తిట్టు…కొట్టు పదవులు పట్టు….ఆలోచింపజేసే టిడిపి నేత డొక్కా ఆవేదన!

రాష్ట్ర విభజనకు ముందు రాజకీయాలకు, నేటి రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉందని మాజీ మంత్రి, వైసిపి నుంచి టిడిపిలో చేరిన డొక్కా మాణిక్య వరప్రసాద్ వ్యాఖ్యానించారు. నేటి…

 తిట్టు…కొట్టు పదవులు పట్టు….ఆలోచింపజేసే టిడిపి నేత డొక్కా ఆవేదన!

రాష్ట్ర విభజనకు ముందు రాజకీయాలకు, నేటి రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉందని మాజీ మంత్రి, వైసిపి నుంచి టిడిపిలో చేరిన డొక్కా మాణిక్య వరప్రసాద్ వ్యాఖ్యానించారు. నేటి రాజకీయ పరిస్థితులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రచయిత, తెలంగాణా సిఎల్పీ ఉద్యోగి శ్రీపాద శ్రీనివాస్ విభిన్న అంశాల సమాహారంతో రచించిన అంతరంగం పుస్తకావిష్కరణ సభ రాజమహేంద్రవరంలోని ధర్మంచర బుక్ బ్యాంకులో జరిగింది. ఈకార్యక్రమంలో డొక్కా, తెలంగాణాలోని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ సిహెచ్ వంశీకృష్ణ, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, కంభం విజయరామిరెడ్డి, సిసిసి ఎండి పంతం కొండలరావు, డిసిసి అధ్యక్షుడు టికె విశ్వేశ్వరరెడ్డి, కాంగ్రెస్ నాయకుడు రామినీడి మురళి తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా డొక్కా నేటి రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాజకీయాలను 2014కు ముందు తరువాత అని విభజించవచ్చన్నారు. నాడు అధికారపక్షంలో ఉండి కూడా ప్రతిపక్షంలా ప్రశ్నించేవారమన్నారు. వివిధ అంశాలపై కూలంకుషంగా చర్చించి, కొత్త అంశాలను లేవనెత్తవేవారమన్నారు. 2014 తరువాత రెండు ప్రభుత్వాలను చూశానని, నేడు చర్చలు లేవని బూతులే ఉన్నాయన్నారు. గత వైసిపి ప్రభుత్వంలో ఒక లక్ష్యాన్ని విధించి, బూతులు మాట్లాడించేవారన్నారు. బూతులు మాట్లాడితేనే టిక్కెట్లు, పదవులు లభిస్తున్నాయన్నారు. నేడు
తిట్టు…కొట్టు పదవులు పట్టు పరిస్థితికి దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తిడితేనే ఎమ్మెల్యే టిక్కెట్లు, దుర్మార్గాలు చేస్తేనే అందలం లభిస్తోందన్నారు. రానున్న రోజులు ఇంకెంత భయంకరంగా ఉంటాయోనని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీపాద శ్రీనివాస్ తన రచనలో రాజకీయంగా మంచి సూచనలు చేశారని కితాబునిచ్చారు. రాజకీయాల్లో మంచి వాతావరణం రావాలని ఆకాంక్షించారు. మర్యాదస్తులైన గోదావరితీర వాసుల నుంచి రాజకీయాల్లో మార్పులపై మంచి ఆలోచనలు మొలకెత్తాలని డొక్కా ఆకాంక్షించారు. డొక్కా వ్యాఖ్యలపై మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందిస్తూ నేడు అన్ని రంగాల్లో విలువలు దిగజారుతున్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో అర్హులైన వ్యక్తులకు పదవులు రాకపోవడానికి ప్రజలే కారణమని విశ్లేషించారు. ఈసందర్భంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖామంత్రి కందుల దుర్గేష్ తనదైన శైలిలో స్పందించారు. వేదికపై ఉన్నవారిలో పదవిలో ఉన్న వ్యక్తిని తానేనని, రాజకీయాలు పాడైపోయాయి..మంచివాళ్లకు పదవులు రావడం లేదని చెబుతున్న సమయంలో తనకు మాట్లాడే అవకాశం ఇచ్చారని ఏం మాట్లాడాలో తెలియడం లేదన్నారు.

Leave a Reply