తాజా ఎమ్మెల్యేకి….మాజీ ఎంపికి పోలికేమిటీ?!

ప్రభుత్వాలు మారాయి…వాటి విధానాలు మారాయి. అయితే ఇద్దరు నాయకుల పోకడల కారణంగా రాజమహేంద్రవరం రాజకీయాల్లో చెప్పుకోదగిన మార్పు కనిపించడం లేదన్న వాదన వినిపిస్తోంది. నాడు మాజీ ఎంపి…

 తాజా ఎమ్మెల్యేకి….మాజీ ఎంపికి పోలికేమిటీ?!

ప్రభుత్వాలు మారాయి…వాటి విధానాలు మారాయి. అయితే ఇద్దరు నాయకుల పోకడల కారణంగా రాజమహేంద్రవరం రాజకీయాల్లో చెప్పుకోదగిన మార్పు కనిపించడం లేదన్న వాదన వినిపిస్తోంది. నాడు మాజీ ఎంపి మార్గాని భరత్ రామ్ వైసిపి ఇన్ చార్జి హోదాలో రాజమహేంద్రవరం అధికార, రాజకీయాల్లో చక్రం తిప్పగా…నేడు ఎమ్మెల్యే హోదాలో ఆదిరెడ్డి వాసు అలాగే వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరికి వారు సొంత కోటరీలు ఏర్పాటు చేసుకున్నారు. వాసు దూకుడు వ్యవహారశైలి, హడావుడి, ఆయన చేసే విమర్శలు దాదాపుగా మాజీ ఎంపి భరత్ రామ్ ను గుర్తు చేస్తుంటాయని సొంత పార్టీలోనూ…ప్రత్యర్థి పార్టీల్లోనూ వినిపిస్తున్న మాట. ఇద్దరూ తండ్రి వారసులుగా రాజకీయాల్లోకి వచ్చిన వారే కావడం విశేషం. పార్లమెంటులో విప్ హోదాలో భరత్ సైరన్ కారులో తిరగ్గా…తొలిరోజుల్లో ఆదిరెడ్డి వాసు కారుకు ముందు కారులో కూడా సైరన్ ఉండేదని చెబుతున్నారు. సొంత ఫొటొగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు, సామాజిక మాధ్యమాల్లో లైవ్ వంటి విషయాల్లో ఇద్దరికీ పోలిక కలుస్తోందని ప్రత్యర్థులు ఎద్దేవా చేస్తున్నారు.
అవినీతి విషయంలో కూడా తాజా, మాజీలకు పొంతన కుదురుతోందన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. మాజీ కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డారన్న ఆరోపణలను నాటి ప్రతిపక్ష టిడిపి, జనసేన, బిజెపి నాయకులతో పాటు, సొంత పార్టీలోని ఆయనకు గిట్టని వారు కూడా చేశారు. తాజా కూడా అదే దారిలో పయనిస్తున్నారని, కోటరీని ఏర్పాటు చేసుకుని మద్యం, ఇసుక వ్యవహారాల్లో వాటాలతో పాటు, ఇతర వ్యవహారాల్లో కూడా కలెక్షన్లు చేస్తున్నారని, భరత్ వర్గీయులు ఆరోపిస్తుండగా, కూటమి నేతలు కూడా చాటుమాటుగా దీన్ని నిర్ధారిస్తున్నారు. టిడిపి సీనియర్ నేత గన్ని కృష్ణ మద్యం, ఇసుక వ్యవహారాలపై నో కామెంట్ అన్నారంటేనే రాజమహేంద్రవరం, రూరల్ లో ఇసుక, మద్యం దందా ఏ విధంగా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు.
