ఉండవల్లి వైసిపిలో చేరడం నిజమేనా?!
మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్సార్సీపిలో చేరతారంటూ ఆపార్టీ స్థాపించిన నాటి నుంచే ప్రచారం జరుగుతోంది. తాజాగా మరోసారి ఉండవల్లి ఫిబ్రవరి 26న వైసిపిలో చేరుతున్నారంటూ…

మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్సార్సీపిలో చేరతారంటూ ఆపార్టీ స్థాపించిన నాటి నుంచే ప్రచారం జరుగుతోంది. తాజాగా మరోసారి ఉండవల్లి ఫిబ్రవరి 26న వైసిపిలో చేరుతున్నారంటూ మూహూర్తాన్ని కూడా నిర్ణయించి, సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం సాగుతోంది. ఈప్రచారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినా…ఆయన సన్నిహితులకు మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఉండవల్లి 2004-09, 2009-14 రెండు దఫాలుగా కాంగ్రెస్ పార్టీ తరుపున రాజమహేంద్రవరం ఎంపిగా పనిచేశారు. 2014లో రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా, అన్యాయంగా విభజించాలన్న కాంగ్రెస్ పార్టీ నిర్ణయంతో ఉండవల్లి విభేధించారు. సొంత పార్టీ విధానాలనే ఆయన పార్లమెంటు సాక్షిగా తప్పుపట్టారు. దీంతో ఆయనతో పాటు అమలాపురం ఎంపి జివి హర్షకుమార్ తో సహా ఆరుగురు ఎంపిలను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించింది. ఆతరువాత హర్షకుమార్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినా…ఉండవల్లి మాత్రం ఏ పార్టీలో చేరకుండా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాను ఇకపై ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోనని పలుసార్లు ఉండవల్లి స్పష్టం చేశారు. అయినా వైసిపిలో చేరుతున్నట్లు ప్రచారం ఆగడం లేదు. కాంగ్రెస్ పార్టీని చీల్చుకుని పుట్టిన, దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ స్థాపించిన వైస్సార్సీపిలో ఉండవల్లికి స్నేహితులు, సన్నిహితులు ఎక్కువ. 2016లో ఉండవల్లి తల్లిగారు మరణించినప్పుడు స్వయంగా జగనే ఆయన నివాసానికి వచ్చి పరామర్శించారు. ఈనేపథ్యంలో సహజంగానే ఆయన వైసిపిలో చేరతారన్న ప్రచారాన్ని ప్రజలు నమ్మే అవకాశాలు ఎక్కువ. అయితే ప్రచారమే తప్ప వాస్తవం కాదు.