గోదావరితీరంలో ఆధ్యాత్మిక సంరంభం…కార్తిక లక్ష దీపోత్సవం

పురాణాల ప్రకారం కార్తికమాసం పరమశివునికి ప్రీతిపాత్రమైనది. అందులోనూ సోమవారం శివునికి ఇష్టమైన రోజు. దక్షిణ కాశీగా పేరొందిన గోదావరితీరంలోని చారిత్రాత్మక కోటిలింగాలరేవు వద్ద దాదాపు 11 ఏళ్ల…

 గోదావరితీరంలో ఆధ్యాత్మిక సంరంభం…కార్తిక లక్ష దీపోత్సవం

పురాణాల ప్రకారం కార్తికమాసం పరమశివునికి ప్రీతిపాత్రమైనది. అందులోనూ సోమవారం శివునికి ఇష్టమైన రోజు. దక్షిణ కాశీగా పేరొందిన గోదావరితీరంలోని చారిత్రాత్మక కోటిలింగాలరేవు వద్ద దాదాపు 11 ఏళ్ల క్రితం పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ పంతం కొండలరావు రాజకీయాలకు అతీతంగా లక్ష దీపోత్సవానికి శ్రీకారం చుట్టి ఆధ్యాత్మిక సంరంభానికి నాంది పలికారు. కరోనా సమయంలో కూడా అంతరాయం లేకుండా నిరాటంకంగా సాగుతున్న దీపోత్సవం ప్రతీ ఏటా కార్తిక మాసంలో రాజమహేంద్రవరంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక కాంతులు వెదలజల్లుతోంది.  అత్యంత అధ్వాన్నంగా, నిత్యం గొడవలతో ఉండే కోటిలింగేశ్వరస్వామి వారు కొలువుండే కోటిలింగాలరేవు తీరంలో ఆధ్యాత్మిక, ధార్మిక భావన తేవాలన్న సత్సంకల్పంతో కొండలరావు లక్ష దీపోత్సవానికి అంకురార్పణ చేశారు. 2013 వరకు స్థానిక దేవస్థానం ఆధ్వర్యంలో పరిమిత పరిధిలో దీపోత్సవం జరిగేది. పందిరి మహదేవుడు కోటిలింగాల సత్రం చైర్మన్ హోదాలో దీపోత్సవానికి హారజైన కొండలరావు అక్కడి పరిస్థితులు గమనించి 2014 నుంచి పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో భారీ ఎత్తున లక్ష దీపోత్సవ బాధ్యతను నిర్వహిస్తూ, ఆప్రాంతంలోనే కాక జిల్లావ్యాప్తంగా  ఆధ్యాత్మిక శోభను తెచ్చారు. ఈకార్యక్రమానికి రాజకీయాలకు, హోదాలకు అతీతంగా వేలాది మంది సామాన్య భక్తులతో పాటు ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీల నేతలు, అధికారులు హాజరవుతున్నారు.

తొలుత చింతాలమ్మ ఘాట్ లో అలంకరించిన పంటులపై  లక్ష దీపోత్సవాన్ని నిర్వహించేవారు. అయితే అక్కడ గోదావరిలో నీరు లేకపోవడం, ఇతరత్రా కారణాల వల్ల 2019 నుంచి వేదికను కోటిలింగాల ఘాట్ కు మార్చారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో జరిగే ఈమహత్కార్యం ఆధ్యాత్మికంగానే కాక పర్యాటకంగా కూడా ఆకట్టుకునేలా సాగుతోంది. దీపోత్సవం సందర్భంగా గోదావరితీర ప్రాంతాన్ని, పంటును విద్యుదీపాలతో అలంకరించడంతో పాటు, ఎల్ఇడి స్క్రీన్ల ఏర్పాటు,  నృత్యప్రదర్శనలు, భజనలు, మిరుమిట్లుగొలిపే బాణాసంచా పేలుళ్లు, కాగడాల ప్రదర్శన, మహా హారతులు  వంటి ఆకర్షణీయ ప్రదర్శనలు భక్తులతో పాటు, సందర్శకులను కూడా ఆకట్టుకుంటాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, పర్యాటక కార్యక్రమంగా సాగే దీపోత్సవానికి ట్రస్టు ఏటా సుమారు 15లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తుండటం విశేషం. అందుకే విశేష ఆదరణతో ఈకార్యక్రమంలో పాల్గొనే వారి సంఖ్య  వందల నుంచి వేల సంఖ్యకు చేరుకుంది. ప్రతీ ఏటా గోదావరితీరంలోని కోటిలింగాలరేవు నుంచి చింతాలమ్మ ఘాట్ వరకు మెట్లు వేలాది దీపకాంతులతో ఆధ్యాత్మిక వెలుగులు విరజిమ్ముతాయి.

