ఇసుక..మద్యం అక్రమాలపై నో కామెంట్….ఎంతో మంది వెన్నుపోట్లు పొడిచారు!

పైకి గంభీరంగా కనిపించే టిడిపి సీనియర్ నాయకుడు గన్ని కృష్ణతో మాట కలిపితే మాత్రం కల్లాకపటం లేకుండా నిర్మలంగా, నిర్మొహమాటంగా మాట్లాడతారు. ఆయనతో ముఖాముఖి తరువాయి భాగం…

 ఇసుక..మద్యం అక్రమాలపై నో కామెంట్….ఎంతో మంది వెన్నుపోట్లు పొడిచారు!

పైకి గంభీరంగా కనిపించే టిడిపి సీనియర్ నాయకుడు గన్ని కృష్ణతో మాట కలిపితే మాత్రం కల్లాకపటం లేకుండా నిర్మలంగా, నిర్మొహమాటంగా మాట్లాడతారు. ఆయనతో ముఖాముఖి తరువాయి భాగం చదవండి.

కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ఇసుక, మద్యం అక్రమాలపై నో కామెంట్. ఈవిషయంలో నేను స్పందించదలుచుకోలేదు. రాజమహేంద్రవరం ప్రజలందరికీ ఏమి జరుగుతోందో తెలుసు. అయితే జిల్లా కలెక్టర్ గారు మాత్రం ఎంతో నిజాయితీగా పనిచేస్తున్నారు. ఆమెను బదిలీ చేయించే ప్రయత్నాల్లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఎంతో ఇష్టంతో కోట్లాది రూపాయల వ్యాపారాన్ని వదిలేసి, రాజకీయాల్లోకి వచ్చాను. మాతండ్రి గన్ని సత్యనారాయణమూర్తి గారికి విశాఖపట్నం స్టీల్ ప్లాంటుకు సంబంధించి కన్ సైన్ మెంట్ కంపెనీలో భాగస్వామ్యం ఉండేది. విద్యాభ్యాసం తరువాత ఆవ్యాపారం చూసుకునేందుకు విశాఖపట్నం వెళ్లి, రాజకీయాలపై ఇష్టంతో తిరిగి రాజమహేంద్రవరం వచ్చాను. రాజకీయాల్లోకి రాకపోతే వ్యాపారవేత్తగా ఎదిగేవాడిని. టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుపై అభిమానంతో తెలుగుదేశం పార్టీలో చేరాను. పార్టీ అధినేత చంద్రబాబునాయుడే నాకు గాడ్ ఫాదర్. పార్టీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు, జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చినరాజప్పలను గురువులుగా భావిస్తాను. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను. నా పెద్ద కుమార్తె వివాహ సమయంలో దివంగత మాజీ లోక్ సభ స్పీకర్ జిఎంసి బాలయోగి రాజీనామా చేయడంతో ముమ్మడివరంనకు ఉప ఎన్నికలు వచ్చాయి. జూన్ 6న పెళ్లైతే జూన్ 3వ తేదీ వరకు నేను ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత పిల్లలు ఆలనాపాలనా, చదువులు కూడా సరిగా పట్టించుకోలేకపోయాను. అయినా నాకు రావాల్సినంత గుర్తింపు, పదవులు రాకపోవడం బాధ కలిగిస్తుంటుంది. తెలుగుదేశం పార్టీయే నా బలం, బలహీనత. అందుకే పార్టీని వీడే ఆలోచన చేయలేదు.

ఒక్కోసారి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా అనిపిస్తుంటుంది. నా రాజకీయ జీవితంలో వెన్నుపోట్లు, నమ్మక ద్రోహాలకు లెక్కలేదు. నమ్మిన నాయకులే నాకు ద్రోహం చేశారు. నా రాజకీయ ఎదుగుదల, పదవులు పొందలేకపోవడంలో గానీ స్థానిక నాయకులు పాత్ర ఏమీ లేదు.
కొత్తగా పార్టీలో చేర్చుకునే ముందు కూటమి నాయకులంతా ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరం ఉంది. విజయవాడ సమీపంలోని తాడిగడపను వైఎస్సార్ తాడిగడపగా మార్చిన పార్థసారధి టిడిపిలో చేరి మంత్రి పదవి పొంది, ఇప్పుడు కేబినెట్ సమావేశాలపై మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే వైస్సార్ పేరును తొలగించేందుకు తంటాలు పడుతున్నారు.
వారసత్వ రాజకీయాలపై నాకు నమ్మకం లేదు. నా పిల్లలు గానీ, మనవలు గానీ రాజకీయాల్లోకి రారు. నేను డబ్బు ఖర్చుపెట్టను అనే ప్రచారం తప్పు. పదవుల కోసం పెట్టుబడులు పెట్టి, వాటి ద్వారా సంపాదించుకోవాలన్న ఆలోచన నాకు లేదు. చేతగాదు కూడా. 2019 ఎంపి ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తే కోట్లు ఖర్చుపెట్టేందుకు సిద్ధమయ్యాను. కానీ నాకు సీటు ఇవ్వలేదు.
కక్ష సాధింపు ధోరణికి నేను వ్యతిరేకం. రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు గానీ..గత ప్రభుత్వ హయాంలో రెచ్చిపోయిన వారిపై కనీసం ఫిర్యాదులు కూడా తీసుకోలేదు. అందుకే ఇప్పుడు కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఎవరు తప్పులు చేశారో…రెచ్చిపోయారో వారందరిపైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వ హయాంలో నా ఇంటి ముందు ఉన్న వినాయకుడి గుడిలోని విగ్రహం విధ్వంసం కేసు వెనుక కక్ష ఉంది. ఈకేసులో నా పేరు చెప్పించేందుకు పోలీసులు బెదిరించి, ఎంతో ప్రయత్నించారు. గానీ సఫలం కాలేదు. అమాయకులైన మా కార్యకర్తలను, పూజారిని అరెస్టు చేసి, ఇబ్బందులకు గురిచేశారు. మా పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఇలాంటివి ఇష్టం ఉండదు. అయన ధ్యాసంతా అభివృద్ధిపైనే ఉంటుంది.
వైసిపి భవిష్యత్ గోడ మీద రాతల్లాగే ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం సాధిస్తారు.

Leave a Reply