• March 20, 2025

చిట్టి గువ్వా కానరావా…

ఒకప్పుడు మనం నిద్రలేవగానే మన కళ్ల ముందు కనిపించే చిన్ని నేస్తం పిచ్చుక. పెరట్లోని చెట్లపై ఎన్నో రకాల పక్షులు కిలకిల రావాలు చేసినా ఇంటి చూరుల్లో,…

 చిట్టి గువ్వా కానరావా…

ఒకప్పుడు మనం నిద్రలేవగానే మన కళ్ల ముందు కనిపించే చిన్ని నేస్తం పిచ్చుక. పెరట్లోని చెట్లపై ఎన్నో రకాల పక్షులు కిలకిల రావాలు చేసినా ఇంటి చూరుల్లో, గోడల నెర్రెల్లో గూడు కట్టుకుని కళ్లు తెరవగానే కనిపించే ఈ జంట చిట్టి గువ్వలు చేసే కిచకిచలు నేడు పల్లెల్లోనే కరవైపోయింది. ప్రపంచాన్ని చేతుల్లో ఇముడ్చుకోవాలన్న కాంక్షతో ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్లు ఈ చిన్నారి జీవులకు మరణ శాసనాన్ని రాస్తున్నాయి. ఈనేపథ్యంలో ప్రతీ ఏటా మార్చి 20వ తేదీన పిచ్చుకుల పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పిచ్చుకలూ, జనావాసాల్లో ఎక్కువగా కనిపించే ఇతర పక్షుల గురించీ, వాటి మనుగడకు వాటిల్లుతున్న ముప్పు గురించి ప్రజల్లో అవగాహన పెంచడం దీని వెనుక ఉన్న సదుద్దేశంతో ది నేచర్ ఫరెవర్ సొసైటీ, ఫ్రాన్స్ కు చెందిన ఈకోసిస్ ఏక్షన్ ఫౌండేషన్, ఇతర సంస్థలు సంయుక్తంగా ప్రతీ ఏటా పిచ్చుకుల పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి.
మన ఇంటిలో మనతో పాటు ఉండే ఈ చిట్టి గువ్వలు ఇంట్లో క్రిమికీటకాలు కనిపించాయంటే గుటుక్కున మింగేసి మనల్ని వీటిబారి నుంచి కాపాడతాయి. గుప్పెడు గింజలు వేస్తే చాలు కలకాలం తోడుంటామని మన చెంతనే ఉంటాయి. పర్యావరణాన్ని కాపాడే ఈ పిచ్చుకల జాతిని సంరక్షించుకునేందుకు ప్రత్యేకంగా .నడుం బిగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాంక్రీట్ జంగిళ్లుగా మారిన నగరాలు, పట్టణాల్లో మచ్చుకు ఒక్క పిచ్చుక కనిపించడం లేదు. సెల్ టవర్లు పల్లెలకు కూడా విస్తరించడంతో పిచ్చుకలు అక్కడా అంతరించిపోతున్నాయి. పిల్లలకు పిచ్చుకలను నేరుగా కాకుండా బొమ్మలుగా చూపించే దుస్థితి తలెత్తింది.

పక్షులకు ఆవాసాల కొరతొచ్చి పడింది. నగరాలు, పట్టణాల్లో అపార్ట్ మెంట్ల కారణంగా పెంకుటిళ్లు సాంప్రదాయ గృహాలతో పాటు చెట్లు కూడా కనుమరుగైపోతున్నాయి. దీంతో పిచ్చుకలు గూళ్లు పెట్టుకునేందుకు చోటే కరవవుతోంది. రణగొణ ధ్వనులు, ఉరుకుల పరుగుల జీవితాలమధ్య ఇక పిట్ట గోడు ఎవరు పట్టించుకుంటారు? ఇంటి ఆవరణలో మొక్కలు, చెట్లు పెంచితే పచ్చదనం, ఆరోగ్యం, పక్షుల కిలకిలరావాలు మన సొంతం అవుతాయి.
నిజానికి రైతన్నకి పిట్టకు మంచి దోస్తీ ఉంది. పిడికెడు గింజలు తిని పొలాల్లో క్రిమికీటకాలను ఏరిపారేస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వాటిని తరిమేస్తోంది. ఇక స్విగ్గీ, జొమాటో వంటి ఇనిస్టెంట్ ఫుడ్ ఆర్డర్లు, ఫాస్ట్ ఫుడ్ ఆహారాలు వాటి పొట్టకొడుతున్నాయి. పూర్వం ఆహార పదార్థాల తయారీలో భాగంగా వడ్లు, పప్పులు చేటలతో చెరిగేవారు. ఆసమయంలో పిచ్చుకలు, పిట్టలకు కాస్త ఆహారం దొరికేది. మన నివాసం చుట్టూ ఎక్కడ అనువుగా వున్నా మొక్కలు, చెట్లు పెంచడం. ఇళ్లు, అపార్ట్‌మెంట్‌లలో పక్షుల ఆశ్రయం కోసం ఆవాసాలు, బర్డ్ ఫీడర్లు ఏర్పాటు చేయడం, కుండీల్లో మంచినీటిని ఏర్పాటు చేయడం ద్వారా వాటిని మనుగడను కాపాడినవారవుతారు. తద్వారా పర్యావరణ పరిరక్షణకు మేలు చేసినవారవుతారు.
మార్చి 20 ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా…..

Leave a Reply