ఆర్థిక విప్లవకారుడు…మౌనముని
నాడు దూరదర్శన్ ప్రసారాలు చూడటమే పెద్ద గొప్ప…అలాంటిది నేడు ప్రతీ రంగానికో పదేసి చానల్స్ ఇంటర్నెట్…సెల్ ఫోన్లు. కొత్తకొత్త విదేశీ మోడల్ కార్లు ఇలా చెప్పుకుంటూ పోతే…

నాడు దూరదర్శన్ ప్రసారాలు చూడటమే పెద్ద గొప్ప…అలాంటిది నేడు ప్రతీ రంగానికో పదేసి చానల్స్ ఇంటర్నెట్…సెల్ ఫోన్లు. కొత్తకొత్త విదేశీ మోడల్ కార్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో… ఇన్ని సౌకర్యాలు, ఇంతటి అభివృద్ధి, భారతదేశం 4వ ఆర్థికశక్తిగా ఎదిగిదంటే దానికి కారణం మౌని మునిగా పేరుగాంచిన దివంగత మాజీ ప్రధాని పాములపర్తి వేంకట నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణల ఫలితమే. మాటల్లో మౌనముని అయినా చేతల్లో అపర చాణక్యుడు…గొప్ప దార్శనికులు. ప్రభుత్వం మైనార్టీలో ఉన్నా ఎంతో సాహసంతో భారతదేశంలో విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలను అమలు చేయడం వల్లే నేడు దేశం 4వ ఆర్థిక శక్తిగా అవతరించింది. దేశానికి ఇంత చేసిన ఆయనకు చివరిరోజుల్లో దక్కింది అవమానాలే.. భూ సంస్కరణలు ప్రవేశపెట్టి వేలాది ఎకరాల సొంత భూమిని ప్రభుత్వానికి స్వాధీనం చేసిన ఆయనపై అవినీతి ఆరోపణలు చేయడం ఎంతో శోచనీయం. పివి పట్ల కాంగ్రెస్ పార్టీ, ఉత్తరాది నేతలు వ్యవహరించిన తీరు తెలుగువారికి తీరని బాధగా మిగిలిపోయింది.
దక్షిణ భారతదేశం నుంచి ప్రధానిగా ఎన్నికైన తొలి తెలుగు వ్యక్తి పివి నరసింహారావు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సాహసోపేతంగా భూ సంస్కరణలు, భూగరిష్ట పరిమితి చట్టాలను అమలు చేశారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆయన ఎన్నో పదవులు నిర్వహించి వాటికి వన్నె తెచ్చారు. ఆయన బహుభాషావేత్త, రచయిత కూడా. భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనతను సొంతం చేసుకున్నారు. అయితే అయోధ్యలోని బాబ్రీ మసీదు ఆయన హయాంలో కూల్చివేయడం పివి రాజకీయ జీవితంలో ఒక మచ్చగా మిగిలిపోతుంది.
తెలంగాణ లోని వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28 న రుక్మాబాయి, సీతారామరావు దంపతులకు పీవీ జన్మించారు. సొంత ఊరిలోనే ప్రాథమిక విద్యను ప్రారంభించిన పివిని తరువాత కరీంనగర్ జిల్లా, భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు దత్తత తీసుకున్నారు. స్వాతంత్ర్యోద్యమ సమయంలో విద్యార్థి దశలో 1938 లోనే హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో చేరి నిజాము ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందేమాతరం గేయాన్ని ఆలపించడంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఆయనను బహిష్కరించారు. దాంతో ఓ మిత్రుడి సాయంతో నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేరి నాగపూరులో ఆ మిత్రుడి ఇంట్లోనే ఉంటూ 1940 నుండి 1944 వరకు ఎల్.ఎల్.బి పూర్తి చేశారు. పివి స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావు ల అనుయాయిగా స్వాతంత్ర్యోద్యమంలోను, హైదరాబాదు విముక్తి పోరాటంలోను పాల్గొన్నారు. బూర్గుల శిష్యుడిగా కాంగ్రెసు పార్టీలో చేరి అప్పటి యువ కాంగ్రెసు నాయకులు మర్రి చెన్నారెడ్డి, శంకరరావు చవాన్, వీరేంద్ర పాటిల్ లతో కలిసి పనిచేసారు. 1951లో అఖిల భారత కాంగ్రెసు కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. 1950లో నరసింహారావు తన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించి, కాకతీయ పత్రిక నడిపి అందులో జయ అనే మారుపేరుతో వ్యాసాలు రాసేవారు.
