- November 21, 2024
సకల దేవతా స్వరూపుడు సత్య సాయి బాబా(నవంబర్ 23న జయంతి)
ఆరోపణలు…వివాదాలు ఎన్నున్నా..సత్యసాయిబాబాను గొప్ప మానవతావాది అనడంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు ఉండవు. అందరిలోనూ దేవుడు ఉన్నాడని, మానవసేవే మాధవ సేవ అని బోధించి, ఆచరణాత్మకంగా చూపించిన సత్యసాయిబాబాను…
ఆరోపణలు…వివాదాలు ఎన్నున్నా..సత్యసాయిబాబాను గొప్ప మానవతావాది అనడంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు ఉండవు. అందరిలోనూ దేవుడు ఉన్నాడని, మానవసేవే మాధవ సేవ అని బోధించి, ఆచరణాత్మకంగా చూపించిన సత్యసాయిబాబాను షిరిడీ సాయిబా అవతారంగా భక్తులు విశ్వసిస్తారు. సత్యము, ధర్మము, అహింస, ప్రేమ, శాంతి ఆయన బోధనలోని ప్రధానాంశాలు. తాను సకలదేవతా స్వరూపుడనని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాలలో 1200 వరకు సత్యసాయి కేంద్రాలున్నాయి.
బాబా అసలు పేరు సత్యనారాయణ రాజు. 1926 నవంబరు 23న పెద్ద వెంకప్ప రాజు, ఈశ్వరమ్మ దంపతులకి, ఓ నిరుపేద వ్యవసాయ కుటుంబం లో, అనంతపురం జిల్లా లోని, పుట్టపర్తి అనే కుగ్రామంలో జన్మించారు. నాడు కుగ్రామంగా ఉన్న పుట్టపర్తి బాబా మహిమతో నేడు ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చెందింది. సత్యనారాయణ వ్రతం తరువాత పుట్టడంతో ఆయనకు సత్యసాయిగా నామకరణం చేశారు. ఆయన పుట్టిన సందర్భంలో ఇంట్లో సంగీత వాద్యాలు వాటంతట అవే మోగాయి అని చెప్పుకుంటారు. సత్యసాయి పుట్టిన తరువాత తల్లి పక్కలో ఒక నాగుపాము దర్శనమిచ్చిందని చెబుతారు. అందుకే కొందరు భక్తులు సాయిబాబాను నాగరాజుగా భావిస్తారు. సత్య సాయిబాబాకు ఇద్దరు అక్కలు, ఒక అన్న, ఒక తమ్ముడు ఉన్నారు.
పుట్టపర్తి పక్కనే ఉన్న బుక్కపట్నం గ్రామంలో సాయిబాబా ప్రాథమిక విద్య సాగింది.[14] చిన్న వయసులోనే ఆయన నాటకాలు, సంగీతం, కవిత్వం, నటన వంటి కళలలో ప్రావీణ్యత కనబరచారు. తరువాత ఉరవకొండ ఉన్నత పాఠశాలలో చదివారు. బాబాలో మార్చి 8, 1940 న కొంత విచిత్రమైన ప్రవర్తన కనిపించింది. ఈ సంఘటన తరువాత ఆయన ప్రవర్తనలో మార్పులు కనిపించాయి. సమాధి స్థితిలో ఉన్నట్లుగా ఉండేవారు. పురాణ శ్లోకాలు చెప్పేవారు. భోజనం సరిగా చేసేవారు కాదు. 1940లో తాను షిరిడీ సాయిబాబా అవతారమని, తన పేరును సత్యసాయిబాబాగా ప్రకటించుకున్నారు. ఒక కథనం ప్రకారం 1940 అక్టోబరు 20లో, బాబా 14 ఏళ్ల వయస్సులో పుస్తకాలు వదిలేసి, “నా భక్తులు నన్ను పిలుస్తున్నారు. నా పని నాకున్నది” అని చెప్పేవారట. తరువాత మూడేళ్ల పాటు ఎక్కువ సమయం దగ్గరలోని ఒక తోటలో చెట్టు క్రింద గడిపేవారు. అప్పుడే ఆయన చుట్టూ ప్రజలు గుమికూడడం మొదలయ్యింది. 1944లో భక్తులు ఆయన పేరిట ఒక గుడిని కట్టారు. ప్రస్తుతం దానిని “పాత మందిరం” అంటారు. ప్రస్తుతం ఆశ్రమమైన ప్రశాంతి నిలయం నిర్మాణం 1948లో మొదలయ్యింది.1963లో తన ప్రవచనంలో తాను శివుడు, శక్తి ల అవతారమని బాబా వెల్లడించారు. అదే ప్రవచనంలో తాను షిరిడీ సాయిబాబా అవతారమనీ, భవిష్యత్తులో ప్రేమ సాయిబాబాగా అవతరిస్తాననీ చెప్పారు. ఇదే విషయాన్ని 1976లో పునరుద్ఘాటించారు. 2003లో జరిగిన ఒక ప్రమాదంలో సత్యసాయిబాబా తుంటి ఎముకకు గాయమయ్యింది. 2005 నాటి నుంచి ఆయన చక్రాల కుర్చీకి పరిమితమయ్యారు. సాయిబాబాకు ‘గీత’ అనే పెంపుడు ఏనుగు ఉండేది. గున్నయేనుగుగా అతనికి బహూకరింపబడిన ఆ ఏనుగు ప్రశాంతి నిలయం ఉత్సవాలలో తరచు వాడేవారు. 2007 మే 22లో ఆ ఏనుగు చనిపోయింది. ‘సత్యగీత’ అనే మరో ఏనుగును తెచ్చారు.