రాజమహేంద్రవరం రాజకీయాల్లో వ్యూహాత్మకంగా ప్రత్యర్థి పార్టీ నేతల మధ్య పరస్పర ప్రయోజనాల కోసం ఒక అవగాహన ఏర్పడిందన్నది విశ్లేషకుల మాట. దీనిలో భాగంగానే ఆదిరెడ్డి వాసు ప్రత్యర్థి పార్టీకి చెందిన స్నేహితులకు మేలు చేసే వ్యూహాలు రచిస్తున్నారన్న విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. రాజమహేంద్రవరం, రాజానగరం నియోజకవర్గ రాజకీయాల విషయంలో వారు వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనంగా చెప్పుకుంటున్నారు. మిత్రపక్షం జనసేనకు చెందిన రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణను ఆదిరెడ్డి వాసు సొంతంగా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఎంపిక చేసిన తవ్వా రాజా నూతన కార్యవర్గ అభినందన కార్యక్రమానికి ఆహ్వానించలేదు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సలహా కమిటీలో కూడా బత్తుల పేరు తొలగించినట్లు సమాచారం. రాజమహేంద్రవరం ఆసుపత్రి అభివృద్ధి కమిటీలో రాజానగరం ఎమ్మెల్యేను సభ్యుడిగా చేర్చడం ఏనాటి నుంచో సాంప్రదాయంగా వస్తోంది. హెచ్ డిఎస్ కమిటీలో బత్తులకు ప్రాతినిధ్యం కల్పించకపోవడంపై విమర్శలు, రాజకీయ ఒత్తిళ్లు రావడంతో ఆయన పేరు చేర్చే ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు రాజమహేంద్రవరంలో మాజీ ఎంపి భరత్, ఆదిరెడ్డి వాసులు రాజకీయంగా చిరకాల ప్రత్యర్థులుగా కొనసాగుతున్నారు. ఇద్దరూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. అయితే భరత్ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకే చెందిన మరో నాయకుడి కుటుంబంతో వాసు స్నేహపాత్రంగా ఉండటంతో పాటు, వ్యాపాపరంగా కూడా సత్సంబంధాలు కలిగి ఉన్నారన్నది విమర్శకుల మాట. భరత్ వైసిపిలో చేరిన నాటి నుంచి ఆ వైసిపి నాయకుడి కుటుంబానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. పార్టీ ప్రయోజనాలను కూడా పక్కనపెట్టి ఇప్పటికీ సొంత వర్గాలను కొనసాగిస్తున్నారు. సింగిల్ సినిమా హీరోలా…సింగిల్ టైం ఎంపిగానే మిగిలిపోతారని సొంత పార్టీ నాయకులే విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. ఆ వర్గానికి చెందిన నాయకులు మాత్రం ప్రస్తుత ఎమ్మెల్యే వాసుపై పల్లెత్తు విమర్శ చేయకపోవడం గమనార్హం. భరత్ ను రాజమహేంద్రవరంలో, రాజానగరంలో ప్రత్యర్థి పార్టీ నాయకుడ్ని రాజకీయాల్లో ఏకాకిని చేయడం, పరస్పర రాజకీయ, వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవడమే వీరి ప్రధాన వ్యూహమని భావిస్తున్నారు. కూటమి పార్టీలు, వైసిపి పార్టీల్లోని కార్యకర్తలు, ప్రజలకు ఈవిమర్శలపై ఉన్న అనుమానాలు, అపోహలను పటాపంచలు చేసి, వాస్తవాలను తెలుసుకుని ప్రజలు, కార్యకర్తల ముందు ఉంచేందుకు దివాకరమ్ న్యూస్ ఆదిరెడ్డి వాసు, మార్గాని భరత్ రామ్, జక్కంపూడి రాజాలను ఇంటర్వ్యూ చేసేందుకు విఫలయత్నం చేసింది. అయితే ఎందుకో వారు వెనుకంజ వేస్తున్నారు. దీంతో ఈవ్యూహాత్మక పరస్పర రాజకీయాల మతలబు ఏమిటన్నది అంతుబట్టకుండా ఉంది.

Leave a Reply