1957 లో మంథని నియోజక వర్గం నుండి శాసనసభకు ఎన్నికవడం ద్వారా పీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి పదవీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అదే నియోజకవర్గం నుండి వరుసగా నాలుగు సార్లు శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. 1962 లో మొదటిసారి మంత్రి అయ్యారు. 1962 నుండి 1964 వరకు న్యాయ, సమాచార శాఖ మంత్రి గాను, 1964 నుండి 67 వరకు న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి, 1967 లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, 1968-71 కాలంలో న్యాయ, సమాచార శాఖ మంత్రి పదవులు నిర్వహించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో పీవీది ఒక ప్రత్యేక స్థానం. వివాదరహితుడైన ఆయన హంగూ ఆర్భాటాలు లేకుండా ఒదిగి ఉండే ఉండేవారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు సొంత వర్గం లేదు. పార్టీలో అత్యున్నత స్థాయిలో తనను అభిమానించే వ్యక్తులు లేరు. అయినా తన ప్రతిభతో రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారు. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న ఉద్దండులెందరో ఉండగా ఆ పదవి ఆయన్ని వరించింది. వివాదాల జోలికి పోని అతని వ్యక్తిత్వం, పార్టీలోని ఏ గ్రూపుకూ చెందని అతను రాజకీయ నేపథ్యం ఆయనను 1971 సెప్టెంబరు 30 న ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టింది. భూస్వామ్య వర్గాలు తిరగబడినా…భూసంస్కరణలను అమలు చేశారు. పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం తెచ్చింది కూడా పీవీయే. 1972 లో పీవీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ ఎన్నికలలో 70% సీట్లు వెనుకబడిన వారికిచ్చి చరిత్ర సృష్టించారు. తరువాత పీవీ రాజకీయ కార్యస్థలం ఢిల్లీకి మారింది. కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యారు. రెండుసార్లు లోక్‌సభకు హనుమకొండ స్థానం ఎన్నికయ్యారు. మరో రెండుసార్లు మహారాష్ట్ర లోని రాంటెక్ నుండి ఎన్నికయ్యారు. . 1980- 1989 మధ్య కాలంలో కేంద్రంలో హోంశాఖ, విదేశవ్యవహారాల శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖ లను నిర్వహించారు. విదేశాంగ మంత్రిగా 1983 అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్ లో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫీడెల్ కాస్ట్రోను అబ్బురపరిచారు.
ఆయనకి ప్రధానమంత్రి పదవి అనుకోకుండా వరించింది. 1991 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చెయ్యకుండా, దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెసు పార్టీకి తగిన నాయకుడు లేకుండా పోయాడు. ఆ సమయంలో తనకంటూ ప్రత్యేక గ్రూపు లేని పీవీ అందరికీ ఆమోదయోగ్యుడుగా కనపడ్డారు. వానప్రస్థం నుండి తిరిగివచ్చి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుండి గంగుల ప్రతాపరెడ్డిచే రాజీనామా చేయించి, అక్కడి ఉప ఎన్నికలో గెలిచి, పీవీ లోక్‌సభలో అడుగుపెట్టారు. సాటి తెలుగువాడు ప్రధాని ఆవుతున్నారని నంద్యాల పార్లమెంట్ సీటుకు జరిగిన ఉప ఎన్నికలలో నాటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు తెలుగు దేశం అభ్యర్థిని పోటీలో పెట్టలేదు. అయితే ప్రభుత్వానికి, కాంగ్రెసు పార్టీకి అది చాలా క్లిష్టసమయం. ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ లేని పరిస్థితి. సహజ సిద్ధంగా ఉన్న తెలివితేటలు, కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉన్న అపార అనుభవం క్లిష్టసమయంలో పివికి తోడ్పడ్డాయి. ఐదు సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రధానమంత్రుల్లో నెహ్రూ, గాంధీ కుటుంబంబాల బయటి మొదటి వ్యక్తి, పీవీయే కావడం విశేషం. మైనారిటీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ కూడా, ఇది సాధించడం ఆయన రాజనీతికి, చాణక్యానికి నిదర్శనం. అందుకే ఆయనను అపర చాణక్యుడు అని అంటారు.
పీవీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థలలో ఎన్నో గొప్ప మలుపులు, పరిణామాలు చోటుచేసుకున్నాయి. దివాలా తీసే స్థాయికి చేరుకున్న ఆర్థికవ్యవస్థకు పునరుజ్జీవం కల్పించేందుకు, సంస్కరణలకు బీజం వేసారు. తన ఆర్థికమంత్రి, మన్మోహన్ సింగ్ కు స్వేచ్ఛనిచ్చి, సంస్కరణలకు ఊతమిచ్చారు. ఆ సంస్కరణల పర్యవసానమే, ఆ తరువాతి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన అద్భుతమైన అభివృద్ధి. అందుకే పీవీని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేర్కొంటారు. పంజాబు తీవ్రవాదాన్ని విజయవంతంగా అణచివేసిన ఘనత పీవీ ప్రభుత్వానిదే
దేశంలో అణుపరీక్షలకు శ్రీకారం చుట్టింది పివి ప్రభుత్వమే. 1998లో వాజపేయి ప్రభుత్వంలో అణు బాంబు తయారీకి ఇది దోహదం చేసింది.
