అల్లు రామలింగయ్యను వెలుగులోకి తెచ్చింది రాజమహేంద్రవరం వాసే!
ప్రముఖ సినీ హాస్యనటుడు అల్లు రామలింగయ్య చిత్రసీమలో లేకపోతే మెగాస్టార్ చిరంజీవి..పవర్ స్టార్ పవన్ కల్యాణ్…ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ ఆయన తనయుడు ఐకాన్ స్టార్…

ప్రముఖ సినీ హాస్యనటుడు అల్లు రామలింగయ్య చిత్రసీమలో లేకపోతే మెగాస్టార్ చిరంజీవి..పవర్ స్టార్ పవన్ కల్యాణ్…ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ ఆయన తనయుడు ఐకాన్ స్టార్ అర్జున్ వంటి వారు బహుశా వెలుగులోకి వచ్చేవారు కాదేమో. మెగాస్టార్ కాంపౌండ్ ఉండేదీ కాదేమో.. మెగాస్టార్, ఐకాన్ స్టార్ లకు వెన్నుముకగా నిలిచిన అల్లు రామలింగయ్యకు వెన్నుముకగా నిలిచిన వ్యక్తి రాజమహేంద్రవరంనకు చెందిన డాక్టర్ గరికపాటి రాజారావు. రామలింగయ్యతో పాటు, జమున, దేవిక వంటి వారిని తెలుగు చిత్రసీమకు నాటకరంగానికి, తరువాత చిత్రరంగానికి పరిచయం చేసింది రాజారావే. ఆంధ్రప్రజానాట్యమండలిని స్థాపించి సాంఘిక, వామపక్ష భావ నాటకాలు వేసి, ప్రజల్లో చైతన్యానికి కృషిచేశారు. ఆయన రాజమహేంద్రవరం నగరానికి చెందిన వ్యక్తి కావడం నగర ప్రజలకు గర్వకారణం. రాజారావు ప్రజావైద్యుడిగా పేదలకు ఉచితంగా వైద్యసేవలు అందించేవారు. ఇప్పటికీ ప్రజావైద్యశాలలు కొనసాగుతున్నాయి.
రాజారావు 1915 ఫిబ్రవరి 5వ తేదీన రాజమండ్రిలో గరికపాటి కోటయ్య, దేవరా రామలింగమ్మల దంపతులకు జన్మించారు. చిన్నప్పుడే కాకినాడలోని ఆదిభట్ల నారాయణదాసు హరికథకు వెళ్లి, పాటకు తగిన తాళం వేసి తన ప్రతిభను నిరూపించుకుని అభినందనలు పొందారు. చదువుకుంటున్న రోజుల్లో విచిత్ర వేషధారణలో ఆసక్తి చూపించిన రాజారావు, హరిశ్చంద్ర నాటకంలోనూ ఓ వేషం ధరించి పాఠశాల అధ్యాపకుల మెప్పు పొందారు. తరువాత విజయనగరంలో మేనమామ సుబ్రహ్మణ్యం ఇంట చేరి ఎస్ ఎస్ ఎల్ సి పూర్తి చేశారు. రాజారావుకు 15వ ఏటనే నాగేశ్వరమ్మతో వివాహం జరిగింది. రాజారావు తండ్రి ఉద్యోగం చేసిన సికింద్రాబాద్ లాలాగూడ వర్క్ షాపులో చిన్న గుమాస్తాగా జీవనం సాగిస్తుండగా, పై ఉద్యోగుల వేధింపులు భరించలేక దానికి రాజీనామా చేసి 1937లో మద్రాసుకు చేరారు. మద్రాసులో ఎల్.ఐ.యం చదువుతున్న రోజులో ప్రముఖ కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య సోదరుడు రామచంద్రారెడ్డి, డాక్టర్ రామదాసు రాజారావుకు ప్రాణ స్నేహితులయ్యారు. దీంతో రాజారావుపై కమ్యూనిజం పట్ల రాజకీయ ఉద్యమాలవైపు ఆకర్షితులయ్యారు. మద్రాసులో చదువుతున్నప్పుడే సహ విద్యార్థులతో కలిసి గుళ్లపల్లి నారాయణమూర్తి రచించిన విడాకులు నాటకానికి దర్శకత్వం వహించాడు. మద్రాసులో విద్యార్థులను సమీకరించి భమిడిపాటి బాగుబాగు, గాలి బాల సుందరరావు అపోహ వంటి నాటకాలను ప్రదర్శించారు. రాజారావు 1953లో పుట్టిల్లు సినిమాను స్వయంగా నిర్మించి దర్శకత్యం వహించారు. ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు జమున, అల్లు రామలింగయ్యను వెండితెరకు పరిచయం చేశారు. మంచి సినిమాగా గుర్తింపు పొందినా ఈ సినిమా ఆర్థికంగా లాభించలేదు. దీంతో రాజరావు ఆర్థికంగా దెబ్బతిని అప్పులపాలయ్యారు.
వైద్యుడైన రాజారావు ఉచితంగా వైద్యసేవలు అందించడానికి తొలుత విజయవాడలోని పోరంకిలో ప్రజా వైద్యశాల నెలకొల్పి ఫీజులు తీసుకోకుండా మందులు కూడా తనే కొనుగోలు చేసి ఉచితంగా రోగులకు సేవ చేసేవారు. కొంతకాలం రాజమండ్రిలోనూ ప్రజావైద్యశాల నిర్వహించారు.
ఆయన స్థాపించిన ప్రజానాట్యమండలి సాంఘిక నాటకాలకు పెద్దపీట వేసింది. ఈ నాటక సంఘం ద్వారా అనేకమంది ప్రతిభావంతమైన కళాకారులు పరిచమయ్యారు. వారిలో దేవిక, అల్లు రామలింగయ్యతో పాటు, సంగీత దర్శకులు మోహన్ దాస్, టి.చలపతిరావులు, నృత్యదర్శకుడు వేణుగోపాల్, రచయితలు సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు, బుర్రకథ కళాకారుడు షేక్ నాజర్ ఉన్నారు.
జైభవానీ నాటకాన్ని ప్రదర్శించే సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థులయ్యారు. అదే సమయంలో దేవుడుచేసిన మేలు చిత్రాన్ని నిర్మించినా ఆర్థిక కారణాలవల్ల ఆ చిత్రం విడుదల కాలేదు. మానసికంగా కుంగిపోయిన రాజారావు 1963 సెప్టెంబరు 8న మద్రాసులో మరణించారు. రాజారావు మరణించినా…ఆయన పరిచయం చేసిన నటులు నాటక, చిత్రసీమలో తమదైన ముద్రవేశారు. ఆయన ఆశయాలు కూడా ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి.
ఫిబ్రవరి 5న రాజారావు జయంతి సందర్భంగా…..