సనాతన ధర్మపాలనలో ఆకలితో అలమటిస్తున్న గోమాతలు

బిజెపి, జనసేన భాగస్వామ్యంగా ఉన్న సనాతన ధర్మ ప్రభుత్వ హయాంలో దేవాదాయశాఖ ఆధ్వర్యంలోని గోరసంరక్షణ సంఘంలో  గోమాతలు ఆకలికి అలమటిస్తున్నాయి. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తామని చెప్పుకునే పాలకులు…

 సనాతన ధర్మపాలనలో ఆకలితో అలమటిస్తున్న గోమాతలు

బిజెపి, జనసేన భాగస్వామ్యంగా ఉన్న సనాతన ధర్మ ప్రభుత్వ హయాంలో దేవాదాయశాఖ ఆధ్వర్యంలోని గోరసంరక్షణ సంఘంలో  గోమాతలు ఆకలికి అలమటిస్తున్నాయి. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తామని చెప్పుకునే పాలకులు సనాతన ధర్మంలో భాగమైన గోవుల ఆకలి తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని భక్తులు, జంతుప్రేమికులు కోరుతున్నారు. దేవాదాయశాఖలో భాగమైన రాజమహేంద్రవరంలోని గౌతమీ జీవకారుణ్య సంఘం ఆధ్వర్యంలో గో సంరక్షణా సంఘాన్ని నిర్వహిస్తోంది. గోవుల అక్రమ రవాణా సందర్భంగా స్వాధీనం చేసుకున్న గోవులు, రోడ్లపైన వదిలేసిన వట్టిపోయిన ఆవులను ఇక్కడికి తరలించి, సంరక్షిస్తున్నారు.  ప్రస్తుతం ఇక్కడ సుమారు 76 ఆవులు, 23 ఎద్దులు, 30 వరకు దూడలు ఉన్నాయి. హిందూ సంస్కృతీ, సాంప్రదాయాల పరిరక్షణ, ధార్మిక కార్యక్రమాలకు నిధులు కేటాయించాల్సిన దేవాదాయశాఖ హిందువులు పవిత్రంగా భావించే గో సంరక్షణను నిర్లక్ష్యం చేస్తోంది. దీంతో గోసంరక్షణ సంఘంలోని గోవులు ఆకలితో నకనకలాడుతున్నాయి. దీంతో  ఇక్కడి గోవుల ఆకలిని తీర్చేందుకు దాతల ముందు చేతులు చాపాల్సివస్తోంది. రవాణాధికారి, గో ప్రేమికుడు  సిహెచ్ సంపత్ కుమార్ ఈవిషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గోవులకు మేతతో పాటు, సిబ్బందికి జీతాలు, నిర్వహణ ఖర్చుల్లో కూడా సింహభాగం భరిస్తున్నారు. దేవాదాయశాఖకు చెందిన పిఎంకె సత్రం కూడా పశువుల దాణాకు నెలకు 20వేల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఇది వాటి పోషణకు సరిపోవడం లేదు. ప్రభుత్వ పశువైద్యాధికారి యోగానంద్, డాక్టర్ జాన్ బాబు సేవాభావంతో గోవులకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. అయితే ఎంతకాలం ఈపరిస్థితి. ధార్మికభావంతో, మూగజీవాలపై ప్రేమతో స్వచ్చందంగా ప్రజలే వచ్చి ఆహారాన్ని అందించేలా, గోసంరక్షణ సంఘం స్వయంసమృద్ధిని సాధించి, గోవుల సంరక్షణ బాధ్యతలు పూర్తిగా నిర్వర్తించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సంపత్ కుమార్ అభిప్రాయపడుతున్నారు. నిష్కామకర్మకే ఉత్తమ ఫలం లభిస్తుందని, గోవులు వంటి మూగజీవాలను సంరక్షించడం ద్వారానే ఇది సాధ్యమని ఆయన స్పష్టం చేస్తున్నారు. జన్మదిన వేడుకలు, వర్థంతులు, జయంతుల వంటి కార్యక్రమాల సందర్భంగా దాతలు వివిధ స్వచ్చంద సంస్థల్లోని పేదలు, అనాధలకు  ఉచిత అన్నదానాలు చేస్తున్నారని, స్వచ్చంద సంస్థలు కూడా అన్నదానాలు చేస్తున్నారు.  అయితే ఈసందర్భంగా కడుపునిండిన పరిస్థితుల్లో కొన్ని సార్లు  ఆహార పదార్థాలు వృధా అవుతున్నాయన్న  ఆవేదన  చాలామందిలో ఉంది. గోవులు వంటి మూగజీవాలకు ఆహారాన్ని అందించడం, ప్రకృతిని పరిరక్షించడం కూడా భగవత్ సేవగా భావించాలని పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్టు చైర్మన్, జంతుప్రేమికుడు పంతం కొండలరావు పిలుపునిచ్చారు. తద్వారా పర్యావరణ సమత్యులత కూడా జరిగి, లోకకల్యాణం సాధ్యమవుతుందని కొండలరావు అభిప్రాయపడ్డారు. గోవుల సంరక్షణకు దేవాదాయశాఖ, ధార్మిక సంస్థలు, జంతుప్రేమికులు ముందుకు వచ్చి వాటి ఆకలిని తీర్చాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.

Leave a Reply