మబ్బుల్లో కూటమి ప్రభుత్వం….కిక్కిరిసన రైళ్లలో సామాన్యజనం

కాకులు దూరని కారడవి అంటారు కానీ….ఇటీవల ఒక పత్రికలో బాత్రూమ్ లో కూర్చుని రైల్లో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి ఫొటో చూసినపుడు కాలు దూరని కిక్కిరిసన రైల్లో…

 మబ్బుల్లో కూటమి ప్రభుత్వం….కిక్కిరిసన రైళ్లలో సామాన్యజనం

కాకులు దూరని కారడవి అంటారు కానీ….ఇటీవల ఒక పత్రికలో బాత్రూమ్ లో కూర్చుని రైల్లో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి ఫొటో చూసినపుడు కాలు దూరని కిక్కిరిసన రైల్లో అని సామెతను మార్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈఫొటో చూసినపుడు ఒకవైపు ఆవేదన మరోవైపు రైల్వేశాఖపై ఆగ్రహం వ్యక్తమైంది. గోదావరి, గౌతమీ, కోణార్క్, కోరమాండల్, జిటీ, దక్షిణ్ వంటి రద్దీ రైళ్లలో ఇలాంటి దృశ్యాలు నిత్యకృత్యంగా కనిపిస్తాయి. ఒకప్పుడు రైలు సామాన్య, పేద వర్గాల ప్రజలకు చౌకైన ప్రయాణ సాధనం. ఒక విధంగా చెప్పాలంటే ఆర్టీసీ కన్నా రైలు ప్రయాణమే చౌక. అయితే నేడు ఆ రైల్లో ప్రయాణించాలంటే ముందస్తు రిజర్వేషన్ అయినా ఉండాలి…లేదంటే ఏ బాత్రూమ్ లోనూ, లేదంటే కిక్కిరిసన బోగీలో గుమ్మం వద్దో నిలువుకాళ్లపై ప్రయాణించాల్సిన పరిస్థితి. తెలుగు రాష్ట్రాల మీదగా బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే రైళ్లలో రోజుల తరబడి ఇలాగే ప్రయాణిస్తుంటారు. ప్రజల సంక్షేమాన్ని, సౌకర్యాలను పట్టించుకోవాల్సిన భారత ప్రభుత్వ విధానాలే ఇందుకు కారణంగా భావిస్తున్నారు. కార్పొరేటీకరణలో భాగంగా లాభాల కోసం రైల్వేశాఖ పేదలకు అవసరమైన ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయడంతో పాటు, దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలోని జనరల్ బోగీలను కుదించడంతో ప్రయాణీకుల పాట్లు అన్నీఇన్నీ కావు.

