- April 2, 2025
మీ కోసం మా సలహా కు ఉండవల్లి తొలి ఫిర్యాదు!
ప్రజలు ఎదుర్కొంటున్న భూ, రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం విశ్రాంత రెవెన్యూ అధికారి మారిశెట్టి జితేంద్ర మీ కోసం మా సలహా పేరిట ఆన్ లైన్ సేవా…

ప్రజలు ఎదుర్కొంటున్న భూ, రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం విశ్రాంత రెవెన్యూ అధికారి మారిశెట్టి జితేంద్ర మీ కోసం మా సలహా పేరిట ఆన్ లైన్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా సలహాలు, సూచనలు చేసేందుకు ముందుకు వచ్చారు. మీ కోసం మా సలహా వెబ్ సైట్ ను ప్రారంభించిన మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ తొలి ఫిర్యాదును ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పోలవరం నిర్వాసితుల కోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 6వేల కోట్లను మంజూరు చేసిందని ఉండవల్లి తెలిపారు. అయితే పరిహారం పొందడంలో నిర్వాసితులు దీర్ఘకాలంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మీ కోసం మా సలహాలో ఈవిషయమై తాను తొలి ఫిర్యాదు చేస్తున్నానని, నిర్వాసితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆస్తులున్న ప్రతీ ఒక్కరూ చిన్నచిన్న మానవ తప్పిదాల వల్ల ఏళ్ల తరబడి రెవెన్యూశాఖ చుట్టూ తిరగాల్సి వస్తోందని ఉండవల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి జితేంద్ర స్వచ్చందంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఆయా రంగాల్లో నిష్ణాతులైన రిటైర్డ్ అధికారులు కూడా ఇలాంటి ప్రజా స్వచ్చంద సేవలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
నిజాయితీపరుడైన జితేంద్ర తహశీల్దార్ స్థాయి నుంచి స్పెషల్ గ్రేడ్ కలెక్టర్ వరకు వివిధ హోదాల్లో పనిచేసిన జితేంద్ర పదవీ విరమణ తరువాత ఇద్దరు మంత్రుల వద్ద ఓఎస్డీగా పనిచేసి, రెవెన్యూ రంగంలో విశేష అనుభవాన్ని గడించారు. ప్రజలు తమ సమస్యను 8019569393 నెంబర్ కి వాట్సాప్ చేస్తే, వారి సమస్యలకు సంబంధించిన సలహాలు, సూచనలు ఫోన్ ద్వారా ఉచితంగా అందిస్తానని జితేంద్ర వెల్లడించారు. భూ సమస్యలు ఉన్నతాధికారుల స్థాయిలో కూడా పరిష్కారం కావడం లేదని అన్నారు. మంత్రులకు సైతం అవగాహన లేకపోవడం వలన భూ సమస్యలు పెండింగ్ లో పడిపోతున్నాయని, దీనివలన రైతులు, ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్య కాలంలో కొన్ని సమస్యలు పరిష్కారం చేయించగలిగామని ఆయన చెబుతూ అప్పుడే ఒక వెబ్ సైట్ పెట్టి స్వచ్ఛందంగా సేవలందించాలన్న సంకల్పం కలిగిందన్నారు.
ఒకే సర్వే నెంబర్ తో పలు స్థలాలు ఉండడం, రికార్డుల్లో ఒక అంకె తప్పు పడడం, వ్యవసాయ భూమి లే అవుట్ గా రికార్డుల్లో నమోదై పోవడం, వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆస్తులు ఒకేచోట రిజిస్టర్ అయిపోవడం వంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం సూచిస్తానని జితేంద్ర తెలిపారు.