యుగాది…ఉగాది!

యుగానికి ఆరంభం…జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగుల్కొల్పి మానవాళిలో నూతనాశయాలను అంకురింపచేసే శుభదినం ఉగాది. తెలుగువారి తొలి పండుగ ఉగాది. ఉగాదిని అచ్చ తెలుగులో సంవత్సరాది అంటారు. భారతీయ…

 యుగాది…ఉగాది!

యుగానికి ఆరంభం…జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగుల్కొల్పి మానవాళిలో నూతనాశయాలను అంకురింపచేసే శుభదినం ఉగాది. తెలుగువారి తొలి పండుగ ఉగాది. ఉగాదిని అచ్చ తెలుగులో సంవత్సరాది అంటారు. భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణాల్లో చెప్పబడింది. దీని ప్రకారం ఈఏడాది మార్చి 30వ తేదీ చైత్ర శుక్ల పాడ్యమి రోజున శ్రీక్రోధి నామ సంవత్సరం ముగిసి, శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. శ్రీవిశ్వావసు అంటే విశ్వానికి సంబంధించినది అని అర్థం. శ్రీవిశ్వావసులో ఆదాయం పుష్కలంగా లభిస్తుందని, అనేక మందికి శుభ ఫలితాలు రానున్నాయని, అందరి జీవితాలు సంతోషంగా గడుస్తాయని వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయని, దేశాల మధ్య వైరాలు తొలగిపోతాయని, జోతిష్య పండితులు చెబుతున్నారు.

ఉగ” అనగా నక్షత్ర గమనం – జన్మ – ఆయుష్షు అని అర్థాలు. ప్రపంచం జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయింది. ఉత్తరాయణ, దక్షిణాయనములతో కూడిన యుగ ఆరంభమే ఉగాది అని కూడా పేర్కొంటారు. శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఉగాదినాడేనని చెబుతారు. ఉగాది నాడు వరాహమిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేశారని చెబుతారు.

ఉగాదికి ఋతువులకు వసంతాలకు గల అవినాభావ సంబంధం ఉంది. శిశిర ఋతువు ఆకురాలు కాలం. శిశిరం తరువాత వసంతం వస్తుంది. చెట్లు చిగుర్చి ప్రకృతి శోభాయమానంగా వుంటుంది. కోయిలలు కుహూకుహూ అని పాడుతాయి. ఉగాది రోజున నూతన పనులు ప్రారంభించడం శుభకరమని నమ్ముతారు. జీవితంలో సుఖః దుఖాలకు సూచకంగా ఆరోజున షడ్రుచుల సమ్మేళనం – తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఉగాది రోజున పంచాంగ శ్రవణం ఆనవాయితీగా వస్తోంది. ఆ సంవత్సరంలోని గ్రహగతుల ఆధారంగా మంచి చెడులను, రాశి ఫలాలను, ఆదాయ వ్యయాలను స్ధూలంగా తమ భావిజీవితం గురించి తెలుసుకుని, దానికి కనుగుణమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఆసక్తి చూపిస్తారు. ఉగాదిని రైతు పండుగగా పేర్కొంటారు. అందుకే ఆరోజున రైతులను ప్రత్యేకంగా గౌరవిస్తారు.

ఈ పండుగను ద్రావిడ భాషలు మాట్లాడే ప్రజలు మరాఠీ ప్రాంతానికి వ్యాప్తి చేసారు. అక్కడ ఈ పండుగ గుడిపడ్వాగా పేరుపొందింది. ఈ ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. ఆంధ్ర, కర్ణాటకల్లో ఉగాదిగా పేరుతో పిలుస్తారు. తమిళులు “పుత్తాండు” అనే పేరుతో, మలయాళీలు “విషు” అనే పేరుతోను, సిక్కులు “వైశాఖీ” గానూ, బెంగాలీలు “పొయ్‌లా బైశాఖ్” గానూ జరుపుకుంటారు. మరోవైపు ప్రతీ ఏటా జరుపుకునే ఉగాదికి వివిధ పేర్లు ఎందుకు వచ్చాయన్నది ఆసక్తిదాయకం. కొంతమంది నారదుడి సంతానం పేర్లే వీటికి పెట్టారని చెబుతారు. కొంతమంది దక్ష ప్రజాపతి కుమార్తె అయిన దాక్షాయని, మరికొంత మంది దక్ష ప్రజాపతి కుమార్తెల పేర్లే ఉగాదికి పెట్టారన్న పురాణేతిహాల్లో పేర్కొన్నారు. శ్రీకృష్ణుడి భార్యల్లో సందీపని అనే రాజకుమారికి 60 మంది సంతానం ఉన్నారని, వారి పేర్లే తెలుగు సంవత్సరాలకు పెట్టారన్న కథనం కూడా ప్రచారం ఉంది. ఉగాది సంవత్సరాల పేర్లపై ఎన్ని కథనాలు ప్రచారంలో ఉన్నా పండుగను మాత్రం ప్రజలు అనందోత్సాహాలతో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

Leave a Reply