- November 15, 2024
మోసాల ముఖ్యమంత్రి…అబద్దాల చక్రవర్తి….ముద్రగడ పద్మనాభరెడ్డి గారి లేఖాస్త్రం
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పిఠాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్ ను ఓడిస్తానని, లేకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని శపథం పట్టి, ఎన్నికల్లో పవన్ గెలిచి, డిప్యుటీ…
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పిఠాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్ ను ఓడిస్తానని, లేకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని శపథం పట్టి, ఎన్నికల్లో పవన్ గెలిచి, డిప్యుటీ సిఎంగా కూడా పదవి చేపట్టడంతో తన పేరును మార్చుకున్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పద్మనాభరెడ్డి పేరుతోనే కొనసాగుతుండటం విశేషం. తెలుగుదేశం, జనసేన పార్టీలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును మోసాల ముఖ్యమంత్రి, అబద్దాల చక్రవర్తి అంటూ తాజాగా పద్మనాభరెడ్డి పేరుతో లేఖాస్త్రం సంధించారు. లేఖలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే…
“ ముఖ్యమంత్రి అధికార దాహం తీర్చుకోవడం కోసం దొంగ సూపర్-6 హామీల తుఫాను సృష్టించి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులు ఎత్తేయడం మీ లాంటి సీనియర్ రాజకీయ వేత్తకు తగునా? మీరు అధికారంలోకి వచ్చిన తరువాత మీ దొంగ సూపర్-6 హామీలు గురించి తలచుకుంటే భయమేస్తోందని సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటి. వీటిని అమలు చేయాలంటే కోట్లాది రూపాయలు నిధులు కావాలన్న సంగతి మీకు తెలియదా? తెలిసి అబద్దాలు చెప్పి ఎందుకు ఓట్లు వేయించుకున్నారు.
మీరిచ్చిన అబద్దాల హామీలు అమలు అయితే పేద ప్రజల యొక్క జీవితాలు బాగా ఉంటాయని అందరూ అనుకున్నారే వారికి ఆ ఆనందం లేకుండా అవి గుర్తుకు రాకుండా ప్రజల దృష్టి మార్చడానికి మీరు ప్రక్క చూపులు తిరుపతి ప్రసాదం పైన, రెడ్ బుక్ పైన, ఆరాచకం పైన, తప్పుడు పోస్టింగులు పైన ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి హామీలు గుర్తుకు రాకుండా చేయడం మీకు వెన్నతో పెట్టిన విద్య బాబు గారు ఎప్పుడైనా తమరు రాజకీయ జీవితంలో నిజం మాట్లాడారా?
ఈ మద్య రోడ్లు వేయడానికి నిధులు లేవని పి.పి.పి (పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్షిప్) పద్ధతిలో రోడ్లు వేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు పత్రికలో చూసానండి. రోడ్లు మీద తిరగడానికి వాహన దారులు లక్షలాధి రూపాయలు ఎమ్.వి టాక్స్ రూపంలో కడుతున్నారు. మరలా మీరు, పి.పి.పి పద్ధతిలో తోలు తీసే టాక్స్ (టోల్ టాక్స్) కట్టించుకోవడం న్యాయమంటారా? బాబు గారు ఇదే పద్దతిలో మీ మంత్రి వర్గంలో సగం మంది రాజకీయ నాయకులను, మిగిలిన సగం ప్రముఖ వ్యాపారస్తులను చేర్చుకుని జిల్లాల అభివృద్ధి వారికి అప్పచెప్పి తోలు తీసే టాక్స్లు లేకుండా చేస్తే మంచిది. మరియు ముఖ్యమంత్రి పీఠం కూడా పి.పి.పి పద్ధతిలో చేస్తే మీ పేరు ప్రపంచ వ్యాప్తంగా చెప్పుకుంటారు.
అయ్య, విశాఖ స్టీల్ ప్లాంటు కోసం అప్పట్లో 70 మంది గౌరవ శాసన సభ్యులు రాజీనామా చేయడం, అమృతరావు గారు ఆమరణ నిరాహారదీక్ష చేయడంతో ప్రభుత్వం దిగివచ్చి ప్లాంటు ఇవ్వడం జరిగింది. అలాగే తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని తమ భూములు తక్కువ ధరకు ఇవ్వడం జరిగింది. అంత కష్టపడి సాధించుకున్న స్టీల్ ప్లాంటు ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం అడ్డుకోకపోవడం చాలా అన్యాయం. ఉద్యోగాల కోసం తపించే యువత కోసం ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం చేయకపోవడం చాలా అన్యాయం. సూపర్-6 హామీలు, స్టీల్ ప్లాంటు ప్రవేట్ పరం అవ్వకుండా కాపాడడం, ప్రత్యేక హోదా అమలుకు కృషి చేయండి గాని, అమాయకులను జైలులో పెట్టి కొట్టించడం మంచిది కాదు…కాదు.” అంటూ లేఖలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై విరుచుకుపడ్డారు.