అమిత్ షా గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టిన సోము!

బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, తాజా ఎమ్మెల్సీ సోము వీర్రాజు తన అభినందన సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గురించిన ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.…

 అమిత్ షా గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టిన సోము!

బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, తాజా ఎమ్మెల్సీ సోము వీర్రాజు తన అభినందన సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గురించిన ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. బిజెపిలో ప్రత్యర్థి వర్గం, గతంలో తాను గట్టిగా విమర్శించిన టిడిపి అధినేత చంద్రబాబునాయుడి కూటమి ప్రభుత్వం అధికారం ఉన్న నేపథ్యంలో సోముకు అసలు ఎమ్మెల్సీ పదవే దక్కదని భావించిన నేపథ్యంలో పార్టీ అధిష్టానం వద్ద పట్టు నిరూపించుకుని ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా మంగళవారం రాజమహేంద్రవరంలో అట్టహాసంగా సోముకు అభినందన సభ జరిగింది. తొలుత ఆయనను భారీ ఊరేగింపుగా తోడ్కొని వచ్చారు. బుధవారం మీడియాకు ఆయన విందు కూడా ఇవ్వడం విశేషం. రెండు రోజుల క్రితం వరకు రాజమహేంద్రవరంలోనే ఉన్న రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపి దగ్గుబాటి పురంధరేశ్వరి, రాజమహేంద్రవరంలోనే ఉండే ఎమ్మెల్యేలు టిడిపికి చెందిన ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఈసభకు హాజరుకాకపోవడం గమనార్హం. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, మాజీ టిడిపి నేతలు, నేటి బిజెపి ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, సుజనాచౌదరితో పాటు, సోము వర్గానికి చెందిన పివిఎన్ మాధవ్, విష్ణువర్థన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

ఈసభలో సోము మాట్లాడుతూ అమిత్ షా రోజుకు రెండు గంటలు మాత్రమే పడుకుంటారని, మిగిలిన సమయమంతా ఎవరిని ఎక్కడ నొక్కలో అమిత్ షా నిరంతరం ఆలోచిస్తూ ఉంటారని వ్యాఖ్యానించడం గమనార్హం. తన ఎమ్మెల్సీ పదవి గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ… ఎప్పుడు ఏం చేయాలో భారతీయ జనతా పార్టీకి ఒక వ్యూహం ఉంటుందని, బీజేపీలో ఎవరికి ఎప్పుడు ఏ పదవి రావాలో అప్పుడు వస్తుందని వ్యాఖ్యానించారు. తనకు భవంతుడు ఒక అవకాశం కల్పించాడు, సంస్థ కూడా అవకాశం కల్పించింది. నాకు ఇది చాలు. “మంత్రి అవ్వాలంటే 2014లో సీటు ఇచ్చినపుడే అయ్యేవాడిని. అప్పటి పరిస్థితుల్లో పశ్చిమ గోదావరిలో తాడేపల్లి గూడెం అసెంబ్లీ, నరసాపురం పార్లమెంట్ కూడా గెలవాలంటే నేను రాజమండ్రి నుంచి పోటీ చేయడం భావ్యంకాదని భావించి పొత్తులో సీటు కేటాయించిన చంద్రబాబుకు చెప్పి, డా ఆకుల సత్యనారాయణకు సీటు ఇప్పించానని” వెల్లడించారు. సోము శిష్యుడు, కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ తనను బిజెపిలోకి తీసుకువచ్చింది సోము వీర్రాజేనని, 2024 ఎన్నికల్లో నర్సాపూర్ నుంచి పోటీ చేయాలని ఒక పారిశ్రామికవేత్త ప్రయత్నిస్తే తనకు సీటు ఇప్పించారని గుర్తుచేసుకున్నారు. తనకు కేంద్రమంత్రి పదవి రావడం కూడా సోము చలవేనన్నారు. ఏది ఏమైనా సోముకు పదవి రావడం, అట్టహాసంగా అభినందన సభ జరగడం ఆయన వర్గీయుల్లో జోష్ ను నింపింది. సోము వీర్రాజుకు పదవి దక్కడం ఎల్లో మీడియాకు ఇష్టం లేదన్నది వారి కవరేజీని బట్టి అర్థమవుతోంది. అదే పురంధరేశ్వరికి ఇలాంటి సభ జరిగితే వీలైతే మెయిన్ పేజీలో కనీసం జిల్లా ఎడిషన్ లో మొదటి పేజీలో వార్త కవరయ్యేదని విశ్లేషిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను విమర్శిస్తున్నందున నీలిమీడియాలో కూడా సోముకు ప్రాధాన్యత తగ్గింది.

Leave a Reply