టిడిపి విజయపరంపరను అడ్డుకునే వైసిపి మేయర్ అభ్యర్థి ఎవరో?!

గోదావరితీరాన ఉన్న సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వాణిజ్య కేంద్రం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికలు ఈఏడాదిలో నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈవిషయాన్ని పురపాలకశాఖ మంత్రి…

 టిడిపి విజయపరంపరను అడ్డుకునే వైసిపి మేయర్ అభ్యర్థి ఎవరో?!

గోదావరితీరాన ఉన్న సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వాణిజ్య కేంద్రం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికలు ఈఏడాదిలో నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈవిషయాన్ని పురపాలకశాఖ మంత్రి పి నారాయణ జూన్, జూలైల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తాజాగా 2027 గోదావరి పుష్కరాల నాటికి కొత్త పాలకవర్గం కొలువుదీరుతుందని చెప్పారు. నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ కూడా ఎన్నికలు జరుగుతాయని సూచనప్రాయంగా చెబుతున్నారు.
కార్పొరేషన్ ఏర్పడిన నాటి నుంచి వరుసగా 3సార్లు తెలుగుదేశం పార్టీ కార్పొరేషన్ లో విజయకేతనాన్ని ఎగురవేసింది. ఈసారి టిడిపికి చెందిన గన్ని కృష్ణ మేయర్ సీటును ఆశిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయని తనకు ఇది ఆఖరి పోరాటమని, తనకే మేయర్ సీటు కేటాయించాలని కోరుతున్నారు. మరోవైపు జనసేన పార్టీ తరుపున నగర ఇన్ చార్జి అత్తి సత్యనారాయణ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతి కూడా మేయర్ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
మేయర్ పదవి కోసం అధికారపక్షంలో అప్పుడే నేతలు హడావుడి పడుతుందడగా, ప్రతిపక్ష వైసిపిలో ఉలుకూపలుకూ లేదు. అధికారంలో ఉండగానే నగరపాలక సంస్థ ఎన్నికలు జరిపిస్తామని చెప్పిన నాయకులు ఇప్పుడు దాని ప్రస్తావనే తేవడం లేదు. కనీసం ఎన్నికలకు సంసిద్ధంగా ఉన్నామని కూడా చెప్పుకోలేకపోతున్నారు. బహుశా పార్టీలో నెలకొన్న ఆధిపత్యపోరు, అంతర్గత విభేదాలే ఇందుకు కారణం కావచ్చు.
మేయర్ సీటును ఓసి జనరల్ కు కేటాయించిన నేపథ్యంలో అంగబలం, అర్థబలం ఉన్న వైసిపి మాజీ కోఆర్డినేటర్ శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యం పోటీకి దిగవచ్చు. మేడపాటి షర్మిలారెడ్డి మేయర్ సీటును ఆశించి పోటీ చేసినా గత ఎన్నికల్లో ఆపార్టీ విజయం సాధించకపోవడంతో గత పాలకవర్గంలో ఫ్లోర్ లీడర్ గానే సంతృప్తి చెందాల్సి వచ్చింది. ఈఇద్దరు నాయకులు గెలుపుపై అనుమానంతోనో…ఆర్థిక కారణాలతోనో మేయర్ పదవిపై నోరు విప్పడం లేదు. శివరామసుబ్రహ్మణ్యం పూర్తిగా వ్యాపారాలకే పరిమితమై రాజకీయాన్ని పక్కన పెట్టేసినట్లు కనిపిస్తున్నారు. ఇక ప్రస్తుత నగర కోఆర్డినేటర్, మాజీ ఎంపి మార్గాని భరత్ రామ్ శిబిరం నుంచి కూడా ఒక్క పేరు కూడా వినిపించడం లేదు. రాజమహేంద్రవరంలో పార్టీపై పట్టు కోసం వైసిపి యువజన విభాగం నేత జక్కంపూడి గణేష్ కార్పొరేషన్ ఎన్నికల బరిలోకి దిగుతారన్న ప్రచారం వినిపిస్తోంది. అయితే మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మరోసారి రాజానగరం అసెంబ్లీ సీటును ఆశిస్తున్నందున గణేష్ కు అవకాశం దక్కకపోవచ్చన్న వాదన వినిపిస్తోంది. దీంతో ఆ పార్టీ మేయర్ అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారంలో ఉన్నప్పుడే కాస్తంత ఉత్సాహం చూపించిన వైసిపి పార్టీ శ్రేణులు కూడా ప్రస్తుతం కార్పొరేషన్ ఎన్నికల పట్ల పెద్దగా ఆసక్తి కనపరచడం లేదు.
గతంలో విద్యుత్ ఉద్యమం, తాజాగా యువత, నిరుద్యోగుల కోసం చేసిన ఉద్యమాల్లో రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వర్గీయులు నగర కోఆర్డినేటర్, మాజీ ఎంపి భరత్ రామ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి డుమ్మా కొట్టి, రాజా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనడం గమనార్హం. గత అనుభవాల దృష్ట్యా ముందుగా డబ్బు ఇస్తే తప్ప జన సమీకరణ చేయలేమని వార్డు ఇన్ చార్జిలు భరత్ కు నిర్మొహమాటంగా చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఈనేపథ్యంలో ఈమధ్య కాలంలో కూటమి ప్రభుత్వం అతిపెద్ద ప్రజావ్యతిరేక విధానాన్ని అమలు చేస్తే, వైసిపిలోని వర్గాలన్నీ ఏకమైతే తప్ప కూటమి పార్టీలను 4వ సారి కూడా కార్పొరేషన్ లో విజయ పరంపరకు అడ్డులేకపోవచ్చు. అయితే ఈవిశ్లేషణలు వైసిపి నాయకులకు రుచించకపోవచ్చు.

Leave a Reply