అమావాస్య తరువాత…పౌర్ణమే…చంద్రబాబుకు పాతమిత్రుడి ఘాటు లేఖ!
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును పాత మిత్రుడిగా పేర్కొంటూ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మార్చుకున్న పద్మనాభరెడ్డి పేరిట మరో లేఖాస్త్రాన్ని సంధించారు. “1999లో మీ ఆహ్వానం మేరకు ఐదేళ్ల…

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును పాత మిత్రుడిగా పేర్కొంటూ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మార్చుకున్న పద్మనాభరెడ్డి పేరిట మరో లేఖాస్త్రాన్ని సంధించారు.
“1999లో మీ ఆహ్వానం మేరకు ఐదేళ్ల పాటు తెలుగుదేశం పార్టీలో కొనసాగానని, అయితే ఆనాడు రెడ్ బుక్ గురించి, వేధింపుల గురించి ఎరగలేదని గుర్తుచేశారు. రాష్ట్రం ఎవరి జాగీరు…ఎస్టేటు కాదని, అమావాస్య తరువాత పౌర్ణమి వస్తుందని, పరోక్షంగా మళ్లీ వైసిపి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రేపు మళ్లీ జగన్ అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు ఆయన విశ్వరూపం చూపిస్తే ప్రమాదమని హెచ్చరించారు. ఆయన శాంతంగా ఉన్నా వేధింపులకు గురైన వారు కసితో కక్ష తీర్చుకోవాలని భావిస్తే రాష్ట్రం అల్లకల్లోలంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
1978లో తాను, దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టామని, అప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు గుర్తులేవన్నారు. తాజాగా గెలిచిన చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్ రెడ్ బుక్ పేరుతో ఓడి ఇంట్లో కూర్చున్న వారిని వేధింపులకు గురిచేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. అధికారమే కాదు, జీవితం, ఆస్తులు కూడా శాశ్వతం కాదన్న విషయాన్ని ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. కుమారుడు లోకేష్ కు మంచి సలహాలు ఇవ్వాలని, రెచ్చిపోవద్దని చెప్పాలని సూచించారు. ఓడిన వారు బాధతో చేయాల్సిన పనులను చంద్రబాబునాయుడు వర్గీయులు చేయడం తప్పని, సరిదిద్దుకోవాలని కోరారు. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఎంత స్నేహంగా, హుందాగా మెలిగేవారో గుర్తు చేసుకోవాలంటూ” ఒక ఫేస్ బుక్ లింకును జత చేశారు.