కుటుంబం….ఆదిరెడ్డి కుటుంబం!

వందల రూపాయలు చేతిలో పట్టుకుని పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ నుంచి వచ్చిన ఒక వ్యక్తి కుటుంబం నేడు తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఆర్థికంగా…రాజకీయంగా…సామాజికంగా అత్యంత శక్తివంతంగా…

 కుటుంబం….ఆదిరెడ్డి కుటుంబం!

వందల రూపాయలు చేతిలో పట్టుకుని పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ నుంచి వచ్చిన ఒక వ్యక్తి కుటుంబం నేడు తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఆర్థికంగా…రాజకీయంగా…సామాజికంగా అత్యంత శక్తివంతంగా మారింది. అదే ఆదిరెడ్డి అప్పారావు కుటుంబం. ఆయన ఎమ్మెల్సీగా .. భార్య వీరరాఘవమ్మ మేయర్ గా పనిచేయగా కోడలు భవానీ ఎమ్మెల్యే పనిచేశారు. తాజాగా ఆయన కుమారుడు రాజమహేంద్రవరంలో రాజ్యమేలుతున్నారు. ఆయన తోడల్లుడ్ని నగరంలోనే అతిపెద్ద కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ గా గెలిపించుకున్నారు. ఆయన చిన వియ్యంకుడు కింజారపు అచ్చెంనాయుడు రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు బావమరిది కింజారపు రామ్మోహన్ నాయుడు కేంద్రంలోని ఎన్ డిఏ కూటమి ప్రభుత్వంలో కీలకమైన పౌరవిమానయాన శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. తద్వారా ఆదిరెడ్డి కుటుంబం పలుకుబడి డిల్లీ స్థాయి వరకు విస్తరించింది.
పెనుగొండ నుంచి వచ్చి రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో పార్ట్ టైమ్ అధ్యాపకుడిగా పనిచేసిన ఆయన తరువాత అంచెలంచెలుగా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నతస్థాయికి చేరుకున్నారు. తాను కేవలం 200 రూపాయలతో పొట్టచేత పట్టుకుని రాజమహేంద్రవరం వచ్చినట్లు అప్పారావే ఎన్నోసార్లు చెప్పుకున్నారు. రాజమహేంద్రవరంలోని అప్పటికే ఆర్థికంగా స్థిరపడిన చలుమూరి వారి ఆడపడుచును వివాహం చేసుకుని జీవితంలో స్థిరపడ్డారు. ఆతరువాత చిట్ ఫండ్ వ్యాపారాన్ని ప్రారంభించి ఆర్థికంగా స్థిరపడ్డారు. తెలుగుదేశంలో పార్టీలో చేరి రాజకీయంగా ఎదిగారు. దివంగత మాజీ కేంద్రమంత్రి కింజారపు ఎర్రనాయుడితో వియ్యమందుకుని రాజకీయంగా ఉన్నతస్థితికి చేరుకున్నారు. చలుమూరు ఆడపడుచుతో వివాహం, ఎర్రనాయుడితో వియ్యం ఆయన జీవితాన్ని మలుపుతిప్పాయని చెప్పవచ్చు. అధిక సంఖ్యలో ఉన్న తన వెలమ సామాజిక వర్గం వారి కట్టుబాటు, వారి ఆర్థిక పురోగతి కూడా అప్పారావు కుటుంబానికి కలిసి వచ్చాయని చెప్పవచ్చు.
ఆదిరెడ్డి అప్పారావు సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రోత్సాహంతో రాజమహేంద్రవరం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. తన సతీమణి వీరరాఘవమ్మను మేయర్ గా గెలిపించుకున్నారు. వీరరాఘవమ్మ మేయర్ గా పనిచేసిన కాలంలోనే ఆదిరెడ్డికి, గోరంట్లకు మధ్య విభేదాలు పొడసూపాయి. దీంతో ఆదిరెడ్డి అప్పారావు వైసిపిలో చేరి, ఎమ్మెల్సీ పదవిని తెచ్చుకోగలిగారు. ఇప్పటికీ వారి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఇద్దరు నాయకులు సొంత వర్గాలను ప్రోత్సహించుకుంటున్నారు. తన కుమారుడు వాసును ఎర్రనాయుడు కుమార్తె భవానీకి ఇచ్చి వివాహం జరిపించి, ఆదిరెడ్డి మళ్లీ తెలుగుదేశం పార్టీలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. గోరంట్ల టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడైనా రాజమహేంద్రవరం రాజకీయాల్లో వేలు పెట్టకుండా ఆదిరెడ్డి అప్పారావు అడ్డుకోగలిగారు. 2019 ఎన్నికల్లో తన కుమారుడి సీటు కోసం ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో తన కోడలుకు టిడిపి అసెంబ్లీ సీటు ఇప్పించుకుని గెలిపించుకున్నారు. నాటి నుంచి వాసు ఆధిపత్యం పెరిగిందని విశ్లేషిస్తున్నారు. అప్పారావు రాజకీయాలకు కాస్త దూరమై, వ్యాపారాలపై దృష్టిసారించారు. వైసిపి ప్రభుత్వ హయాంలో చిట్ ఫండ్ కేసుల్లో అప్పారావు, ఆయన తనయుడు వాసు అరెస్టై, జైలుకు వెళ్లడం, అచ్చెంనాయుడు కూడా స్కిల్ కేసులో ఇరుక్కోవడంతో అప్పారావు కుటుంబం కాస్త ఇబ్బంది పడింది.
2024 ఎన్నికల్లో ఆదిరెడ్డి వాసు టిక్కెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్రంలో కూడా టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బంధువర్గానికి కేంద్ర, రాష్ట్రస్థాయి మంత్రి పదవులు లభించడంతో పాటు, వారసుడు ఎమ్మెల్యేగా గెలవడం, పవర్ సెంటర్ గా ఉన్న సిఎం చంద్రబాబునాయుడు తనయుడు లోకేష్ టీంలో ఉండటంతో ఆదిరెడ్డి కుటుంబం అత్యంత శక్తివంతంగా మారిపోయింది. ఇదే అదనుగా తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడంతో పాటు, ఇసుక, మద్యం వ్యవహారాల్లోకి కూడా విస్తరించి ఈకుటుంబం ఆర్థికంగా మరింత బలం పుంజుకునేందుకు ప్రయత్నిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు మాజీ ఎంపి భరత్ రాజమహేంద్రవరం తన అడ్డాగా అని ప్రకటించుకున్నారు. కానీ నేడు అది వాసు అడ్డాగా మారిపోయింది. వాసు హవా ఎంతకాలం కొనసాగుతుందన్నది ఆయన వ్యవహారశైలే తేల్చేస్తుంది.

Leave a Reply