థైర్యాన్ని అందించారన్నారు. అలాగే ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సినీనటి యమునకు కూడా ఆయన కౌన్సిలింగ్ ఇచ్చి, ఆమెలో ఆత్మస్థైర్యాన్ని కల్పించారని గుర్తు చేశారు. పట్టాభిరామ్ సూచించిన త్రీ టీ సూత్రాన్ని పాటిస్తే కుటుంబాల్లో కలతలు, కలహాలు ఉండవన్నారు. తొలి టి అంటే టైమ్ అని…కుటుంబానికి తగిన సమయం కేటాయించడం, రెండో టీ అంటే టాక్ అని, కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడటం, మూడో టీ అంటే టచ్ అని, తరుచూ ఆప్యాయంగా కౌగిలించుకోవడమని విశ్లేషించారు. ఈసభలో డాక్టర్ అరిపిరాల నారాయణరావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, డాక్టర్ టి పతంజలి శాస్త్రి, అశోక్ కుమార్ జైన్, సీనియర్ పాత్రికేయులు విఎస్ఎస్ కృష్ణకుమార్, అధ్యాపకురాలు కామేశ్వరి, డి నాగిరెడ్డి, సుంకర నాగేంద్ర కిషోర్, గౌరీ శంకర్, జగజీవన్, వి ఎస్ ఎస్ కృష్ణ కుమార్, ప్రసాదుల హరినాథ్, బెజవాడ రంగారావు, పసుపులేటి కృష్ణ, బొజంగి ఉమా, వక్కలంక రామం, శ్రీనివాస చౌదరి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply