అన్న రాజకీయ భవిష్యత్ కోసం తమ్ముడి త్యాగం తప్పదా?!

ఒకే రాజకీయ పార్టీలో ఉన్న సోదరులకు పార్టీ పదవులు లభిస్తాయోమో గానీ…ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మేయర్ సీట్లు…రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులు లభించడం చాలా అరుదు. జాతీయ స్థాయిలో రాహుల్…

 అన్న రాజకీయ భవిష్యత్ కోసం తమ్ముడి త్యాగం తప్పదా?!

ఒకే రాజకీయ పార్టీలో ఉన్న సోదరులకు పార్టీ పదవులు లభిస్తాయోమో గానీ…ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మేయర్ సీట్లు…రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులు లభించడం చాలా అరుదు. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ కుటుంబం….తెలంగాణాలో కెసిఆర్ – కెటిఆర్, ఎపిలో చంద్రబాబునాయుడు- లోకేష్, జనసేనాని పవన్ కల్యాణ్, నాగబాబు లాంటి ఉన్నతస్థాయి కుటుంబ పార్టీల నాయకత్వానికే ఇది సాధ్యమవుతుంది.
దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు చిన్న తనయుడు, యువతలో మంచి క్రేజ్ సంపాదించిన గణేష్ ఇటీవలే వార్తల్లో నిలుస్తున్నారు. వైసిపిలో నెలకొన్న ఆధిపత్యపోరు నేపథ్యంలో మాజీ ఎంపి మార్గాని భరత్ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ వైసిపి అనుబంధ కమిటీల నియామకాన్ని చేపట్టారు. భరత్ కు, గణేష్ కు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్నది వైసిపిలో ఏ కార్యకర్తను అడిగినా చెబుతారు. సహజంగానే గణేష్ సూచించిన పేర్లను భరత్ పక్కనపెట్టారని, దీంతో ఆయన వైసిపిని వీడుతున్నారని, తన రాజకీయ భవిష్యత్ కోసం జనసేన పార్టీలో చేరతారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈవార్తలపై ఆయన అధికారికంగా స్పందించకపోయినా…ఆయన రాజకీయ భవిష్యత్ పై చర్చ మొదలైంది.
సోదరుడు గణేష్ కు కొన్ని రాజకీయ ఆకాంక్షలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. రాజమహేంద్రవరం మేయర్ రేసులో కూడా ఆయన పేరు వినిపించింది. తాజాగా ఆయన అనుకూల పత్రికలో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ వైసిపి ఇన్చార్జిగా నియమించేందుకు జగన్ సంసిద్ధత వ్యక్తం చేశారన్న వార్త వచ్చింది. ఈవార్తలు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి.

మరోవైపు జక్కంపూడి కుటుంబం ఆది నుంచి మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆతరువాత ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వానికి కట్టుబడి ఉంది. పార్టీ పట్ల విధేయతకు మెచ్చి జగన్ జక్కంపూడి పెద్ద కుమారుడు రాజాకు రాజానగరం సీటును కేటాయించారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవిని కూడా కట్టబెట్టారు. దీనికి ప్రతిగా కూటమి ఉప్పెనలో గత ఎన్నికల్లో ఓడిపోయినా రాజానగరం నియోజకవర్గాన్ని రాజా ఇప్పటికీ వీడటం లేదు. ఈనేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అన్నదమ్ములిద్దరికీ ఒకే పార్టీలో పక్కపక్క నియోజకవర్గ సీట్లు కేటాయించే అవకాశం ఉంటుందా అన్నది చర్చనీయాంశం. మేయర్ సీటు విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుందని చెబుతున్నారు. అయితే మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కుటుంబంలో అందరూ పదవులు అనుభవించారు. మేయర్ గా ఆయన సతీమణి ఆదిరెడ్డి వీరరాఘవమ్మ, ఎమ్మెల్సీగా ఆయన, ఎమ్మెల్యేగా ఆయన కోడలు భవానీ, మరోసారి ఎమ్మెల్యేగా ఆయన కుమారుడు వాసు సీట్లు సాధించి, ఎన్నికయ్యారు. అయితే వారంతా ఒకేసారి ఈపదవులు చేపట్టలేదన్నది గమనార్హం. అలాంటి సందర్భంలో అన్నదమ్ములిద్దరిలో ఒకరు త్యాగానికి సిద్ధపడాల్సి ఉంటుంది. రాజమహేంద్రవరం పరిసర నియోజకవర్గాల్లో జక్కంపూడి కుటుంబానికి, ముఖ్యంగా గణేష్ కు మంచి కేడర్ ఉన్నా వైసిపిలో కొనసాగాల్సి వస్తే పార్టీ పదవులు మినహా ఎమ్మెల్యే, మేయర్ వంటి సీట్లు, రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులను, తన రాజకీయ ఆకాంక్షలను గణేష్ మర్చిపోవడం మంచిదని, ఒక వేళ తన రాజకీయ భవిష్యత్ ముఖ్యమని భావిస్తే పార్టీ మారాల్సి వస్తుందని సలహా ఇస్తున్నారు. అన్న రాజకీయ భవిష్యత్ కోసం తమ్ముడు తన భవిష్యత్ ను త్యాగం చేస్తాడా లేక పార్టీ మారి రాజకీయ భవిష్యత్ పొందుతారా అన్నది చర్చనీయాంశం. అన్నదమ్ములిద్దరూ చెరొక పార్టీలో ఉన్నా వారి అనుబంధంలో వచ్చే ఇబ్బందులేవీ ఉండబోవు. రాజమహేంద్రవరంలోని దొండపాటి సోదరుల కుటుంబాన్నే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దొండపాటి సోదరులు కాంగ్రెస్, టిడిపి, బిజెపిల్లో కొనసాగారు.

Leave a Reply