తెలంగాణాలోనూ… రెడ్ బుక్ రాజ్యాంగం?!
పుష్ప-2 సినిమాలో గంధం చెక్కలతో పాటు ప్రత్యర్థులను హీరో అల్లు అర్జున్ వేటాడగా…హైదరాబాద్ సంధ్య ధియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో నిజజీవితంలో ఆయననే తెలంగాణా ప్రభుత్వం వెంటాడుతున్నట్లు…

పుష్ప-2 సినిమాలో గంధం చెక్కలతో పాటు ప్రత్యర్థులను హీరో అల్లు అర్జున్ వేటాడగా…హైదరాబాద్ సంధ్య ధియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో నిజజీవితంలో ఆయననే తెలంగాణా ప్రభుత్వం వెంటాడుతున్నట్లు కనిపిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈకేసులో 11వ నిందితుడిగా ఉన్న అర్జున్ ను మొన్న అనూహ్యంగా అరెస్టు చేయగా, తాజాగా విచారణ నిమిత్తం చిక్కడపల్లి పోలీసు స్టేషన్ కు రావాలని పోలీసులు నోటీసులు జారీ చేయడం గమనార్హం. అసెంబ్లీలో కూడా అర్జున్ వ్యవహరశైలిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తూర్పారబట్టారు. అలాగే హైదరాబాద్ సిపి ఆనంద్ విలేఖర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి, సంధ్య ధియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన నాటి ఘటనకు సంబంధించిన వీడియోలను విడుదల చేశారు. అసెంబ్లీలో ఈఅంశంపై ఎంఐఎం ప్రశ్నించడం…రేవంత్ రెడ్డి ఘాటుగా సమాధానం చెప్పడం కూడా వ్యూహాత్మకమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, సిపీ విడుదల చేసిన వీడియోలు అల్లు అర్జున్ ఇమేజ్ ను దెబ్బతీసేవిధంగా ఉన్నాయనడంలో సందేహం లేదు.
ఈపరిణామాలతో తెలంగాణా ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ భావి ముఖ్యమంత్రిగా భావిస్తున్న నారా లోకేష్ బాటలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందా అన్న అనుమానాలను తెలంగాణాలో కాంగ్రెస్ వ్యతిరేక, ఎపిలో కూటమి వ్యతిరేక పార్టీల నాయకులు, కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శిష్యుడైన తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రభావాలకు లోనువుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఎపిలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దీని ప్రకారమే వైసిపి నాయకులు, కార్యకర్తలు, వైసిపికి అనుకూలంగా వ్యవహరించిన ఉన్నతాధికారులపై కేసులు నమోదయ్యాయన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణాలో కూడా ఇదే రాజ్యాంగాన్ని అమలు చేసేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఎపిలోని ప్రభుత్వ పెద్దలు, మాజీ పోలీసు బాస్ లు తెరవెనుక ఒత్తిళ్లు తెస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉండగా 2022లో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కందుకూరులోతెలుగుదేశం పార్టీ ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరైన సభలో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది మరణించారు. అనేక మందికి గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా నల్లపాడు వద్ద గత ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కానుకల పంపిణీ కార్యక్రమంలో ముగ్గురు మరణించారు. ఈకార్యక్రమంలో కూడా చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. 2015లో జరిగిన గోదావరి పుష్కరాల తొక్కిసలాట ఘటనలో 29 మంది భక్తులు, యాత్రికులు దుర్మరణం చెందారు. ఈసంఘటనలన్నింటీలో సామాన్యులే కన్నుమూయడం గమనార్హం. సంధ్య ధియేటర్ తొక్కిసలాట ఘటనపై స్పందిస్తున్న తీరుకు భిన్నంగా నాడు టిడిపి నేతలు, శ్రేణులు, ఎల్లో మీడియా స్పందించడం గుర్తుంచుకోవాల్సిన అంశం.
పుష్ప-2 విడుదల నాటి నుంచే వివాదాలకు కేరాఫ్ గా మారింది. అల్లు అర్జున్ గత సార్వత్రిక ఎన్నికల్లో తన మామయ్య, జనసేనాని పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకున్న కూటమి పార్టీల తరుపున ప్రచారం చేయకుండా అధికారి వైసిపి తరుపున నంద్యాల నుంచి పోటీ చేసిన శిల్పా రవి చంద్రారెడ్డికి మద్దతుగా ఆయన ఇంటికి వెళ్లడమే నేరంగా మారింది. నాటి నుంచి తెలుగుదేశం పార్టీ నేతలు, జనసేన కార్యకర్తలు అర్జున్ పై కక్ష పెంచుకున్నట్లు కనిపిస్తోంది. పుష్ప-2 సినిమా విడుదల కాగానే ప్లాప్ అని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఈసినిమాకు దూరంగా ఉన్నారన్నప్రచారం సాగింది. బెన్ ఫిట్ షో ధరలపై కూడా వ్యతిరేక ప్రచారం సాగింది. సంధ్య ధియేటర్ తొక్కిసలాటతో అర్జున్ పై వ్యతిరేక ప్రచారం ఊపందుకుంది. అల్లు అర్జున్ విషయంలో రాజకీయ పార్టీలు కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వైసిపి, దాని నీలి మీడియా అర్జున్ ను ప్రత్యక్షంగా భుజాన వేసుకుంది. ఎపి బిజెపి అధ్యక్షురాలు పురంధరేశ్వరి కూడా అర్జున్ కు మద్దతుగా మాట్లాడారు. అయితే టిడిపి, జనసేన నాయకులు అర్జున్ వ్యతిరేక ధోరణితో వ్యవహరిస్తున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ మినహా…మిగిలిన అన్ని పార్టీలు అర్జున్ కు మద్దతుగా నిలిచాయి.
ఇకపోతే తెలంగాణాలో బెన్ ఫిట్ షోలకు ఇకపై అనుమతివ్వమని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం సంక్రాంతి సినిమాల బరిలో నిలిచిన మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్, చంద్రబాబునాయుడు బావమరిది, టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ నటించిన డాకు మహరాజ్ తో పాటు మెగాస్టార్, ప్రభాస్ చిత్రాల కలెక్షన్లపై కూడా ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బెన్ ఫిట్ షో టిక్కెట్ ధరల వ్యతిరేక ప్రభావం ఎపిపై కూడా పడే అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతి నాటికి తెలంగాణాలోని కాంగ్రెస్ ప్రభుత్వం బెన్ ఫిట్ షోల మెత్తపడితే కూటమి ఇటు ఆంధ్రా, తెలంగాణాల్లో కూటమి అనుకూల హీరోలకు మేలు జరుగుతుంది. లేనిపక్షంలో ప్రజల జేబులపై భారం తగ్గుతుంది.