మన్మోహన్ సింగ్ పై అవన్నీ అపోహలే….ఆయనతో అనుబంధాన్ని పంచుకున్న ఉండవల్లి

దివంగత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మౌన ముని అని… బలహీనమైన ప్రధాని అని.. కీలుబొమ్మ అని.. చెబుతుంటారు. అయితే అవన్నీ అపోహలేనని మాజీ ఎంపి ఉండవల్లి…

 మన్మోహన్ సింగ్ పై అవన్నీ అపోహలే….ఆయనతో అనుబంధాన్ని పంచుకున్న ఉండవల్లి

దివంగత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మౌన ముని అని… బలహీనమైన ప్రధాని అని.. కీలుబొమ్మ అని.. చెబుతుంటారు. అయితే అవన్నీ అపోహలేనని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ కొట్టిపారేశారు. మన్మోహన్ సింగ్ అస్తమయం నేపథ్యంలో రాజమహేంద్రవరంలోని బుక్ బ్యాంకులో ప్రత్యేకంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఆయనతో ఉన్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను పంచుకున్నారు. మన్మోహన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. మన్మోహన్ సింగ్ మౌనముని కాదని, ప్రతీనెలా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి, ప్రభుత్వ విధానాలను వివరించేవారన్నారు. అయితే వినడానికే ఇష్టపడేవారన్నారు. ఆయనేమాత్రం కీలుబొమ్మ కాదని స్పష్టం చేస్తూ అవసరమైనపుడు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకాడేవారు కాదన్నారు. పార్లమెంటులో ఆయన మాట్లాడేటప్పుడు సభ్యులంతా నిశ్శబ్దంగా వినేవారన్నారు. రాజకీయాల కన్నా ఆర్థిక అంశాలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారని వివరించారు. చంద్రశేఖర్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్థిక సలహాదారుగా ఉన్న మన్మోహన్ ను దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు ఆర్థిక మంత్రిగా చేశారని, దీనిపై చంద్రశేఖర్ పార్లమెంటులో ఎద్దేవా చేశారని గుర్తు చేసుకున్నారు. చంద్రశేఖర్ హయాంలో ఆర్థిక సంస్కరణలు విఫలమయ్యాయని గుర్తుచేసుకున్నారు.

అయితే మన్మోహన్ సింగ్ పాలన దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిక్కించదగినదని కొనియాడారు. ప్రధానిగా డా మన్మోహన్ సింగ్ తీసుకువచ్చిన సమాచార హక్కు చట్టం, రుణమాఫీ, ఉపాధి హామీ పథకం, ఆధార్ కార్డు ఇలా ప్రతి పార్లమెంట్ సమావేశంలో ఒక్కొక్క కొత్త స్కీమ్ తెచ్చారని ఉండవల్లి గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా రూ. 75వేల కోట్ల రుణ మాఫీ చేశారన్నారు. ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు, పథకాల కారణంగానే 2009లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిందని ఉండవల్లి చెప్పారు. ఆతరువాత బిజెపి  సమాచార హక్కు చట్టం కారణంగానే కదా  స్కాం లంటూ ఎన్నో అంశాలు  బయటపెట్ట డానికి అవకాశం దొరికిందన్నారు. నోట్ల రద్దు చిరస్థాయిగా నిలిచే వైఫల్యమని, వ్యవస్థీకృత దోపిడీ అని మన్మోహన్ సింగ్ అభివర్ణించారన్నారు. దీనివల్ల 2 శాతం జిడిపి పడిపోతుందని మన్మోహన్ సింగ్ ఊహించి చెబితే 2.2 శాతం జిడిపి పడిపోయిందని తరువాత తేల్చారని, అంతటి గొప్ప ఆర్ధిక వేత్త, అజాతశత్రువు  డా మన్మోహన్ సింగ్ అని ఉండవల్లి కీర్తించారు. 

