- November 25, 2024
షేర్ మార్కెట్ లోకి రాజమహేంద్రవరం….ఎపిలోనే తొలిసారి
భారీ పరిశ్రమలు నిధులు సమీకరించే తరహాలో ప్రజల నుంచి వాటాలను సమీకరించి స్వయం సమృద్ధిని సాధించాలని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ సన్నాహాలు చేస్తోంది. దేశంలో తొలిసారిగా మధ్యప్రదేశ్…
భారీ పరిశ్రమలు నిధులు సమీకరించే తరహాలో ప్రజల నుంచి వాటాలను సమీకరించి స్వయం సమృద్ధిని సాధించాలని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ సన్నాహాలు చేస్తోంది. దేశంలో తొలిసారిగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరం ఈతరహాలో పబ్లిక్ ఇష్యూ ద్వారా ప్రజల నుంచి నిధులను సమీకరించింది. ఎపిలో తొలి స్థానిక సంస్థగా రాజమహేంద్రవరం చరిత్రలో నిలవనుంది. ప్రజల నుంచి నిధుల సేకరణకు ముంబయ్ స్టాక్ ఎక్స్చేంజీ ద్వారా గ్రీన్ బాండ్లు విక్రయిస్తారు. సాంప్రదాయేతర ఇంధన వనరుల ఉత్పత్తి కోసం గ్రీన్ బాండ్ల పేరిట ప్రజల నుంచి రూ. 45కోట్ల నిధులు సేకరించనున్నట్లు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ వెల్లడించారు. నిధుల సమీకరణలో భాగంగా ఫండ్ మేనేజర్ గా విశాఖపట్నంనకు చెందిన అనురాగ్ అసోసియేట్ ను నియమించినట్లు తెలిపారు. ప్రజల నుంచి సమీకరించిన నిధులతో దాదాపు 5 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంటును ఏర్పాటు చేస్తామన్నారు. సౌర విద్యుత్ ను నగరపాలక సంస్థ పరిధిలోని మంచినీటి సరఫరా విభాగం, ఇతర అవసరాలకు వినియోగిస్తామన్నారు. తద్వారా విద్యుత్ చార్జీలు ఆదా అవుతాయన్నారు. ఎస్టీపీ ద్వారా విడుదలయ్యే నీటిని శుద్ధి చేసి పైపులైన్ల ద్వారా ఓఎన్జీసీ, గెయిల్, ఆర్టీసి, రైల్వేలకు సరఫరా చేసి ఆదాయాన్ని పొందుతామన్నారు. అలాగే నగరపరిధిలో సేకరించే చెత్తను వేరుచేసి, సిఎన్జీ తరహాలో రూ. 100కోట్లతో కంప్రెస్డ్ బయోగ్యాస్(సిబిజి) ప్లాంటును లూథర్ గిరి, ఎస్టీపి వద్ద ఏర్పాటు చేసి, ఉత్పత్తి చేసిన బయోగ్యాస్ ను నగరపాలక సంస్థ వినియోగించే వాహనాలకు వినియోగించేలా చర్యలు తీసుకుంటామని కమిషనర్ వివరించారు. ఈమేరకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ తో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. నగరపరిధిలో రోజుకు 120 టన్నుల చెత్త విడుదలవుతుందని, దాన్ని వేరుచేసి బిపిసిఎల్ కు విక్రయిస్తామన్నారు. చెత్తను వేరుచేసే విషయంలో ప్రజలు, సంస్థలు నిర్లక్ష్యం వహించకుండా జరిమానాలను రెట్టింపు చేశామన్నారు. గ్రీన్ బాండ్ల ద్వారా సేకరించిన నిధులు ఈప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టడం వల్ల నగరపాలక సంస్థ స్వయంసమృద్ధిని సాధిస్తుందని, ఇంధన వనరుల ఆదాతో పాటు, కేంద్రం నుంచి 13శాతం సబ్సిడీ లభిస్తుందని కమిషనర్ కేతన్ గార్గ్ వివరించారు.
స్వయంసమృద్ధిలో భాగంగా క్వారీ సెంటర్ లో ఐఓసిఎల్ ఆధ్వర్యంలో పెట్రోలు బంకును ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీని ద్వారా నగరపాలక సంస్థకు నెలకు రూ. 4నుంచి 5లక్షల ఆదాయం లభించే అవకాశాలు ఉన్నాయన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో చెత్త సేకరణకు మరో 50 కొత్త వాహనాలను కొనుగోలు చేస్తామని చెప్పారు. చెత్తను తరలించేందుకు వైసిపి ప్రభుత్వ హయాంలో క్లాప్ పథకం కింద కొనుగోలు చేసిన వాహనాలను ఆయా వ్యక్తులు స్వాధీనం చేసుకుంటారని, ఆ కాంట్రాక్టు రద్దు చేసి, నగరపాలక సంస్థ సొంత వాహనాలను వినియోగిస్తామన్నారు.