వర్మ మాదిరి అందరి ఖర్మా ఇంతేనా…పిఠాపురం నుంచి కూటమిలో బీటలు ప్రారంభం?!.

ఒడ్డు దాటే వరకు ఓడ మల్లన్న… ఒడ్డుకు చేరాక బోడి మల్లన్న లా ఉంది…పిఠాపురంలో వర్మ పరిస్థితి. మరో 15 ఏళ్ల పాటు కూటమిలో కొనసాగుతామని జనసేనాని,…

 వర్మ మాదిరి అందరి ఖర్మా ఇంతేనా…పిఠాపురం నుంచి కూటమిలో బీటలు ప్రారంభం?!.

ఒడ్డు దాటే వరకు ఓడ మల్లన్న… ఒడ్డుకు చేరాక బోడి మల్లన్న లా ఉంది…పిఠాపురంలో వర్మ పరిస్థితి.
మరో 15 ఏళ్ల పాటు కూటమిలో కొనసాగుతామని జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు గానీ…ఆచరణాత్మకంగా అది సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక్కడి వర్మలాగే జనసైనికులకు టిక్కెట్లు త్యాగం చేసిన టిడిపి నాయకుల ఖర్మ కూడా అలాగే ఉండబోతుందా అన్నది చర్చనీయాంశమైంది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే, స్థానిక టిడిపి ఇన్ చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ తన సీటును త్యాగం చేసి, పవన్ గెలుపు కోసం కృషిచేశారు. ఈవిషయాన్ని పలుసార్లు పవన్ కల్యాణ్ కూడా ప్రస్తావించారు. సీటును త్యాగం చేసిన వర్మకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని ఆయనతో పాటు, ఆయన అనుచరులు కూడా ఆశపడ్డారు. ఆయన ఆశలు అడియాశలయ్యాయి. అయితే ఇటీవల జరిగిన జనసేన ప్లీనరీలో ఇటీవలే ఎమ్మెల్సీగా ఎంపికైన పవన్ సోదరుడు నాగబాబు పిఠాపురంలో తన సోదరుడ్ని ప్రజలే గెలిపించారని, ఇది ఎవరైనా తమ ఘనతగా భావిస్తే వారి ఖర్మ అని వర్మను ఉద్దేశించి వ్యాఖ్యానించినట్లు భావిస్తున్నారు. ఆసమయంలో పవన్ కల్యాణ్ కూడా స్పందన లేకుండా ఉండటం గమనార్హం.
మరోవైపు ఎమ్మెల్సీగా ఎన్నికైన వెంటనే పిఠాపురం చేరుకున్న నాగబాబు స్థానిక టిడిపి ఇన్చార్జి వర్మను ఆహ్వానించకుండానే తన సోదరుడి నియోజకవర్గంలో ప్రభుత్వం తరుపున అభివృద్ధి, శంఖుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనడం వర్మకు పుండుమీద కారం చల్లినట్లైంది. దీంతో పిఠాపురంలో టిడిపి, జనసైనికుల మధ్య ఆధిపత్యపోరు ప్రారంభమైంది. ఈసందర్భంగా ఇరువర్గాలు తమ నాయకుడికి మద్దతుగా నినాదాలు చేసుకోవడంతో పాటు బలప్రదర్శనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గో బ్యాక్ నాగబాబు అంటూ నినాదాలు చేయడం గమనార్హం. ఈనేపథ్యంలో తనను దూషించారని జనసేన నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టిడిపి నాయకులపై కేసులు కూడా నమోదు చేయడం విశేషం.
జనసేన, టిడిపి మధ్య పొత్తు కొనసాగితే వర్మకు ఇక రాజకీయ భవిష్యత్ లేనట్టేనని విశ్లేషిస్తున్నారు. ఇదే పరిస్థితి జనసేన నెగ్గిన ఇతర టిడిపి నియోజకవర్గాల్లో కూడా ఉండబోతుందన్న ఆందోళన స్థానిక నాయకుల్లో వ్యక్తమవుతోంది. రాజమహేంద్రవరంనకు చెందిన పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నిడదవోలులో కూడా కింది స్థాయిలో ఆధిపత్యపోరు కనిపిస్తోంది. రాజానగరంలో కూడా దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రాజానగరం నుంచి జనసేన పార్టీ తరుపున బత్తుల బలరామకృష్ణ విజయం సాధించారు. మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, తాజా ఇన్ చార్జి బొడ్డు వెంకటరమణచౌదరి వర్గీయులు సామాజిక మాధ్యమాల్లో ఎవరికి వారే తమ నాయకుడి గురించి ప్రచారం చేసుకుంటున్నారు తప్ప కూటమిగా కలిసి తిరిగిన దాఖలాలు పెద్దగా కనిపించడం లేదు. ఒకే సామాజిక వర్గానికి చెందిన పెందుర్తి, బొడ్డులకు నామినేటెడ్ పదవులు దక్కడం గమనార్హం. ఈవిషయంలో టిడిపి అధినాయకత్వ వైఖరే సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పిఠాపురం విషయంలో పొత్తు ధర్మం, నాయకుల మధ్య ఆధిపత్యపోరుపై టిడిపి అధినాయకత్వం నుంచి అధికారికంగా స్పందన లేదు. ఈవిషయంలో టిడిపి అధినాయకత్వ వైఖరే సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పదవులు ఇచ్చి తమ కేడర్ ను బుజ్జిగిస్తుందా లేక వర్మ లాంటి నాయకుల కోసం పవన్ లాంటి నాయకులను వదులుకుంటుందా అన్నది వేచిచూడాల్సిందే. కూటమిలో టిడిపి, జనసేన మధ్య ఆధిపత్యపోరు ఇలాగే కొనసాగితే భవిష్యత్ లో కూటమికి బీటలు వారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటికి నాగబాబు భావి వ్యాఖ్యలు కూడా ఎంతగానో ఆజ్యంపోసే అవకాశాలు లేకపోలేదు.

Leave a Reply