 1990 దశకంలో  అవిభాజ్య రష్యా ఆర్థికంగా పతనమై నరమాంసం తినే దుస్థితిలో ఉండగా భారతదేశంలో ప్రజలకు నొప్పి తెలియకుండా ఆర్ధిక సంస్కరణలను ప్రవేశపెట్టి, దేశాన్ని ప్రగతిపథంలో పరుగులు పెట్టించిన గొప్ప ఉదార ఆర్థికవాది అని కితాబునిచ్చారు. ఎన్ని విమర్శలు ఎదురైనా మన్మోహన్ ఆర్థిక సంస్కరణలను సమర్థవంతంగా అమలు చేశారని, ఆసమయంలో ఎప్పుడూ రాజీనామా పత్రాన్ని జేబులో పెట్టుకుని తిరేవారన్నారు. కాంగ్రెస్ బలహీనపడటం దేశానికి ప్రమాదకరమని ఉండవల్లి ఆందోళన వ్యక్తం చేశారు.

ఇక మన్మోహన్ తో తన వ్యక్తిగత అనుబంధాన్ని, జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ…అనంతపురం, విశాఖ పట్నం సభల్లో డా మన్మోహన్ ప్రసంగాలను అనువదించే అవకాశం రావడం, విశాఖ సభలో అయితే ప్రజలు చప్పట్లు కొట్టడం వంటి పరిణామాల నేపథ్యంలో తాను బాగా గుర్తుండిపోయానని, తనను పేరు పెట్టి పిలవడం తన అదృష్టమన్నారు. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో తాను ఎంపిగా ఉండటం తన అదృష్టంగా భావిస్తానన్నారు.  రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని ఒకసారి కల్సి  చెబితే, వెంటనే రాసి ఇమ్మని, రాజ్యసభలో ప్రస్తావించారని గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర విభజన వల్ల హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటుందని మన్మోహన్ సింగ్ హెచ్చరించారన్నారు.  ఉచిత విద్యుత్ పథకాన్ని 1998-99లో అమలు చేసే విషయమై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కలిసి ఆయనను కలిశానని, అప్పుడు పంజాబ్ లో ఈపథకం విఫలమైందని చెప్పారన్నారు. అమెరికాతో అణు ఒప్పందాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్న సమయంలో తాను రూపొందించిన కరపత్రాన్ని చదవి, పత్రికల్లో వచ్చేలా చూడాలని సలహా ఇచ్చారని ఉండవల్లి గుర్తు చేసుకున్నారు.

గురువుకు అవమానం…శిష్యుడికి రాజపూజ్యం

దేశానికి ఎంతో సేవ చేసిన మన్మోహన్ సింగ్ కు తగిన గౌరవం దక్కాలని ప్రజలంతా కోరుకుంటారు. కానీ ఆయనను రాజకీయాల్లోకి తెచ్చి, ఆర్థిక మంత్రిని చేసి, ప్రధాన మంత్రి పదవి పీఠాన్ని ఎక్కేందుకు దోహదపడిన ఆయన గురువు, తెలుగువారైన దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు మరణం తరువాత తగిన గౌరవం దక్కలేదన్నదే తెలుగువారి బాధ. పివి మరణాంతరం డిల్లీలో అంత్యక్రియలు నిర్వహించేందుకు, కనీసం ఎఐసిసి కార్యాలయంలో ఆయన భౌతికకాయాన్ని ఉంచేందుకు కూడా నాటి కాంగ్రెస్ పెద్దలు అంగీకరించలేదన్న విషయం మన్మోహన్ మరణం సందర్భంగా తెలుగువారు గుర్తు చేసుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ కార్యకర్తల సందర్శనార్థం మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని ఎఐసిసి కార్యాలయంలో ఉంచడంతో పాటు, డిల్లీలో ఆయనకు స్మారకాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడం ఆపార్టీ నాయకుల ద్వంద్వ వైఖరిని తేటతెల్లం చేస్తోంది. పివికి భారతరత్న కూడా ఎన్ డిఏ ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం. ఈవిషయాన్ని తెలుగువారంతా గుర్తుంచుకుంటారు.

 

Leave a Reply