గోరంట్ల మాటలు మంటలు రేపుతాయా…? గోరంట్ల, ఆదిరెడ్డి మధ్య మళ్లీ రాజుకుంటున్న విభేదాలు?!
ఎవడో కన్నబిడ్డకు తాను తండ్రిని అని చెప్పుకుంటున్నారు… సంవత్సరంలో అబ్బా కొడుకులు ఏం పొడిచారు…డబ్బాలు కొట్టుకోవడం…ఫ్లెక్సీలు కట్టుకోవడం తప్ప…వీళ్లకేం తెలుసు.చరిత్ర…నన్ను అవమానపరచాలంటే వారికి తాతలు దిగిరావాలి….విర్రవీగితే బుర్రగోకుడే…మాజీ…

ఎవడో కన్నబిడ్డకు తాను తండ్రిని అని చెప్పుకుంటున్నారు… సంవత్సరంలో అబ్బా కొడుకులు ఏం పొడిచారు…డబ్బాలు కొట్టుకోవడం…ఫ్లెక్సీలు కట్టుకోవడం తప్ప…వీళ్లకేం తెలుసు.చరిత్ర…నన్ను అవమానపరచాలంటే వారికి తాతలు దిగిరావాలి….విర్రవీగితే బుర్రగోకుడే…మాజీ వైసిపి ప్రజాప్రతినిధి గతే పడుతుంది…రోడ్డు మధ్యలో కేంటీన్లు ఏమిటీ?…ఇవీ ఇటీవల మీడియా సమావేశంలో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గోరంట్ల బుచ్చయ్యచౌదరి పరోక్షంగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆయన తనయుడు ఎమ్మెల్యే వాసు పైనా చేసిన ఘాటు వాఖ్యలు.
తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు జరుగుతున్న వేళ రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆదిరెడ్డి అప్పారావు కుటుంబం మధ్య విభేదాలు మరోసారి రాజుకునేందుకు గోరంట్ల వ్యాఖ్యలు ఆజ్యంపోసేలా ఉన్నాయి. పొలిట్ బ్యూరో సభ్యుడైనా మొన్నటి వరకు గోరంట్ల రాజమహేంద్రవరం రాజకీయాల్లో వేలుపెట్టకుండా ఆదిరెడ్డి కుటుంబం మోకాలడ్డింది. దీనిపై గోరంట్ల తీవ్ర అసంతృప్తి, అసనంతో ఉన్నారన్నది తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. రాజమహేంద్రవరం ప్రధాన కేంద్రంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అంశం, జిల్లా స్థాయి మహానాడు సందర్భంగా గోరంట్ల ఫొటో లేకుండా ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం, రాజమహేంద్రవరం టిడిపి నాయకులకు స్థానం లేకుండా గోరంట్ల సన్నిహితుడు మార్ని వాసు చైర్మన్ గా రాజమహేంద్రవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యవర్గాన్ని ప్రకటించడం వంటి అంశాలు గోరంట్ల, ఆదిరెడ్డి వర్గాల మధ్య మొన్నటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆధిపత్యపోరు మళ్లీ ఆజ్యంపోసే పరిస్థితులకు దారితీశాయని భావిస్తున్నారు.
