ఎల్లో మీడియా శాసిస్తుంది….ప్రభుత్వం పాటిస్తుంది?!

  దేవుడు శాసిస్తాడు…ఈ అరుణాచలం పాటిస్తాడు. రజనీకాంత్ చెప్పిన ఇది డైలాగ్ గానే చాలా పాపులరైంది. కానీ ప్రస్తుతం ఎల్లోమీడియా శాసిస్తోంది…కూటమి ప్రభుత్వం పాటిస్తోంది అన్న విధానం…

 ఎల్లో మీడియా శాసిస్తుంది….ప్రభుత్వం పాటిస్తుంది?!

 

దేవుడు శాసిస్తాడు…ఈ అరుణాచలం పాటిస్తాడు. రజనీకాంత్ చెప్పిన ఇది డైలాగ్ గానే చాలా పాపులరైంది. కానీ ప్రస్తుతం ఎల్లోమీడియా శాసిస్తోంది…కూటమి ప్రభుత్వం పాటిస్తోంది అన్న విధానం ఆచరణాత్మకంగా కనిపిస్తోంది. తమకు గిట్టని వారిని, వ్యాపారపరంగా ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని వరుసగా వ్యతిరేక కథనాలు రాయడం..దానిపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవడం రివాజుగా మారిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నూజివీడులో దివంగత బిసి నేత సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు.  ఈకార్యక్రమానికి సహజంగానే పార్టీలకు అతీతంగా బిసి నేతలంతా హాజరవుతారు. అయితే ఈకార్యక్రమంలో వైసిపి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన జోగి రమేష్ తో లచ్చన్న కుమార్తె, టిడిపి ఎమ్మెల్యే గౌతు శిరీష, సీనియర్ నాయకులు, మంత్రి కొలుసు పార్థసారధి, ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణరావులు రోడ్డుషోలో పాల్గొనడం…వేదికను పంచుకోవడమే ఆ బిసి నేతల తప్పైపోయినట్లు “సీనియర్ నేతలే…ఇంగితం లేదా”  అంటూ ఎల్లో మీడియాలో వార్తలు వండివార్చారు.  యువనేత లోకేష్ ఆగ్రహం…టిడిపి అధిష్టానం అలుసే కారణమంటూ పార్టీ పెద్దలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. చివరకు ఆ టిడిపి బిసి నేతలు పార్టీ అధిష్టానానికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇలాంటి సామాజిక కార్యక్రమాలను సాధారణంగా పార్టీలకు అతీతంగా స్థానిక నాయకులు నిర్వహిస్తుంటారు. అన్ని పార్టీల నాయకులను ఈకార్యక్రమాలకు అహ్వానిస్తారు.

 టిడిపిని, అధినేత చంద్రబాబునాయుడును, ప్రధాని నరేంద్రమోడీని, బిజెపిని ఎన్నోసార్లు తీవ్రంగా విమర్శించిన మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్, సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్, బిజెపి నేతలు దగ్గుబాటి పురంధరేశ్వరి,  సోము వీర్రాజు తదితరులతో రాజమహేంద్రవరంలో జరిగే పలు కార్యక్రమాల్లో వేదికలు పంచుకుంటారు. ఎంతో ఆత్మీయంగా మాట్లాడుకుంటారు. జక్కంపూడి రాజా సోదరులు, టిడిపి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మంచి స్నేహితులని చెప్పుకుంటారు.  ఎల్లో మీడియా లెక్క ప్రకారం ఉండవల్లి వంటి వారితో టిడిపి, కూటమి నాయకులు వేదికలు పంచుకోకూడదన్న మాట. రాజకీయాలు వేరు…సామాజిక, సాంఘిక జీవితాలు వేరన్న విషయం ఎల్లో మీడియాకు తెలియదా?!

 వైసిపి అధికారంలో ఉండగా జోగి రమేష్ టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఇంటిపై దాడి చేశారని, అలాంటి వ్యక్తితో కలిసి వేదిక ఎలా పంచుకుంటారన్నది ఎల్లోమీడియా అభ్యంతరం. ఈకేసు కోర్టు విచారణలో ఉంది. రమేష్ దోషిగా తేలలేదు. అలాంటప్పుడు రమేషే ఈదాడి చేశారని ఎల్లోమీడియా ఎలా నిర్ధారిస్తుందన్నది బిసి నేతల్లో ఉదయిస్తున్న ప్రశ్న. అలాగైతే చంద్రబాబునాయుడు సహా పలువురు కూటమి నాయకులపై ఎన్నో ఆరోపణలున్నాయి. కొన్ని కోర్టుల విచారణలో ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోరాదు. తమకు గిట్టని వారిని ఎల్లో మీడియా లక్ష్యంగా చేసుకుంటుందన్నది విశ్లేషకుల మాట. దీనిలో భాగంగానే టిడిపికి రాజకీయంగా ధీటైన సమాధానిలిచ్చిన పేర్ని నాని, కొడాలి నాని, జోగి రమేష్, పెదిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వంటి నాయకులను, గత ప్రభుత్వ హయాంలో చట్టపరంగా తమ ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు ప్రయత్నించిన ఐపిఎస్, ఐఏఎస్, ఇతర అధికారులను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా దెబ్బతీయడమే లక్ష్యంగా ఎల్లోమీడియా వార్తలు కనిపిస్తున్నాయన్న విమర్శలున్నాయి.  

Leave a Reply