ఇది నా ఆఖరి పోరాటం!….అప్పుడు కీలక నిర్ణయం తీసుకుంటా- గన్ని కృష్ణ

సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు, విజయనగరం ఆర్టీసీ జోన్ మాజీ చైర్మన్, గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ రాబోయే రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల్లో మేయర్…

 ఇది నా ఆఖరి పోరాటం!….అప్పుడు కీలక నిర్ణయం తీసుకుంటా- గన్ని కృష్ణ

సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు, విజయనగరం ఆర్టీసీ జోన్ మాజీ చైర్మన్, గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ రాబోయే రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల్లో మేయర్ బరిలో నిలిచేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నారు. అయితే టిడిపి, జనసేన, బిజెపి కూటమి సమీకరణలు, సామాజిక సమీకరణల్లో భాగంగా ఆయనకు మేయర్ సీటు దక్కుతుందా లేదా అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. చూసేవారికి ముక్కోపిగా, అహంకార భావంతో కనిపించే గన్ని కృష్ణను ఒకసారి పలకరిస్తే మనస్సు విప్పి మాట్లాడతారు. ఆయనకు రాజకీయ లౌక్యం తెలీదు. అందుకే ఆయన స్థాయికి తగిన రీతిలో ఎదగలేదన్నది అందరూ చెప్పేమాట. గన్ని కృష్ణ “దివాకరమ్ న్యూస్” తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈసందర్భంగా అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
రాజకీయ సమీకరణలో భాగంగా రాజమహేంద్రవరం మేయర్ సీటును జనసేన నాయకురాలు, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతికి కేటాయించే అవకాశాలున్నాయన్న ప్రచారంపై స్పందిస్తూ… “ నాకు ఇదే చివరి అవకాశం మళ్లీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను. అందుకే ప్రత్యక్ష ఎన్నికల ద్వారా మేయర్ గా పోటీ చేయాలని ఆశిస్తున్నాను. ఈవిషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో సహా పార్టీలో చెప్పాల్సిన వారందరికీ ఇప్పటికే చెప్పేశాను. నామినేటెడ్ పదవులు వద్దని స్పష్టం చేశాను. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నాను. ఇప్పటికీ అవకాశం ఇవ్వకపోతే ఎలా. కూటమి సమీకరణలో భాగంగా మేయర్ గా పోటీ చేసే అవకాశం రాకపోతే కీలక నిర్ణయం తీసుకుంటాను. అది ఎంత తీవ్రమైనదే అప్పుడే ప్రకటిస్తాను. అవసరమైతే రాజకీయాలకు స్వస్తి పలుకుతాను గానీ ఏ పార్టీలోనూ చేరను.
రాజమహేంద్రవరం రూరల్, సిటీ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆదిరెడ్డి వాసుతో పాటు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావును కూడా కలిసి మేయర్ గా పోటీ చేయాలని భావిస్తున్నట్లు చెప్పాను. నామినేటెడ్ పదవులు వద్దని స్పష్టం చేశాను. మేయర్ గా నేను బరిలో ఉన్నట్లు వారు బహిరంగంగా ఎందుకు చెప్పలేకపోతున్నారో వారినే అడగాలి. నా అభ్యర్థిత్వం గురించి ప్రజలను, పార్టీ కార్యకర్తలను అడిగినా చెబుతారు. నాకు ఎవరితోనూ విభేదాలు లేవు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి అంటే గౌరవం కొద్దీ గుడా చైర్మన్ పదవి స్వీకరించే ముందుకు ఆయనకు పాదాభివందనం చేశాను. నా మనస్సులో ఎవరి మీద ఎలాంటి ద్వేషం, కక్ష లేదు. రాజమహేంద్రవరం కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు పురపాలకశాఖ మంత్రి పి నారాయణ సిద్ధంగానే ఉన్నారు. అయితే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పరిసర గ్రామాలను కలిపి ఎన్నికలు జరిపించాలని కోరుతున్నారు. కోర్టు కేసుల బెడద లేకుండా ఎన్నికలు జరిపాక విలీనం చేద్దామని నారాయణ సూచిస్తున్నారు ”

సశేషం….త్వరలో తరువాయి భాగం

Leave a Reply