రాజమహేంద్రవరం కేంద్రంగా తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కేబినెట్ తీర్మానించిన నేపథ్యంలో ఆఘనతను సొంతం చేసుకునేందుకు ఆదిరెడ్డి అప్పారావు తనయుడు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పోటీపడ్డారు. కేబినెట్ తీర్మానించిన వెంటనే వాసు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తన కృషి, చొరవ వల్లే తెలుగువిశ్వవిద్యాలయం రాజమహేంద్రవరంలో ఏర్పాటైందని ప్రకటించారు. ఆసమయంలో అమెరికాలో ఉన్న గోరంట్ల బుచ్చయ్యచౌదరి అక్కడి నుంచే మీడియాకు ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. తాను చేసిన కృషి వల్లే తెలుగు విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరంలో ఏర్పాటైందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల జరిగిన జిల్లా స్థాయి మహానాడులో గోరంట్ల బొమ్మ లేకుండా ఫ్లెక్సీ తాజాగా మీడియా సమావేశంలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు ఘనతపై మీడియా అడిగిన ప్రశ్నలపై గోరంట్ల ఘాటుగా స్పందించి, ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యే వాసులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు భూములు పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చూపించింది తానేనని, ఇది చరిత్ర అని గోరంట్ల వ్యాఖ్యానించారు. రాజమహేంద్రవరం అభివృద్ధి, చరిత్రతో తాను మమేకమై ఉన్నానని గోరంట్ల చెప్పుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు భూములు తానే గుర్తించి, పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు చూపించానని చెప్పారు. ఇది చరిత్ర అని, రాజమహేంద్రవరం అభివృద్ధి, చరిత్రలో తాను మమేకమై ఉన్నానని, రాజమహేంద్రవరం అభివృద్ధిపై సుబ్రహ్మణ్యమైదానంలో బహిరంగ చర్చకు సిద్ధమని గోరంట్ల సవాల్ చేశారు.
గోరంట్ల ఘాటు వ్యాఖ్యలు రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీలో ఆధిపత్యపోరుకు మరోసారి బీజం వేశాయన్న వాదన వినిపిస్తోంది. గోరంట్ల ఘాటు వ్యాఖ్యలపై ఆదిరెడ్డి అప్పారావు, వాసు గానీ, ఆయన వర్గీయులు గానీ స్పందించలేదు. ప్రస్తుతం మహానాడు జరుగుతున్న తరుణంలో పార్టీ నేతలు తిరిగి వచ్చే వరకు ఈవివాదం సద్దుమణిగినా…గోరంట్ల వాఖ్యలపై అప్పారావు వర్గీయులు స్పందిస్తే టిడిపిలో అంతర్గత విభేదాలు మరోసారి వీధికెక్కే అవకాశాలు లేకపోలేదు. టిడిపిలో విభేదాలు రాజుకుంటాయా…చల్లారిపోతాయా అన్నది ఆపార్టీ నేతల స్పందనలను బట్టీ ఉంటుంది. ఆదిరెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో జరిగిన జిల్లా మహానాడు నిర్వహణపై సీనియర్ నాయకుడు గన్ని కృష్ణ కూడా అసహనం వ్యక్తం చేయడం రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు చాపకింద నీరులా ఉన్నాయన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
రాజానగరంలోనూ ఆధిపత్యపోరు…
రాజానగరం నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. అక్కడ ఇద్దరు రాజకీయ వారసుల మధ్య ఆధిపత్యపోరు సాగుతోంది. దివంగత టిడిపి నేత బొడ్డు భాస్కరరామారావు తనయుడు వెంకటరమణ చౌదరి నియోజకవర్గ టిడిపి ఇన్ చార్జిగా, రుడా చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్ గా మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ కేబినెట్ పదవిలో ఉన్నారు. ఆయన కుమారుడు అభిరామ్ కూడా ఇటీవల కాలంలో రాజానగరం రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. ఈనేపథ్యంలో వెంకటరమణచౌదరి, అభిరామ్ మధ్య ఆధిపత్యపోరు ప్రారంభమైందని టిడిపి శ్రేణులు చెబుతున్నాయి. బొడ్డు వర్గానికి చెందిన ఒక కార్యకర్తపై అభిరామ్ నేరుగా డిఐజికి ఫిర్యాదు చేయడం కూడా ఆధిపత్యపోరులో భాగమేనని విశ్లేషిస్తున్నారు. నియోజకవర్గంలో చెరోదారిలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ సీటు కోసమే వీరి మధ్య ఆధిపత్యపోరు సాగుతోందని భావిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన జనసేన పార్టీకి చెందిన బత్తుల బలరామకృష్ణ తనదైన శైలిలో పనిచేసుకుని వెళుతున్నారు. ఈనేపథ్యంలో రాజానగరం రాజకీయాల్లో కూటమి పార్టీ నాయకుల మధ్య ఐక్యత పెద్దగా కనిపించడం లేదన్నది ప్రజల మాట.