కరోనా అనంతర పరిణామాల్లో రైల్వేశాఖ ప్రయాణీకుల సంఖ్యను కారణంగా చూపిస్తూ లాభదాయకం కాదన్న ఉద్దేశంతో దేశవ్యాప్తంగా పలు చిన్న రైల్వే స్టేషన్లను మూసివేసింది. అలాగే సీనియర్ సిటిజన్లకు అందిస్తున్న రాయితీని రద్దు చేసింది. రాజమహేంద్రవరం నగరానికి నడిబొడ్డున గోదావరినదికి ఆనుకుని ఉన్న గోదావరి రైల్వే స్టేషన్ ఒకప్పుడు అర్థరాత్రి కూడా ప్రయాణీకులతో , చిన్నస్థాయి వ్యాపారాలతో కళకళలాడేది. పరిసర గ్రామాల నుంచి పాలు, కూరగాయల సరఫరా ప్యాసింజర్ రైళ్ల ద్వారానే సాగేది. పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు, స్టాపేజీల తొలగింపుతో ఇప్పుడు ఆ స్టేషన్ పూర్తిగా కళావిహీనంగా మారిపోయింది. మధ్య స్థాయి పల్లెలో రైలు దిగి, అక్కడి నుంచి పొరుగ ఉండే స్వగ్రామాలకు, బంధువులు ఉండే గ్రామాలకు నడిచి, రిక్షాలో వెళ్లడం అనేది తీపిగుర్తుగా ఉండేది. రైల్వేశాఖ ఆ తీపి గుర్తులన్నీ చెరిపేసింది. నాడు ధనికులు మినహా సామాన్య ప్రజలంతా జనరల్ బోగీల్లోనే ప్రయాణించే వారు. రిజర్వేషన్ చేయించుకోవడం గొప్పగా చెప్పుకునే వారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గతంలో మొత్తం రైలుకు రిజర్వేషన్ బోగీలు దాదాపు 10లోపు ఉంటే… ఇప్పుడు జనరల్ బోగీలు 2-4కు మించి ఉండటం లేదు. దీంతో ప్రయాణీకులు నరకయాతన అనుభవించాల్సి వస్తోంది.
జనరల్ బోగీలను కుదించిన రైల్వేశాఖ ఆదాయం కోసం స్టేషన్లలోని తత్కాల్, డైనమిక్ రిజర్వేషన్ విధానాలను ప్రవేశపెట్టింది. అలాగే వందేభారత్, దురంతో, రాజధాని, శతాబ్ది వంటి ఖరీదైన రైల్వే సర్వీసులను నడుపుతోంది. వీటిలో రిజర్వేషన్ చేయించుని ప్రయాణించడం సామాన్యులకు సాధ్యం కాని పని. నేటి సామాజిక, ఆర్థిక పరిణామాలు కూడా రైల్వేశాఖ విధానాలకు దోహదపడుతున్నాయి. ఐటి, ఇతర రంగాల్లో పెరిగిన ఉద్యోగ అవకాశాలు, ఆదాయాలు, సామాజిక పరిస్థితులు నేటితరం వారిని మెరుగైన సౌకర్యాలు, వేగవంతమైన ప్రయాణాల వైపు నడిపిస్తున్నాయి. దూర ప్రయాణాలకు ఎసి కారు లేకపోతే కనీసం త్రీటైర్ ఎసి లేనిదే నేటి యువత కాలు బయటపెట్టడం లేదు. దీంతో సౌకర్యవంతమైన ప్రయాణాల కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉంటున్నారు. మరోవైపు సామన్యులు మాత్రం కాలు కూడా పెట్టలేని కిక్కిరిసన జనరల్ బోగీల్లోనే ప్రయాణించాల్సి రావడం రైల్వేల తిరోగమనానికి సంకేతమో…అభివృద్ధికి సంకేతమో పాలకులే భాష్యం చెప్పాలి.

రైళ్లలో జనరల్ బోగీల సంఖ్యను పెంచేందుకు కృషిచేయాల్సిన ప్రజాప్రతినిధులు ఈవిషయాన్ని పట్టించుకున్న దాఖలాలే కనిపించడం లేదు. గంటల తరబడి రాజకీయాలు మాట్లాడే ఎంపిలు రైల్వే బోగీల గురించి పార్లమెంటులో కనీసం ప్రస్తావించకపోవడం శోచనీయం. ఎపిలోని కూటమి ప్రభుత్వానికి కేంద్రంలో కూడా మంచి పట్టు ఉంది. అయితే కూటమి ప్రభుత్వ నాయకులు రాష్ట్రంలో కొత్త విమానాల సర్వీసులు, విమానాశ్రయాల అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారు తప్ప సాధారణ ప్రయాణీకులకు సంబంధించిన జనరల్ బోగీల అంశాన్ని పట్టించుకోవడం లేదు. తరుచూ తనిఖీలు చేసే రైల్వేశాఖ అధికారులకు జనరల్ బోగీ ప్రయాణీకుల కష్టాలు కనిపించడం లేదా అన్న ధర్మాగ్రహం వ్యక్తమవుతోంది. సామాన్యులకు రైళ్లలో చాలినన్ని జనరల్ బోగీలు అందించలేక వారికి నరకాన్ని చూపిస్తున్న ప్రభుత్వాలు ఇప్పటికైనా కాస్త ఆకాశం లో విహరించడం మాని భూమ్మీద నడిచే రైళ్లలో సౌకర్యాలపై దృష్టిసారించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల సంక్షేమమే మా ధ్యేయం అని వక్కాణించే ప్రజాప్రతినిధులు గానీ…సౌకర్యవంతమైన ప్రయాణమే మా లక్ష్యం అని నినదించే రైల్వే అధికారులు గానీ ఎప్పుడైనా సాధారణ బోగీల్లో ప్రయాణించారా….రైళ్లలో అమ్మే టీ, కాఫీ, టిఫిన్లు రుచి చూశారా అంటే అనుమానమే. అనుభవిస్తే తప్ప వారికి సాధారణ ప్రయాణీకుల కష్టాలు ఎలా తెలుస్తాయి.?

Leave a Reply