పివి చాలా నిరాడంబరంగా జీవించి, తన పిల్లలను కూడా ప్రధానమంత్రి కార్యాలయానికి దూరంగా ఉంచారు. అధికారాన్ని వ్యక్తిగత అవసరాలకు వాడుకోని వ్యక్తి చరమాంకంలో కోర్టుల చుట్టూ తిరగడానికి ఆస్తులు అమ్ముకోవలసి రావడం పివి దౌర్భాగ్యంగా చెప్పుకోవచ్చు.
ప్రధానిగానే కాదు సాహితీరంగంలో కూడా పివి తనదైన ముద్రవేశారు. అతను చేసిన సాహిత్య కృషికి గుర్తింపుగా సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. అతను రచనల్లో ప్రఖ్యాతి చెందినది ఇన్‌సైడర్ అనే అతను ఆత్మకథ. లోపలిమనిషిగా ఇది తెలుగులోకి అనువాదమయింది. నరసింహారావు బహుభాషాకోవిదుడు. బహుభాషా కోవిదుడైన పివికి ఇంగ్లీషు, హిందీయే కాక అనేక దక్షిణాది భాషలు సహా , మొత్తం 17 భాషలు వచ్చు. ఆరోజుల్లోనే కంప్యూటర్ నైపుణ్యం సాధించడం విశేషం.
నరసింహారావు సత్యమ్మరావును వివాహం చేసుకున్నారు. సత్యమ్మరావు 1970, జూలై 1న మరణించారు. వారికి ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు పి.వి. రంగారావు, మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర రెడ్డి మంత్రివర్గంలో విద్యామంత్రిగా పనిచేశారు. రెండవ కుమారుడు పి.వి. రాజేశ్వర్ రావు సికింద్రాబాద్ ఎంపిగా పని చేశారు. ఆయన కుమార్తె సురభి వాణి దేవి చిత్రకారిణిగా, విద్యావేత్తగా, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందారు. 2021 మార్చిలో జరిగిన మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందారు.
పివి తన ఆత్మకథ రెండో భాగం వ్రాసే ఉద్దేశంలో ఉండేవారు. అయితే ఆ కార్యం నెరవేరకుండానే, 2004, డిసెంబర్ 23 న పి.వి.నరసింహారావు కన్నుమూసారు. మరణించిన తరువాత కూడా ఆయనను కాంగ్రెస్ పార్టీ అవమానించిందని, తెలుగువారు ఇప్పటికీ బాధపడుతుంటారు. పీవీ నరసింహారావు మరణించిన తర్వాత ఆయన కుటుంబం అంత్యక్రియలు న్యూఢిల్లీలో ప్రభుత్వ లాంఛనాలతో జరగాలని కోరుకుంది. అంతకుముందు మరణించిన భారత మాజీ ప్రధానులందరి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు న్యూఢిల్లీలో జరగడం, వారికి అక్కడ ఒక స్మృతి చిహ్నం ఏర్పాటుచేయడం సాధారణంగా జరిగేది. కానీ అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు, యూపీఏ సమన్వయకర్త సోనియాగాంధీకి ఇష్టం లేకపోవడంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి పీవీ నరసింహారావు కుటుంబసభ్యులను ఢిల్లీలో కాకుండా పీవీ అంత్యక్రియలు హైదరాబాద్‌లో జరగడానికి ఒప్పించారు. ఢిల్లీ నుంచి పీవీ నరసింహారావు భౌతిక కాయాన్ని హైదరాబాద్ తీసుకువచ్చే క్రమంలో కొద్దిసేపు కాంగ్రెస్ కార్యాలయంలో అభిమానుల సందర్శనార్థం ఉంచాలన్నా అనుమతించలేదు. హుస్సేన్ సాగర్ తీరంలో అతని అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేశారు. పివి భౌతికకాయం పూర్తిగా కాలిపోకుండానే అంతా ఇళ్లకు వెళ్లిపోవడంతో సగం కాలిన ఆయన మృతదేహాన్ని కుక్కలు లాగేశాయన్న వార్తలు కూడా వచ్చాయి. బిజెపి ప్రభుత్వం
పి.వి. నరసింహారావుకు 2024 ఫిబ్రవరి 9 న భారతరత్న పురస్కారం ప్రకటించింది. పి.వి. నరసింహారావు స్మృత్యర్ధం హైదరాబాదులో భారతదేశంలోనే అతిపెద్ద ఫ్లై ఓవర్ కు పివి నరసింహారావు ఎక్స్ ప్రెస్ వేగా పేరుపెట్టారు. ఇది 2009 అక్టోబరు 19 న ప్రారంభం అయ్యింది.
పివి వర్థంతి సందర్భంగా…..