సత్యసాయిబాబా తన జన్మ స్థలమైన పుట్టపర్తి అభివృద్ధికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో దోహదం చేశారు. ఆయన చొరవతోనే ఇక్కడ ఒక విశ్వవిద్యాలయం, చైతన్యజ్యోతి అనే ఒక పెద్ద మత ప్రదర్శనశాల, ఒక ఆధ్యాత్మిక మ్యూజియమ్, ఒక కొండ అంచు క్రీడాంగణం, విమానాశ్రయం, ఇండోర్ క్రీడాంగణం వంటి సదుపాయాలు ఏర్పడ్డాయి. పుట్టపర్తి ఆశ్రమానికి దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి, దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం, మాజీ స్పీకర్లు నజ్మాహెప్తుల్లా, శివరాజ్ పాటిల్, సూపర్ స్టార్ అమితాబచ్చన్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ వంటి ప్రముఖులు అతిధులుగా వచ్చేవారు. ఇప్పటికీ గవాస్కర్, తెందూల్కర్ లు తరుచూ పుట్టపర్తిని సందర్శిస్తారు. సత్యసాయిబాబా 80వ జన్మదినోత్సవానికి ప్రపంచం నలుమూలలనుండి 10లక్షలమంది సందర్శకులు వచ్చారని అంచనా. ఇందులో భారతదేశం, 180 ఇతర దేశాలనుండి 13,000 మంది ప్రతినిధులు ఉన్నారు. దర్శనం సమయంలో బాబా సందర్శకుల, భక్తుల మధ్య నడుస్తూ వారిచ్చే నమస్కారాలను, వినతి పత్రాలను స్వీకరించేవారు. విభూతిని ‘సృష్టించి’ పంచేవారు. కొందరిని ప్రత్యేక దర్శనానికి, మాట్లాడడానికి అనుమతించేవారు. ఏకాంతంగా బాబాతో మాట్లాడి ఆయనకు తమ మనసులోని మాటను విన్నవించుకోవడం భక్తులకు ఎంతో ఉత్తేజాన్ని, ఊరటను కలిగించేది. అయితే తన దర్శనం ఆధ్యాత్మిక ప్రయోజనాలను ప్రసాదిస్తుందని మాత్రమే బాబా చెప్పేవారు.
సంవత్సరంలో అధికభాగం బాబా నివాసం ప్రశాంతి నిలయంలోనే ఉండేది. వేసవికాలం కొన్నిరోజులు బెంగళూరు లోని “బృందావనం” ఆశ్రమంలో గడిపేవారు. ఎప్పుడైనా కొడైకెనాల్ లోని “సాయి శృతి ఆశ్రమం”కి వెళ్లేవారు. ముంబై లో “ధర్మక్షేత్రం” లేదా “సత్యం”, హైదరాబాదు లోని “శివం”, చెన్నై లోని “సుందరం” అనే ఆశ్రమాలను స్థాపించారు.సత్య సాయి బాబా ట్రస్టు అధ్వర్యంలో, సత్యసాయి సేవా సంస్థల అధ్వర్యంలో పలు విద్యా, సేవా, దాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.పేదలకు ఉచిత విద్య కోసం ప్రశాంతి నిలయంలోని నేక్ గ్రేడింగ్ పొందిన శ్రీ సత్య సాయి యూనివర్సిటీ , ఒక సంగీత విద్యాలయం, అనంతపురంలో ఒక (మహిళా) ఉన్నత విద్యాలయం నిర్వహించబడుతున్నాయి. ఉచిత వైద్యం కోసం పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ 220 పడకలు గల ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సకల హంగులతో బెంగళూరులోని శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 333 పడకల ఆసుపత్రి, అలాగే బెంగళూరు వైట్ ఫీల్డ్ లోని సత్యసాయి జనరల్ ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. అనావృష్టి ప్రాంతమైన అనంతపురం జిల్లాలో అనేక మంచినీటి ప్రాజెక్టుల ద్వారా లక్షలాది ప్రజలకు త్రాగునీరు అందిస్తున్నారు. చెన్నై నగరానికి కూడా సత్యసాయి సంస్థల అధ్వర్యంలో రూ. 200కోట్ల రూపాయల పైగా ఖర్చుతొ తాగునీటిని సరఫరా చేస్తున్నారు. గోదావరి నీటిని ఉభయ గోదావరి జిల్లాల్లోని ప్రజలకు అందిస్తున్నారు. తెలంగాణాలోని మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలలోనూ, మహారాష్ట్ర లోని లాతూర్ జిల్లాలోను భారీ ప్రాజెక్టులను సత్యసాయి సేవా సంస్థ నిర్మించింది.
2011లో మార్చిలో బాబా శ్వాసకోశ, మూత్రపిండాల, ఛాతీ సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. దాదాపు నెల రోజులు అయినా ఆయన ఆరోగ్యం మెరుగవ లేదు. ఏప్రిల్ 24వ తేదీన ఉదయం 7:40 కి తుది శ్వాస విడిచారు. బాబా పార్థివ దేహానికి వేద మంత్రోచ్ఛరణల మధ్య ఏప్రిల్ 27 వ తేదీన బుధవారం ఉదయం మహా సమాధి జరిగింది. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని కుల్వంత్ హాలు లోనే అన్ని కార్యక్రమాలూ శాస్త్రోక్తంగా జరిగాయి. సత్యసాయిబాబా నిర్యాణం చెందినా…2011 జూలై 15 నుంచి భక్తులు సత్యసాయి బాబా మహాసమాధి దర్శనం ప్రారంభించారు.@@@