• October 11, 2024

ఈతెలుగు కుర్రాళ్లు రతన్ టాటాకు సన్నిహితులు

వ్యాపారదిగ్గజం…మానవతావాది రతన్ టాటా అవివాహితుడు. 86ఏళ్ల వృద్ధుడైన ఆయనకు స్నేహితులు కూడా చాలా అరుదు. అలాంటి రతన్ టాటాకు ఇద్దరు తెలుగు యువకులు స్నేహితులు కావడం దేశవ్యాప్తంగా…

వ్యాపారదిగ్గజం…మానవతావాది రతన్ టాటా అవివాహితుడు. 86ఏళ్ల వృద్ధుడైన ఆయనకు స్నేహితులు కూడా చాలా అరుదు. అలాంటి రతన్ టాటాకు ఇద్దరు తెలుగు యువకులు స్నేహితులు కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వారిలో శంతను నాయుడు అనే 3! ఏళ్ల యువకుడు మరింత సన్నిహితుడు. రతన్ టాటా, శంతనునాయుడు ఒకరి భుజం మీద ఒకరు చేతులు వేసుకుని నడిచేంత సన్నిహితులు. మరో యువకుడు తూర్పుగోదావరి జిల్లా కడియపు లంక ప్రాంతానికి చెందిన యువకుడు కావడం విశేషం.

పూణేలో స్థిరపడిన శంతనునాయుడు జంతు ప్రేమికుడిగా రతన్ టాటాకు దగ్గరయ్యాడు. ఆతరువాత ఆయనకు వ్యక్తిగత సహాయకుడిగా మారాడు. నాయుడు సామాజిక కార్యకర్తగా, రచయితగా, యువ పారిశ్రామికవేత్తగా ఎదుగుతున్నాడు. 2014లో పూణే విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టభద్రుడైన శాంతను నాయుడ జంతు ప్రేమికుడు కూడా. వీధి కుక్కలు రక్షణకు మోటోపాస్ అనే సంస్థను స్థాపించి, వీధి కుక్కలు రోడ్డు ప్రమాదాల బారినపడకుండా వాటి మెడకు రేడియం బెల్టులు కట్టే పనికి శ్రీకారం చుట్టాడు. ఈవిషయం రతన్ టాటాకు తెలిసి అతడ్ని పిలిపించుకుని మాట్లాడటంతో పాటు, తన టాటా ఇండస్ట్రీస్ ట్రస్టు ద్వారా నిధులు సమకూర్చారు. శంతను ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం స్థాపించిన ‘ఆన్‌ యువర్‌ స్పార్క్స్‌’ అనే కౌన్సెలింగ్‌, యువతకు ఉపాధి కల్పించడం కోసం ‘గుడ్‌ఫెలోస్‌’ సంస్థల్లో కూడా టాటా సంస్థ పెట్టుబడి పెట్టింది. జంతువుల కోసం ఓ ఆసుపత్రిని సైతం ప్రారంభించింది. టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్మాల్ యానిమల్ హాస్పిటల్‌ కు శంతను నాయుడే డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈనేపథ్యంలో రతన్ టాటాకు, నాయుడు మధ్య స్నేహం బలపడింది.  సోషల్ మీడియా వినియోగం.. జంతువుల రక్షణ, పలు సేవా కార్యక్రమాల గురించి ఇద్దరూ కలిసి తరచూ మాట్లాడుకునేవారు. చివరకు 2018లో తన మేనేజర్ గా శంతనునాయుడ్ని నియమించుకున్నారు. రతన్ టాటా మరణంతో శంతను తీవ్ర విచారంలో మునిగిపోయాడు. ముంబైలో తన బాస్‌ ఇంటి నుంచి అంతిమయాత్ర మొదలవ్వగానే పార్థివ దేహం ఉంచిన వాహనం ముందు యెజ్డీ  మోటార్‌ సైకిల్‌ మీద శంతను అంతిమయాత్రలో ముందుకు సాగాడు. ఇక కడియంనకు చెందిన  25ఏళ్ల యువకుడు మార్గాని  వెంకట శేషు ఆరేళ్లుగా నేరుగా రతన్ టాటాతో ఈ మెయిల్స్ ద్వారా సన్నిహితుడయ్యాడు. ఎంబిఏ చదివిన శేషు అన్ని రంగాల్లో టాటా సంస్థలు వ్యాపారంలో ఉండటాన్ని గమనించి  రతన్ టాటా అభిరుచులు ఏంటి అనేదానిపై ఆరా తీయడం మొదలుపెట్టాడు. . ఆయన మొక్కలతో పాటు పశుపక్షాదులపై ఎలాంటి అభిమానాన్ని చూపెడతారనేది అవగాహన చేసుకున్నారు. రతన్ టాటా అభిరుచులకు అనుగుణంగా కొన్ని కొటేషన్లను తయారుచేసి ఆయన వ్యక్తిగత ఈ మెయిల్ కు పంపేవాడు. అలా కొద్ది రోజులు గడిచేసరికి ఆయనను మరింత ఆకట్టుకునేలా కొన్ని బొమ్మలు వేయించి ఈ కుర్రాడు పంపించాడు. కడియం కుర్రాడు పంపిన బొమ్మలు రతన్ టాటా కు నచ్చాయి. తన జన్మదినం రోజున ఆయనను స్వయంగా కలవాలనే శేషు కోరికను రతన్ టాటా ఆమోదించారు. ముంబాయిలోని  రతన్ టాటా బంగ్లాలో కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నాడు శేషు. తొలుత రెండు నిమిషాలు మాత్రమే అపాయింట్ మెంట్ ఇచ్చిన రతన్ టాటా మరికొద్దిసేపు శేషుతో మాట్లాడేందుకు ఆసక్తి కనపరచడం విశేషం. తన తల్లిదండ్రులు వీరబాబు, సత్యలను కూడా కలిసేందుకు రతన్ టాటా ఆమోదం తెలిపినా….విమాన ప్రయాణంలో గంటన్నర ఆలస్యం అయినా వారి గురించి రతన్ టాటా వేచి ఉండటం శేషు పట్ల ఆయన అభిమానానికి నిదర్శనంగా నిలుస్తోంది. రతన్ టాటా  డ్రై ఫ్రూట్ లడ్డూలను ఇష్టంగా తింటారని తెలిసి శేషు తల్లితో తయారు చేయించి పంపించారు. వాటిని తిని బాగున్నాయని స్వయంగా రతన్ టాటా శేషుకు సమాచారం పంపారు. రతన్ టాటా మృతి పట్ల శేషు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

 

 

Leave a Reply