మద్యంలో మునిగి….ఇసుకలో కూరుకుపోయి….కూటమికే చేటు తెస్తారా?!

ఇసుక, మద్యం విధానంలో జోక్యం చేసుకుంటే సహించేది లేదని, బెల్టుషాపులను ఏర్పాటు చేస్తే రూ. ఐదు లక్షల జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు.  ప్రజలు కూడా అలాంటి…

 మద్యంలో మునిగి….ఇసుకలో కూరుకుపోయి….కూటమికే చేటు తెస్తారా?!

ఇసుక, మద్యం విధానంలో జోక్యం చేసుకుంటే సహించేది లేదని, బెల్టుషాపులను ఏర్పాటు చేస్తే రూ. ఐదు లక్షల జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు.  ప్రజలు కూడా అలాంటి వారిపై తిరగబడాలని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ఆయన ఆదేశాలు అమలు సాధ్యమేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇసుక, మద్యం వ్యాపారంలో తెలుగుతమ్ముళ్లు ఏ స్థాయిలో కూరుకుపోయారో బాబు హెచ్చరికలను బట్టే అర్థమవుతోంది. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో రోడ్డుమీదే బెల్టు మద్యం షాపు నిర్వహిస్తున్న ఫొటో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి కోకొల్లలుగా వెలిశాయి. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు రంగంలోకి దిగి కేసులు కూడా నమోదు చేస్తున్నారు.  ఉచిత ఇసుక పాలసీలోనే లోపాలు ఉన్నాయని ఆపార్టీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ లేఅంగీకరిస్తున్నారు.

గత ఎన్నికల్లో దశల వారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామంటే ఓట్లు రాలాయి. అయితే గత ప్రభుత్వం ఈహామీని తుంగలో తొక్కి, ఐదేళ్లు నాసిరకం మద్యాన్ని బలవంతంగా తాగించింది. విచిత్రంగా కూటమి ప్రభుత్వం నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరలకు అందిస్తామని హామీ ఇస్తే ప్రజలు ఓట్లు వేసి గెలిపించడం విశేషం. ఐదేళ్లలోనే ప్రజల ఆలోచనల్లో ఎంత మార్పు వచ్చిందో గమనించవచ్చు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్తగా అధికారంలోకి వచ్చిన టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం మద్యం అమ్మకాలకు తలుపులు బార్లా తీసింది. మద్యం విక్రయాలను ప్రైవేటుపరం చేయడం ద్వారా పరోక్షంగా ముఖ్యంగా టిడిపి నేతలు, కార్యకర్తలకే ప్రభుత్వం మేలు చేసింది.  మొన్నటి వరకు అధికారం లేక, ఆర్థికంగా, రాజకీయంగా ఇబ్బందులకు గురైన నేతలు, కార్యకర్తలను ఆర్థికంగా ఆదుకునేందుకు మద్యం, ఇసుక పాలసీలు దోహదపడుతున్నాయన్నది నిర్వివాదాశం.

ప్రభుత్వ పెద్దల పరోక్ష సహకారంతో తెలుగుతమ్ముళ్లు ప్రత్యర్థి వర్గాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించకుండా మద్యం వ్యాపారంలో చక్రం తిప్పారు. మద్యం వ్యాపారంలో కూటమి కట్టించినట్లు ఆరోపణలున్న రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తాను మద్యం వ్యాపారంలో జోక్యం చేసుకోలేదని, సిండికేట్ల సంగతే తనకు తెలియదని గడుసుగా స్పష్టం చేశారు. నగరంలో సగానికి పైగా మద్యం షాపులు ఆయన కనుసన్నల్లోనే ఏర్పాటయ్యాయన్నది బహిరంగ రహస్యం. తెలుగుతమ్ముళ్లు సిండికేటేతర వ్యాపారులకు దక్కిన షాపులను కూడా బలవంతంగా లాక్కునే ప్రయత్నాలు, వాటాల కోసం డిమాండ్లు చేసినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే మద్యం కూటమిలో తెలుగుతమ్ముళ్లతో పాటు, ప్రతిపక్ష వైసిపి నేతలకు కూడా వాటాలు ఇవ్వడం మిత్రపక్షం జనసేన, బిజెపి నాయకులకు రుచించలేదన్నది వేరే విషయం. మద్యం కూటమి ప్రభుత్వ కూటమిలో చిచ్చుపెట్టే పరిస్థితి తెచ్చిపెడుతోంది. మరోవైపు మద్యం షాపులను లాటరీ ద్వారా దక్కించుకునేందుకు సిండికేట్ సభ్యులు రూ. 2లక్షల చొప్పున వెచ్చించి, పదులు, వందల సంఖ్యలో దరఖాస్తులు కొనుగోలు చేశారు. దరఖాస్తు ఖర్చులు, ప్రభుత్వ లైసెన్స్ ఫీజులు, షాపుల ఏర్పాటుకు అయ్యే మొత్తాన్ని లెక్కగడితే ఒక్కో షాపునకు దాదాపు కోటి నుంచి కోటిన్నర వరకు వెచ్చించారు. వ్యాపారులు ఈరెండేళ్లలో పెట్టుబడితో, లాభాలను ఆర్జించాలంటే ఎంఆర్పీ ధరల ఉల్లంఘన, బెల్టుషాపుల వంటి అక్రమాలకు పాల్పడితే తప్ప సాధ్యం కాకపోవచ్చు. అంటే కూటమి ప్రభుత్వ హయాంలో చౌకగా నాణ్యమైన మద్యం సాధ్యం కాదన్నది స్పష్టమవుతోంది.

ఇక ఇసుక విషయానికి వస్తే అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే కూటమి నాయకులు, వారి అనుచరులు కోట్లాది రూపాయల విలువైన ఇసుక నిల్వలను మాయం చేసేశారు. గోదావరితీరంలోని ఇసుక ర్యాంపులను ఆక్రమించేశారు. ఇసుక దందాలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆయన ఇద్దరు ప్రధాన సన్నిహితుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ట్రాక్టర్లు, బండ్లకు ఇసుక ఉచితమే అని ప్రకటించినా…ర్యాంపులు అధికార పార్టీ నాయకుల చేతుల్లో ఉండటంతో నిర్మాణదారుడి ఇంటికి చేరే సరికి తడిసిమోపెడవుతోంది. సీనరేజీ లేకపోయినా ఇసుక తవ్వకాలకు, రవాణాకు భారీగా చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇసుక వాణిజ్య విక్రయాలు కూడా ప్రారంభమైతే ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ట్రాక్టర్లకు ఉచితమని ప్రకటించడంతో ఇసుకలో సొమ్ము చేసుకునేందుకు తెలుగుతమ్ముళ్లే పెద్దఎత్తున ట్రాక్టర్ల కొనుగోలుకు సిద్ధమయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

 

Leave a Reply