పగలు నిరసన….రాత్రి పండుగ!

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా జూన్ 4వ తేదీన ఎపి రాజకీయాల్లో ఏర్పడిన ఒక విచిత్ర వాతావరణం ప్రజల్లో చర్చనీయాంశంగా…

 పగలు నిరసన….రాత్రి పండుగ!

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా జూన్ 4వ తేదీన ఎపి రాజకీయాల్లో ఏర్పడిన ఒక విచిత్ర వాతావరణం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం, జనసేన, బిజెపిలతో కూడిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను తుంగలో తొక్కి ప్రజలను వెన్నుపోటు పొడిచిందని ఆరోపిస్తూ వెన్నుపోటు దినంగా పాటిస్తూ ప్రతిపక్ష వైఎస్సార్సీపి రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించి, ఎన్నికల హామీలను నెరవేర్చాలని కోరుతూ అధికారులకు వినతిపత్రాలను సమర్పించింది. దీనికి ప్రతిగా జనసేన పార్టీ వైఎస్సార్సీపి ప్రభుత్వం పతనమై ఏడాది గడిచిన సందర్భాన్ని పురస్కరించుకుని పీడ విరగడై, సుపరిపాలన అందించే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సంక్రాంతి, దీపావళి పండుగల్లా వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చింది. పీడ విరగడైంది కార్యక్రమంలో కూటమి పార్టీలకు చెందిన టిడిపి, బిజెపి నాయకులు కూడా పాల్గొన్నారు. వైసిపి పాలన విరగడైనందుకు సంక్రాంతి పండుగలా ఉదయం రంగవల్లులు వేసి, రాత్రికి బాణాసంచా కాల్చి సంబరాలు జరిపారు.
రాజమహేంద్రవరం, రూరల్, రాజానగరం సహా పలు నియోజకవర్గాల్లో ఉదయం వైసిపి శ్రేణుల నిరసనలతో హోరెత్తితే రాత్రికి బాణాసంచా కాల్పులు సంబరాలతో హోరెత్తించారు. రాజమహేంద్రవరంలో వైసిపి కోఆర్డినేటర్, మాజీ ఎంపి మార్గాని భరత్ రామ్ నేతృత్వంలో ఆజాద్ చౌక్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. ఈసందర్భంగా కార్యకర్తలు దుస్తులు ధరించి, నల్ల బుడగలను గాలిలోకి ఎగురవేసి నిరసన వ్యక్తం చేశారు. రూరల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, యువ నాయకుడు జక్కంపూడి గణేష్ నేతృత్వంలో బొమ్మూరులోని పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు తహశీల్దార్ కార్యాలయం వరకు భారీ నిరసన ప్రదర్శన జరిపారు.

ఉదయం వైసిపి నిరసనలతో హోరెత్తగా సాయంత్రానికి కూటమి నేతలు బాణాసంచాతో సందడి చేశారు. రాజమహేంద్రవరంలోని జాంపేట సెంటర్ లో జరిగిన సుపరిపాలన సంబరాల వేడుకల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, కూటమి నాయకులు పాల్గొన్నారు. కూటమి శ్రేణులు ఉదయం రంగవల్లులు వేయగా, సాయంత్రం బాణాసంచా కాల్చి సంబరాలు జరిపారు. రాజానగరంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. రాజానగరం, జనసేన పార్టీ కార్యాలయం వద్ద నుండి సుమారు 5వేల బైకులతో కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి గుడి వరకు భారీ ర్యాలీని జరిపారు. గత ప్రభుత్వం రాక్షస పాలనకు సూచికగా నరకాసురుడు, తుగ్లక్ పోలిన దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి వారి గుడి మెట్ల వద్ద ప్రత్యేక దీపాలు వెలిగించి, భారీ బాణసంచా కాలుస్తూ, స్వామివారికి ప్రత్యేక పూజలు హోమాలు చేశారు. అయితే ఈకార్యక్రమాల్లో రాజానగరంలోని టిడిపి నేతలు బొడ్డు వెంకటరమణచౌదరి, పెందుర్తి వెంకటేష్, తనయుడు అభిరామ్ వర్గీయులు కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అనారోగ్యం కారణంగా సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఈవేడుకలకు దూరంగా ఉండటంతో రూరల్ నియోజకవర్గంలో సుపరిపాలన సంబరాలు పెద్దగా జరగలేదు.
వెన్నుపోటు దినం… సుపరిపాలనా దినోత్సవాలతో జూన్ 4న ఎపిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. సూపర్ సిక్స్ హామీల అమలు, రెడ్ బుక్ రాజ్యాంగంపై వైసిపి నాయకులు విరుచుకుపడగా…అరాచక పాలనకు, బాబాయ్ ని హత్య చేయించిన వైసిపి అధినేత వైఎస్ జగన్ వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అని కూటమి నాయకులు ధ్వజమెత్తారు. సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమమే తమ ధ్యేయమని ప్రకటించారు. వైసిపి, కూటమి పార్టీల నిరసనలు, వేడుకల్లో ప్రజలెవరూ స్వచ్చందంగా పాల్గొన్నట్లు కనిపించకపోవడం ఇక్కడ ప్రస్తావనార్హం. ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే వైసిపి అధికారంలోకి వస్తుందా అని ఆపార్టీ నాయకులను ప్రశ్నిస్తే స్పష్టమైన సమాధానం చెప్పలేకపోతున్నారు. అయితే ఇలాగే ప్రజా వ్యతిరేకత పెరిగితే 2029 నాటికి మళ్లీ అధికారంలోకి వస్తామని ఆపార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. అలాగే సుపరిపాలన చేస్తున్న కూటమి పార్టీ నేతలను ఇదే ప్రశ్న వేయగా ఈసారి ఎన్నికల్లో జగన్ కు ఇప్పుడున్న 11 స్థానాలు కూడా దక్కడం కష్టమని జోస్యం చెబుతున్నారు. వైఎస్సార్సీపి పాలనలో నగదు బదిలీ పథకాలు అమలు చేయడంతో ప్రజల చేతుల్లో డబ్బులు ఆడి, మార్కెట్లు కూడా కాస్త కళగా కనిపించేవని వర్తకులు చెబుతున్నారు. సూపర్ సిక్స్ వంటి సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు కాకపోయినా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రోడ్ల వంటి మౌలిక వసతులను అభివృద్ధి చేస్తుందన్న ఆశాభావంతో ప్రజలు ఉన్నారు. అయితే కూటమిలోని ప్రధాన భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం పార్టీ రాజధాని అమరావతి అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యత ఇతర పథకాలు, పనులకు ఇవ్వడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పార్టీల ప్రకటనలు ఎలా ఉన్నా వైసిపి, కూటమి పాలనపై బేరీజు వేసుకుని ఎన్నికల్లో అంతిమ తీర్పరులైన ప్రజలు ఎటువైపు మొగ్గు చూపిస్తున్నారన్నది అంతుచిక్కడం లేదు. ప్రజాభీష్టాన్ని తెలుసుకునేందుకు 2029 వరకు వేచిచూడాల్సిందే….

Leave a Reply