బిజెపి వాషింగ్ మిషన్ లోకి విశాఖ డైరీ చైర్మన్

సిబిఐ, ఇడి కేసుల వంటి మరకలు పడ్డ నాయకులు బిజెపిలో చేరితే వాషింగ్ మెషీన్ లో ఉతికినట్లు స్వచ్చంగా మారిపోతారన్నది జాతీయస్థాయిలో ఉన్న విమర్శ. ఎపికి చెందిన…

 బిజెపి వాషింగ్ మిషన్ లోకి విశాఖ డైరీ చైర్మన్

సిబిఐ, ఇడి కేసుల వంటి మరకలు పడ్డ నాయకులు బిజెపిలో చేరితే వాషింగ్ మెషీన్ లో ఉతికినట్లు స్వచ్చంగా మారిపోతారన్నది జాతీయస్థాయిలో ఉన్న విమర్శ. ఎపికి చెందిన ఎంపిలు సిఎం రమేష్, సుజనాచౌదరి వంటి వారు అలా చేరిన వారే అన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా విశాఖ డైరీ చైర్మన్ వైసిపి నాయకుడు అడారి ఆనంద్ కుమార్ బిజెపిలో చేరడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. బుధవారం ఆనంద్ కుమార్ ఆయన సోదరి యలమంచిలి మున్సిపల్ చైర్ పర్సన్ పి రమణికుమారితో పాటు, 9 మంది విశాఖ డైరీ డైరెక్టర్లు కూడా బిజెపి కండువా కప్పుకున్నారు. ఆనందకుమార్ తన అనుచరులతో కలిసి రాజమహేంద్రవరం చేరుకుని, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి, బిజెపి నేతలు విష్ణుకుమార్ రాజు, సోము వీర్రాజు, పివి మాధవ్ తదితరుల సమక్షంలో బిజెపి కండువా కప్పుకున్నారు. ఆనంద కుమార్ విశాఖ డైరీలో అక్రమాలు జరిగాయని బిజెపి భాగస్వామ్యంలోని కూటమి ప్రభుత్వం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సారధ్యంలో సభా సంఘాన్ని నియమించడం ఇక్కడ గమనార్హం.

ఆనంద కుమార్ 2019లో టిడిపి అభ్యర్థిగా  అనకాపల్లి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. వైసిపి అధికారంలోకి రావడంతో ఆపార్టీలో చేరారు. గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి చేతిలో ఓటమిపాలయ్యారు. కూటమి ప్రభుత్వం డైరీపై సభా సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల నెహ్రూ నేతృత్వంలోని కమిటీ విశాఖ డైరీని సందర్శించి అనేక అవినీతి, అక్రమాలు జరిగాయని వెల్లడించింది. ఈనేపథ్యంలో ఆనందకుమార్ బిజెపిలో చేరడం చర్చనీయాంశంగా మారింది. అవినీతి మచ్చ ఉన్న నాయకుడ్ని కూటమి పార్టీలో ఎలా చేర్చుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆనందకుమార్ పై సభా సంఘం విచారణను బిజెపి  ఏవిధంగా ప్రభావితం చేస్తుంది……విచారణలో ఆయనకు క్లీన్ చీట్ లభించే అవకాశాలు ఉన్నాయా అన్న చర్చ సాగుతోంది. ఆనందకుమార్ చేరికపై ఇప్పటికే శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అసంతృప్తిని వ్యక్తం చేశారట. ఆనందకుమార్ బిజెపిలో చేరికతో సభాసంఘం విచారణ నెమ్మదించే అవకాశాలు ఉన్నాయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

మరోవైపు గోకవరంనకు చెందిన కంబాల శ్రీనివాసరావు బిజెపిలో చేరిక కూడా చర్చనీయాంశంగా మారుతోంది. బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి, సోము వీర్రాజు తదితరులు గోకవరం వెళ్లి మరీ కంబాలను, ఆయన అనుచరగణాన్ని బిజెపిలో చేర్చుకున్నారు. ఈసందర్భంగా లక్షలాది రూపాయల వ్యయంతో సభాస్థలిని కూడా కంబాల ఏర్పాటు చేయించారు.  బిజెపి నేతలు సేదదీరేందుకు ప్రత్యేక క్యారవ్యాన్ ను కూడా ఆయన తెప్పించడం విశేషం. కంబాల బిజెపిలో చేరికకు ముందు చాలా హంగామా చేశారు. మీడియా మేనేజ్ మెంట్ కే దాదాపు రూ. 2కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారని చెబుతున్నారు. మొన్నటి వరకు ఆయన దాత, ఆధ్యాత్మికవేత్తగా ప్రచారం పొందారు. ఏమీ ఆశించకుండానే ఆయన భారీ వ్యయంతో ప్రచారం పొంది, రాజకీయాల్లో చేరుతున్నారా అన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో కంబాల శ్రీనివాసరావు జగ్గంపేట లేదా రాజమహేంద్రవరం పరిసర నియోజకవర్గాల నుంచి అసెంబ్లీ సీటును ఆశించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

Leave a Reply