పార్టీ ఒకటే…సమస్యా ఒకటే…కానీ వర్గాలే వేరు!

పెంచిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా ఇటీవల వైఎస్సార్సీపి శ్రేణులు పోరుబాట పేరిట నిరసన కార్యక్రమాలను నిర్వహించాయి. రాజమహేంద్రవరంలో నిర్వహించిన పోరుబాట మాత్రం  చర్చనీయాంశంగా మారింది. అధికారం కోల్పోయినా…

 పార్టీ ఒకటే…సమస్యా ఒకటే…కానీ వర్గాలే వేరు!

పెంచిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా ఇటీవల వైఎస్సార్సీపి శ్రేణులు పోరుబాట పేరిట నిరసన కార్యక్రమాలను నిర్వహించాయి. రాజమహేంద్రవరంలో నిర్వహించిన పోరుబాట మాత్రం  చర్చనీయాంశంగా మారింది. అధికారం కోల్పోయినా మేము వేరుబాట విడవం అన్నట్లు పార్టీ శ్రేణులు, నాయకులు వ్యవహరించారు.  వైసిపి నగర ఇన్ చార్జి, మాజీ ఎంపి మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో ట్రాన్స్ కో ఎస్ ఇ కార్యాలయం వద్ద, నగర మాజీ అధ్యక్షుడు, నందెపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నగరంలోని వై జంక్షన్ సమీపంలోని డి-5 సెక్షన్ కార్యాలయం వద్ద పోరుమాటను నిర్వహించారు. మరోవైపు మాజీ మంత్రి, వైసిపి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాల్ ఆధ్వర్యంలో కోటిపల్లి బస్టాండ్ నుంచి ఎస్ ఇ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి, ఆందోళన చేశారు. భరత్, చెల్లుబోయిన వేణు నిర్వహించిన కార్యక్రమాలు పైకి ఒకే కార్యక్రమంగా కనిపించినా…వేరువేరుగా జరిగాయి.

పోరుబాట కార్యక్రమం జరిగిన సాయంత్రం ఒక వర్గానికి నాయకత్వం వహించిన వైసిపి నగర మాజీ అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్ కనిపించి, ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. తాము వేరుగా నిర్వహించిన నిరసన కార్యక్రమం విజయవంతమైందని, నగర ఇన్ చార్జి, మాజీ ఎంపి మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కన్నా తమ కార్యక్రమానికి ఎక్కువ మంది నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారని సంతోషంగా చెప్పుకొచ్చారు. నందెపు శ్రీనివాస్ వర్గం నిర్వహించిన కార్యక్రమంలో భరత్ కు బద్ధశత్రువైన రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వర్గీయులు ఎక్కువగా కనిపించారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, రాజమహేంద్రవరం పార్లమెంటు ఇన్ చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అటూ, ఇటూ వెళ్లి హాజరు వేయించుకున్నారు. గత ఎన్నికల్లో రూరల్ నుంచి పోటీ చేసిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ  మొదటి నుంచీ రాజా వర్గంతోనే సన్నిహితంగా ఉంటున్నారు. రూరల్ లో కార్యక్రమం చేయాలి కాబట్టి కోటిపల్లి బస్టాండ్ నుంచి ఆయన కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. లేకపోతే ఆయన కూడా అటు రాజాతోనో…నందెపు శ్రీనివాస్ చేపట్టిన కార్యక్రమంలోనో పాల్గొనేవారేమో…

ఒక పార్టీ పిలుపు మేరకు ఒక సమస్యపై ఒకే పార్టీలోని రెండు వర్గాలు వేరువేరుగా కార్యక్రమాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై భరత్ వర్గానికి చెందిన నాయకులను ప్రశ్నించగా, పార్టీలో వ్యక్తిపూజ ఎక్కువైపోయిందని పరోక్షంగా జక్కంపూడి కుటుంబాన్ని ఉద్దేశించి చెప్పుకొచ్చారు. నందెపు శ్రీనివాస్ కార్యక్రమం వెనుక జక్కంపూడి కుటుంబం హస్తం ఉందని ఆరోపించారు. మరోవైపు ఇదే విషయాన్ని జక్కంపూడి వర్గానికి చెందిన నాయకుడి వద్ద ప్రస్తావించగా ఎంపిగా భరత్ తమకు ఏమీ చేయలేదని, ఏనాడూ పార్టీ కార్యకర్తలను పట్టించుకోలేదని,  బయటి వ్యక్తులకు పదవులు కట్టబెట్టారని దుయ్యబట్టారు. ఆయన వెనుక కార్యకర్తలు ఎలా ఉంటారని ఎదురు ప్రశ్నించారు. సమస్యలపై ఏ సమయంలో ఫోన్ చేసినా రాజా సానుకూలంగా స్పందిస్తారని, అలాంటప్పుడు ఆయన వెంట ఉంటే తప్పేమిటని ఎదురు ప్రశ్నించారు.

ఏతావాతే తేలేది ఏమిటంటే రాజమహేంద్రవరం వైసిపిలో భరత్-రాజా వర్గాలు  రైలు పట్టాల లాంటి వారని. వారెప్పుడూ కలవరన్నది స్పష్టమవుతోంది. రైలు పట్టాలు కలిస్తే (తెలుగుదేశం) రైలుకు ప్రమాదం ఏర్పడవచ్చని ఆందోళన చెందుతున్నారేమో…

Leave a Reply