ఇప్పుడైనా…కాపుల కల నెరవేరేనా?!
చారిత్రాత్మక రాజమహేంద్రవరం నగరంలో కల్యాణ మండపాన్ని నిర్మించుకోవాలని కాపు సామాజిక వర్గీయుల చిరకాల వాంఛ. ఇది దశాబ్దాలు గడిచినా తీరనికోరికగానే మిగిలిపోయింది. కాకినాడ సహా జిల్లావ్యాప్తంగా పలు…

చారిత్రాత్మక రాజమహేంద్రవరం నగరంలో కల్యాణ మండపాన్ని నిర్మించుకోవాలని కాపు సామాజిక వర్గీయుల చిరకాల వాంఛ. ఇది దశాబ్దాలు గడిచినా తీరనికోరికగానే మిగిలిపోయింది. కాకినాడ సహా జిల్లావ్యాప్తంగా పలు పట్టణాలు, మండల కేంద్రాల్లో కూడా కాపు కల్యాణ మండపాలు ఉన్నాయి. రాజమహేంద్రవరంలోని ప్రముఖులుగా చెలామణి అవుతున్న కాపు సామాజిక వర్గం పెద్దలకు, ఆ సామాజిక వర్గీయులు ఎంతో మంది ఉన్నా కల్యాణ మండపం లేకపోవడం పెద్ద వెలితిగా కనిపిస్తోంది. పంతాలు, పట్టింపులు ఎక్కువగా ఉండే రాజమహేంద్రవరం కాపు సామాజికవర్గీయులకు ఒక విధంగా అవమానకరమే.
దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు కాలం నుంచీ….ఇంకా చెప్పాలంటే గత మూడు దశాబ్దాలుగా రాజమహేంద్రవరంలో కల్యాణ మండపం కల నెరవేరడం లేదు. ప్రతీ ఎన్నికల్లోనూ జనాభాపరంగా మెజార్టీగా ఉన్న కాపులను ఆకట్టుకునేందుకు ఇదో నినాదంగా కూడా పనికి వస్తోంది. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యేగా పనిచేసిన డాక్టర్ ఆకుల సత్యనారాయణ, కాపు కార్పొరేషన్ చైర్మన్ గా, రాజానగరం ఎమ్మెల్యేగా పనిచేసిన జక్కంపూడి రాజా కాపు కల్యాణ మండపం నిర్మాణానికి కృషిచేస్తామని హామీలు గుప్పించారు కానీ, హామీని ఆచరణలోకి తేలేకపోయారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ గా రాజా కల్యాణ మండపం నిర్మాణానికి తీవ్రంగా ప్రయత్నించారని, ఆచరణ సాధ్యం కాలేదని వైసిపి నాయకుడు నందెపు శ్రీనివాస్ చెప్పారు. రాజమహేంద్రవరంలో చక్రం తిప్పిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన గోరంట్ల బుచ్చయ్యచౌదరి, తమ సామాజిక వర్గానికి చెందిన వారికి గోదావరితీరాన రివర్ బే, ఎవి అప్పారావు రోడ్డులో ప్రియాంక గార్డెన్స్ ఎంపి మాగంటి మురళీమోహన్ సెంట్రల్ జైలు స్థలంలో మంజీరా హోటళ్లకు స్థలాలు కేటాయించేలా రాజకీయం చేశారని, కానీ తమ కల్యాణ మండపం నిర్మాణానికి చొరవ చూపించలేదని కాపు సామాజికవర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దాదాపు 30ఏళ్ల క్రితం జక్కంపూడి హయాంలో కాపు కల్యాణ మండపం సాకారం అయినట్టే అయి చేజారిపోయింది. నాడు కాపు కల్యాణ మండపానికి ఎస్వీ మార్కెట్ వద్ద దివంగత మాజీ మంత్రి, పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ చేతుల మీదుగా శంఖుస్థాపన చేసినట్లుగా చెబుతున్నారు. శంఖుస్థాపనైతే జరిగింది కానీ కల్యాణ మండపం నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా పడలేదు. కల్యాణ మండపానికి స్థలాన్ని విరాళంగా ఇస్తానన్న దాత యేరుకొండ శ్యామ్ సుందర్ స్థలాన్ని రిజిస్టర్ చేయలేదని చెబుతున్నారు.
ఇప్పుడు కాపు సామాజికవర్గం అభిమానించే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉండటంతో పాటు, ఉప ముఖ్యమంత్రిగా కీలక పదవిలో కొనసాగుతున్నారు. రాజమహేంద్రవరం నగరానికి చెందిన జనసేన నాయకుడు కందుల దుర్గేష్ పర్యాటకశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన కూడా కాపు సామాజికవర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. రాజమహేంద్రవరంలో కాపు కల్యాణమండపానికి పవన్, దుర్గేష్ చొరవ చూపించి, కాపుల చిరకాల వాంఛను సాకారం చేయాలని కాపులు కోరుకుంటున్నారు. త్వరలో జరిగే పిఠాపురం జనసేన ప్లీనరీలో ఇందుకు నాంది పలకాలని కాపు కోరుతున్నారు. ప్రభుత్వం స్థలాన్ని కేటాయిస్తే సొంత నిధులతో కల్యాణ మండపాన్ని నిర్మించుకుంటామని కాపు నాయకులు చెబుతున్నారు.