పుష్ప తగ్గకుండా తప్పులు చేశాడా?!

నాగ్ పూర్ లో ఒక గ్యాంగ్ స్టర్ ను పుష్ప-2 సినిమా చూస్తుండగా పోలీసులు అరెస్టు చేశారట. పుష్ప సినిమా చూడాలని అతను ఎంతో ఆతృతగా ఉన్నాడని…

 పుష్ప తగ్గకుండా తప్పులు చేశాడా?!

నాగ్ పూర్ లో ఒక గ్యాంగ్ స్టర్ ను పుష్ప-2 సినిమా చూస్తుండగా పోలీసులు అరెస్టు చేశారట. పుష్ప సినిమా చూడాలని అతను ఎంతో ఆతృతగా ఉన్నాడని పోలీసులు గుర్తించి, అక్కడే మాటు వేసి, అరెస్టు చేశారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప-1 జాతీయస్థాయిలో ఎంతో క్రేజ్ సంపాదించింది. సహజంగానే పుష్ప-2 పట్ల కూడా ప్రేక్షకులు అదే స్థాయిలో ఉత్సుకత చూపించారు. అలాంటి సమయంలో తగ్గేదేలే అన్నట్లు పోలీసులు వద్దన్నా తొలిరోజే పుష్ప-2 సినిమా చూసేందుకు హైదరాబాద్ లోని రద్దీ ప్రాంతమైన ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న సంధ్య ధియేటర్ కు స్వయంగా వెళ్లి సినిమా చూడటం అర్జున్ చేసిన తొలి తప్పన్నట్లుగా విశ్లేషిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైదరాబాద్ సిపి ఆనంద్ చెప్పినట్లుసినిమా ధియేటర్ కు వచ్చే ముందు ఓపెన్ టాప్ కారులో ప్రేక్షకులకు చేతులు ఊపుకుంటూ అభివాదం చేయడాన్ని తప్పుపడుతున్నారు. అప్పటికే కిక్కిరిసిపోయిన ధియేటర్ లోకి అర్జున్ కుటుంబ సమేతంగా రావడంతో ఆయనను చూసేందుకు ప్రేక్షకులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈవిషయాన్ని అర్జున్ దృష్టికి తీసుకెళ్లేందుకు పోలీసు అధికారులు విఫలయత్నం చేశారు. ఈవిషయంలో ఆయన మేనేజర్, బౌన్సర్లు శిఖండి పాత్ర పోషించారన్న విమర్శలున్నాయి. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడంతో పాటు, ఆమె కుమారుడు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈవిషయాన్ని తెలిపేందుకు కూడా పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చిందని పోలీసు అధికారులు చెబుతున్నారు. అయినా సినిమా మొత్తం చూసి గానీ వెళ్లనని అర్జున్ చెప్పడం దారుణమన్న వాఖ్యలు వినిపిస్తున్నాయి. చివరకు అర్జున్ ధియేటర్ నుంచి వెళ్లే సమయంలో కూడా చేతులు ఊపుకుంటూ వెళ్లిపోయినట్లు వీడియో కనిపిస్తోంది.

ప్రేక్షకుల స్పందనను స్వయంగా అనుభూతి చెందేందుకు నటులు ధియేటర్లకు వెళ్లి సినిమా చూడటం తప్పేమీ కాదు. అర్జున్ ఎంచుకున్న సందర్భమే తప్పన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ప్రిన్స్ మహేష్ బాబు వంటి వారు ధియేటర్లకు వెళ్లి సినిమా చూస్తామని చాలా సార్లు చెప్పారు. కానీ వారిని ఎవరూ గుర్తుపట్టని చోట్లకు వెళ్లి సినిమా చూస్తారు. ఈవిషయాన్ని మూడో కంటికి కూడా తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ అర్జున్ ఊరేగుతూ రావడం, తొక్కిసలాట జరిగినా చాకచక్యంగా ధియేటర్ నుంచి బయటకు రాకపోవడం  తప్పన్న వాదన వినిపిస్తోంది. ధియేటర్ వద్ద ఆయన బౌన్సర్లు చేసిన హంగామా, దౌర్జన్యాలు హీరోల పట్ల విరక్తిని కలిగించేవిగా ఉంటున్నాయన్నది వాస్తవంగా తేలింది.  ఎవరు సలహా ఇచ్చారో గానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన రోజే అర్జున్ కూడా విలేఖర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి విమర్శలు, ఖండనలు చేయకపోయినా వివరణలు ఇవ్వడాన్ని రేవంత్ రెడ్డికి కౌంటర్ గా భావించారు. రేవతి మరణించిన చాలా రోజుల వరకు ఆమె కుటుంబాన్ని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కుమారుడ్ని  అర్జున్ సహా సినిమా జనాలు ఎవరూ పరామర్శించకపోవడం, మరోవైపు కేవలం ఒకరాత్రి జైలు జీవితం గడిపిన అల్లు అర్జున్ ను పరామర్శించేందుకు క్యూలు కట్టడం  రేవంత్ రెడ్డి చెప్పినట్లు అమానవత్వమే. చాటుమాటుగానైనా ఆమె కుమారుడ్ని, కుటుంబాన్ని పరామర్శిస్తే ఈ అపవాదు వచ్చేది కాదు. రేవంత్ రెడ్డి విమర్శల తరువాత ఇప్పుడు రేవతి కుటుంబాన్ని పరమార్శించేందుకు క్యూలు కట్టడం గమనార్హం. దీన్ని బట్టి సినీ జనాలు అప్పటి వరకు మృతురాలి కుటుంబాన్ని పట్టించుకోలేదన్నది రూఢీ అవుతోంది.

తెలంగాణాలో బెన్ ఫిట్ షోలకు అనుమతినిచ్చిన ముఖ్యమంత్రి పేరే తెలియని విధంగా అర్జున్ వ్యవహరించడం మొదటి తప్పుగా చెబుతున్నారు. ఈపరిణామాలన్నింటికీ ఇప్పుడు హైదరాబాద్ లోని సినిమా రంగం మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తోందని విశ్లేషిస్తున్నారు. ఇకపోతే ఈసందర్భంగా బెన్ ఫిట్ షోల దోపిడీ, బౌన్సర్ల ఆగడాలు, హీరోల అతిచేష్టలు చర్చనీయాంశం కావడం ప్రేక్షకులకు శుభపరిణామమే…

Leave a Reply