ప్రభుత్వాసుపత్రిలో గోరంట్ల …ఆదిరెడ్డి బలప్రదర్శన!…ఎవరు పైచేయి సాధిస్తారో?!

  తెలుగుదేశం పార్టీలో చిరకాల ప్రత్యర్థులుగా కొనసాగుతున్న ఇరు వర్గాల మధ్య గత రెండురోజులుగా బలప్రదర్శన జరుగుతోంది. నేరుగా కాకపోయినా…ఇది సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మాజీ…

 ప్రభుత్వాసుపత్రిలో గోరంట్ల …ఆదిరెడ్డి బలప్రదర్శన!…ఎవరు పైచేయి సాధిస్తారో?!

 

తెలుగుదేశం పార్టీలో చిరకాల ప్రత్యర్థులుగా కొనసాగుతున్న ఇరు వర్గాల మధ్య గత రెండురోజులుగా బలప్రదర్శన జరుగుతోంది. నేరుగా కాకపోయినా…ఇది సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మాజీ ఎమ్మెల్సీ, ఒకప్పుడు గోరంట్ల అనుచరుడిగా ఉన్న ఆదిరెడ్డి అప్పారావు మధ్య బలప్రదర్శనగానే విశ్లేషిస్తున్నారు.  రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో  ఒక మెడికల్ షాపు లీజు విషయంలో ఈ రాజకీయ జగడం కొనసాగుతోంది. తెరవెనుక పాత లీజుదారుకు గోరంట్ల వత్తాసు పలుకుతుండగా…కొత్త లీజుదారుకు ఆదిరెడ్డి అప్పారావు మద్దతులు పలుకుతున్నారు. తెర ముందు మాత్రం గోరంట్ల తరుపున రూరల్ టిడిపి నాయకులు మత్సేటి ప్రసాద్, తదితరులు,  ఆదిరెడ్డి తరుపున మాజీ కార్పొరేటర్లు బట్లంకి ప్రకాష్, మొకమాటి సత్యనారాయణ, కొయ్యల రమణ, కప్పల వెలుగు,  మాజీ డిప్యుటీ మేయర్ బాక్స్ ప్రసాద్ ప్రత్యక్షంగా ఆందోళనలో పాలుపంచుకుంటున్నారు. పాత లీజుదారును కొనసాగించాలని గోరంట్ల, కొత్త లీజుదారుకు కట్టబెట్టాలని ఆదిరెడ్డి పట్టుబడుతుండటంతో ఈవ్యవహారంలో ఎవరిది పైచేయిగా నిలుస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈవ్యవహారంలో  తెరవెనుక నగదు లావాదేవీలు కూడా ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం తెలుగుదేశం పార్టీని అబాసుపాలు చేసే అంశమే.

రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో జెన్ రిక్ మందుల షాపును గతంలో మహిళా సంఘానికి మెప్మా అధికారులు కేటాయించారు. బొమ్మూరుకు చెందిన పి తనూజ అనే టిడిపి కార్యకర్త గత పదేళ్లుగా దీన్ని నిర్వహిస్తున్నారు. లీజు కాల వ్యవధి పూర్తి కావడంతో కొద్దిరోజుల క్రితం అప్పారావు జెన్ ఔషది పేరిట పేరు మార్పించి, మరో టిడిపి కార్యకర్త తుళ్లి పద్మ కుమార్తె స్నేహాంజలి యాదవ్ కు కేటాయింపజేశారని చెబుతున్నారు.  దీంతో అధికారులు తనూజను ఖాళీ చేయాలని ఆసుపత్రి అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినా తనూజ షాపు ఖాళీ చేయకుండా గోరంట్లను ఆశ్రయించి, లీజు పొడిగించుకునే ప్రయత్నాలు చేశారు. దీనిలో భాగంగానే మెప్మా ద్వారా పొడిగింపు పొందానని చెబుతున్నారు. పద్మ వర్గీయులు గతంలో రాయల్టీ బకాయి పడ్డారని, అలాంటి వారికి షాపును ఎలా కేటాయిస్తారని తనూజ ప్రశ్నిస్తున్నారు. ఈనేపథ్యంలో సోమవారం షాపును స్వాధీనం చేసుకునేందుకు ఆదిరెడ్డి తరుపున బట్లంకి తదితరులు రంగంలోకి దిగి, తనూజతో షాపు ఖాళీ చేయించే ప్రయత్నాలు చేశారు. మరోవైపు గోరంట్ల ఆదేశాల మేరకు తనూజ తరుపున రూరల్ నాయకులు రంగంలోకి దిగారు. రాజమహేంద్రవరంలో ఉన్న ఆసుపత్రిపై గోరంట్ల పెత్తనమేమిటని ఆదిరెడ్డి వర్గీయులు ప్రశ్నిస్తున్నారు.   దీంతో ప్రభుత్వాసుపత్రిలో గత రెండురోజులుగా ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రంగప్రవేశం చేసి, ఇరువర్గాలను కట్టడి చేసే ప్రయత్నం చేశారు. చివరకు మంగళవారం తహశీల్దార్ రంగంలోకి దిగి, షాపును ఖాళీ చేయాలని తనూజకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ వివాదం ఇక్కడితో ముగిసిపోయిందని భావించేందుకు వీలులేదు. ఆధిపత్యపోరులో భాగంగా పొలిట్ బ్యూరో సభ్యుడైన గోరంట్ల బుచ్చయ్యచౌదరిని రూరల్ కు పరిమితం చేసి, ఆయన  ఆధీనంలోని  రాజమహేంద్రవరంలో టిడిపి కార్యాలయాన్ని కూడా తెరవనీయకుండా ఆదిరెడ్డి వర్గీయులు నిలువరించారు. ఈసారి కూడా ఆదిరెడ్డిదే పైచేయి అవుతుందా…గోరంట్ల తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శిస్తారా అన్నది వేచిచూడాలి. షాపు కోసం గోరంట్ల పట్టుబడితే వర్గపోరు కాస్త వీధి పోరుగా మారే అవకాశాలు లేకపోలేదు.   

 

Leave a Reply