18న లక్ష దీపోత్సవం

పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్టు, శ్రీ ఉమాకోటిలింగేవ్వరస్వామి దేవస్థానం సంయుక్త ఆద్వర్యంలో ఈఏడాది నవంబర్ 18న సోమవారం సాయంత్రం 5.30గంటలకు లక్ష దీపోత్సవం జరుగుతుంది. దీపోత్సవానికి నగరపాలక సంస్థ, పోలీసు, దేవాదాయశాఖ, ఇరిగేషన్, విద్యుత్ శాఖల సమన్వయంతో  విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తజనులంతా తరలివచ్చి మహదేవునికి దీప నివేదన చేసి, స్వామివారికి కృపకు పాత్రులు కావాలని ట్రస్టు చైర్మన్ పంతం కొండలరావు విజ్ఞప్తి చేశారు. దీపోత్సవానికి హాజరయ్యే భక్తులకు ప్రమిదలు, దీపపు ఒత్తులు, నూనె ట్రస్టు ఉచితంగా సరఫరా చేస్తుంది. అయితే ఆచమనం కోసం భక్తులు మంచినీటి సీసాను వెంట తెచ్చుకోవాలని, ప్రమాదాల నివారణలో భాగంగా సాంప్రదాయ కాటన్ దుస్తులు ధరించి రావాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సమాజహితానికి పంతం పట్టిన కొండలరావు

తన ఉన్నతికి సమాజం ఎంతో ఇచ్చిందని, ప్రతిగా నిస్వార్థంగా సమాజానికి ఎంతోకొంత సాయం చేయాలన్న చిరు ఆశయంతోనే పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్టును స్థాపించి సామాజిక, ఆధ్యాత్మిక సేవ, పర్యావరణహిత కార్యక్రమాలు చేపడతున్నట్లు కొండలరావు వెల్లడించారు. జంతు ప్రేమికుడైన కొండలరావు సామాజిక సేవలను ఎంత బాధ్యతగా నిర్వహిస్తారో అంతే ప్రేమగా మూగజీవాల సంరక్షణకు నడుంబిగించారు. ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతీ ఏటా జనవరిలో సంక్రాంతితో ప్రారంభించి, డిసెంబర్ లో నిర్వహించే క్రిస్మస్ వేడుకల వరకు వివిధ ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలు జరుగుతాయి. సంక్రాంతిని ఎంత ఘనంగా నిర్వహిస్తారో అంతే ఘనంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించడం విశేషం. మే నెల నడివేసవిలో పక్షులు, జంతువులకు మంచినీరు అందించేందుకు ఏటా 500 కుండీలను ఏర్పాటు చేస్తారు. జూన్ లో పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ లు అందజేస్తారు. ఇప్పటి వరకు సుమారు 600 మందికి పైగా విద్యార్థులు ట్రస్టు ద్వారా లబ్ది పొంది, ఉన్నత విద్యను సాకారం చేసుకున్నారు. జూలైలో నట సార్వభౌమ ఎస్వీ రంగారావు జయంతిని ఘనంగా నిర్వహించి పేదలకు వస్త్రాలు పంపిణీ చేస్తారు. సంక్రాంతి, క్రిస్మస్ కూడా వస్త్రాలు పంపిణీ చేస్తారు. ఇలా ఏటా సుమారు 500 మందికి వస్త్రాలు పంపిణీ చేస్తారు. నవంబర్ లో లక్ష దీపోత్సవాన్ని, డిసెంబర్ లో క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తారు. సామాజిక సేవలకు తోడు జంతు సంరక్షణలో భాగంగా కొండలరావు 30కి పైగా గోవులతో సొంతంగా గోశాలను నిర్వహిస్తున్నారు. గోవులతో పాటు వందలాది పక్షులు, కుక్కలకు ప్రతీ రోజూ స్వయంగా ఆహారాన్ని అందిస్తారు. పర్యావరణ ప్రేమికుడైన కొండలరావు మొక్కల నాటడంతో పాటు, పర్యావరణపరిరక్షణపై విద్యార్థులు, ప్రజల్లో అవగాహనకు కృషిచేస్తున్నారు. కరోనా సమయంలో దేశమంతా భయంతో ఇళ్లకు పరిమితమైన వేళ కొండలరావు మిత్రబృందం సామాజిక, జంతు సేవలతో తరించింది. కరోనా కాలంలో ప్రతీరోజూ పేదలకు కూరగాయలు, భోజన పొట్లాలు పంపిణీ చేశారు. మనుషులే కష్టకాలంలో ఉంటే జంతువులను ఎవరు పట్టించుకుంటారన్న ఉద్దేశంతో వీధుల్లోని కుక్కలు, ఆవులు, ఇతర జంతువులకు  కూడా ప్రతీ రోజూ  ఆహారాన్ని అందించి సేవాభావాన్ని చాటుకున్నారు. తన పిలుపే ఆజ్ఞగా భావించి ఈసేవాయజ్ఞంలో  పాలుపంచుకునే సన్నిహితులు, మిత్రులు, అనుచరులు దొరకడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు కొండలరావు చెప్పారు. సేవల విషయంలో తనను కాకుండా తమ ఉన్నతికి దోహదం చేసిన సమాజానికి తన వంతు సాయం చేయాలన్న తన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని కొండలరావు వినమ్రంగా పిలుపునిస్తున్నారు.

Leave a Reply